Abn logo
Mar 4 2021 @ 02:35AM

అడ్డదారిలో బంగారం స్మగ్లింగ్‌

  • గల్ఫ్‌ దేశాల నుంచి అక్రమ రవాణా
  • దుబాయ్‌ విమానంలో వచ్చిన..మహిళ వద్ద 1.6 కిలోలు లభ్యం

హైదరాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోకి అడ్డదారుల్లో బంగారం స్మగ్లింగ్‌ జోరందుకుంది. కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. గల్ఫ్‌ దేశాల నుంచి బంగారం అక్రమ రవాణాకు కళ్లెం పడడం లేదు. అరబ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారాన్ని పేస్టు రూపంలో, పౌడర్‌ రూపంలో, మిక్సీల్లోని మోటార్‌ వైండింగ్‌, బూట్లు, నడుము బెల్టు ఇలా వేర్వేరు రూపాల్లో తీసుకొస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి.. పురీష నాలంలో బంగారాన్ని జొప్పించి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమ బంగారం రవాణాదారులు అరెస్టవుతున్నా.. గల్ఫ్‌ దేశాల్లో ఉంటూ.. నెట్‌వర్క్‌ను నడుపుతున్న బడా స్మగ్లర్ల జాడను అధికారులు కనుక్కోలేకపోతున్నారు. తాజాగా దుబాయ్‌ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 1.6 కేజీల బంగారాన్ని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో బంగారం అక్రమ రవాణా వ్యవహారం మరోసారి బయట పడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన విమానం ఎఫ్‌జడ్‌-8779లోని మహిళా ప్రయాణికురాలి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో.. కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 


ఆమె వద్ద పేస్ట్‌ రూపంలో రూ.74.87 లక్షల విలువ చేసే 1.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌తోపాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) తనిఖీల్లోనూ విదేశాల నుంచి అక్రమంగా తరలివస్తున్న బంగారం తరచూ పెద్దమొత్తంలో పట్టుబడుతూనే ఉంది. బంగారానికి ఎక్కువగా ఆదరణ ఉన్న దేశాల్లో భారత్‌దే మొదటి స్థానం. బంగారం దిగుమతులపై కేంద్రం విధించే పన్నులు, సుంకాల కారణంగా.. బంగారం ధర విదేశాలతో పోలిస్తే కిలోకు ధర సుమారు 4 నుంచి 5 లక్షల దాకా ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పన్నులను తప్పించుకునేందుకు స్మగ్లర్లు అక్రమ మార్గాల్లో బంగారాన్ని తీసుకొస్తున్నారు. యూఏఈ, ఖతార్‌, సౌదీ అరేబియా, జెడ్డా, హాంగ్‌కాంగ్‌, ఓమన్‌, థా య్‌లాండ్‌, శ్రీలంక, బహ్రెయిన్‌, మలేసియా, సింగపూర్‌ నుంచి ఎక్కువగా భారత్‌కు అక్రమంగా బంగారం దిగుమతి అవుతోంది.

Advertisement
Advertisement
Advertisement