‘సీతారామ’తో ఆయకట్టు రక్షణ

ABN , First Publish Date - 2021-04-12T05:29:00+05:30 IST

‘సీతారామ’తో ఆయకట్టు రక్షణ

‘సీతారామ’తో ఆయకట్టు రక్షణ
డోర్నకల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వాసిత రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో కొమురయ్య(ఫైల్‌)

కృష్ణా పరివాహక  ప్రాంత భూములను కాపాడేలా ప్రభుత్వ కృషి

గోదావరి నుంచి నీటిని లిఫ్ట్‌ చేసేలా ఏర్పాట్లు 

సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూపకల్పన  

జిల్లాలో ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి అడ్డంకులు 

ఎకరాకు రూ.30 లక్షలు చెల్లించాలని రైతుల డిమాండ్‌ 

రూ.10.50 లక్షలు చెల్లించేలా ప్రభుత్వ ప్రతిపాదన  


కృష్ణనదిపై నిర్మించిన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఎడమకాల్వ (లాల్‌ బహుదూర్‌ కాల్వ) ఆధారంగా రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ కృష్ణ జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. కృష్ణ, దాని ఉపనదులపై ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ఆనకట్టలు నిర్మించడంతో కృష్ణ నదిలో నీటి లభ్యత తగ్గిపోయింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌, తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం ప్రాజెక్టులు నిండిన తర్వాతే మిగులు జలాలను సాగర్‌కు వదులుతుండడంతో ఇక్కడి ఆయకట్టుకు సకాలంలో నీళ్లు అందడం లేదు. దీంతో వరి నాట్లు ఆలస్యమై పంటలు పండక రైతులు నష్టపోతున్నారు. దీని నుంచి గట్టెక్కించేందుకు కృష్ణా పరివాహక ఆయకట్టును కాపాడుకునేందుకు ప్రభుత్వం సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి జిల్లాలో 25 కిలో మీటర్ల మేర భూ సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.


డోర్నకల్‌, ఏప్రిల్‌ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని గోదావరి నది నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించి రైతాంగానికి రెండు పంటలకు సాగునీరందించేలా ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. మహబూబాబాద్‌ జిల్లాలో 25 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 


అశ్వాపురం వద్ద ప్రారంభమై ముల్కలపల్లి, పెనుబల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, కామేపల్లి మీదుగా జిల్లాలోని గార్ల, డోర్నకల్‌ నుంచి ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కుసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా కాలువ నిర్మాణానికి భూములను సర్వే చేయాలని అధికారులకు  ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కింది మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.10.50 లక్షల పరిహారం చెల్లించేలా ప్రభుత్వం  ప్రతిపాదించింది. మైదాన ప్రాంత భూములకు ఇక్కడ అధిక డిమాండ్‌ ఉందని కనీసం ఎకరాకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై భూ నిర్వాసితులతో మాట్లాడేందుకు అధికారులు కృషి చేస్తున్నా రైతులు అధికారులకు సహకరించడం లేదు.  రూ.30 లక్షలు చెల్లిస్తేనే సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు. 


సీతారామ ప్రాజెక్టుతో ఉపయోగాలు.. 

215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానది నీటితో నిండిన తర్వాత నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి ఆలస్యమవుతుండంతో సాగర్‌ ఆయకట్టులో వరినాట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాగర్‌ ఎడమ కాల్వ మొత్తం నీటి కేటాయింపులు 132 టీఎంసీలు కాగా అందులో జోన్‌-3 పరిధిలోని కృష్ణ జిల్లాకు 32 టీఎంసీల జలాలను కేటాయించగా మిగితా 100 టీఎంసీల ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు సాగర్‌ ఆయకట్టు రైతుల భూములు బీడు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నీటి లభ్యత అత్యధికంగా ఉన్న గోదావరి నది నుంచి నీటిని లిఫ్ట్‌ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసి,  సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పాలేరు రిజర్వాయర్‌కు నీటి తరలించి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు కృషి చేస్తోంది. సుమారు రూ. 1230 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీలుగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. పాలేరు రిజర్వాయర్‌ నుంచి ప్రస్తుతం ఉన్న కాలువ ద్వారా గ్రావిటీతో దిగువకు  నీటిని తరలించేలా ఇంజనీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌కు 4,500 క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కాల్వ ద్వారా ఒక సీజన్‌లో సుమారు 80 టీఎంసీల నీటిని తరలించనున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.  


భూసేకరణలో ఇబ్బందులు.. 

అశ్వాపురం నుంచి ముల్కలపల్లి, పెనుబల్లి, జూలురుపాడు, ఏన్కూరు, కామేపల్లి, గార్ల, డోర్నకల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లోని వేలాది ఎకరాల భూమి కాల్వ నిర్మాణానికి అవసరమవుతున్నందున భూసేకరణ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. సీతారామప్రాజెక్టు ప్రధాన కాల్వ నిర్మాణం ఎక్కువ భాగం ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో 1/70 చట్టం  మేరకు ఏజెన్సీ రైతులకు ఎకరాకు రూ.10.50 పరిహారం ఇస్తున్నారు. డోర్నకల్‌ మండలం ఏజెన్సీయేతర ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు ఏమాత్రం అంగీకారం కాదని మండలంలోని రైతులు తేల్చి చెబుతున్నారు. డోర్నకల్‌, ఉయ్యాలవాడ బూరుగుపాడు కన్నెగుండ్ల, మన్నెగూడెం, రావిగూడెం ఉమ్మడి గ్రామపంచాయతీల్లో గల 534 మంది రైతులకు చెందిన 611 ఎకరాల భూమి అవసరం ఉన్నట్లు రెవెన్యు అధికారులు చెబుతున్నారు. అధికారులు, రైతులకు మధ్య సంధి కుదరకపోవడంతో భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 



Updated Date - 2021-04-12T05:29:00+05:30 IST