Abn logo
Dec 2 2020 @ 00:00AM

వీధి బాలల సిస్టర్‌

ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం... మంచి జీతం... జీవితం. కానీ పాతికేళ్లుగా రైల్వే స్టేషన్లు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, పార్క్‌లు, ఫ్లైఓవర్లతోనే ముడిపడింది ఆమె ప్రయాణం. వాటి దగ్గర నా అన్నవాళ్లు లేక... ఒంటరిగా బతుకు పోరాటం చేస్తున్న వీధి బాలలకు అమ్మై... గురువై... అన్నం పెట్టి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు సిస్టర్‌ సెలైన్‌ అగస్టిన్‌ మేరీ. ఆమె నిస్వార్థ సేవా రప్రస్థానం ఇది... 


ఎన్నో ఆశలతో పైచదువుల కోసం జర్మనీ వెళ్లారు సెలైన్‌ అగస్టిన్‌ మేరీ. అయితే ఆరోగ్యం బాగోక మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. నిరాశతో తమిళనాడులోని తన సొంత పట్టణం సేలంకు తిరుగు ప్రయాణమయ్యారు. ఇది దాదాపు ఇరవై ఐదేళ్ల కిందటి కథ. కానీ మేరీలోని పరోపకార గుణం, మానవతా దృక్పథం ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా స్థిరపడిన ఆమెను వీధి బాలల దయనీయ దృశ్యాలు కదిలించాయి. చుట్టూ ఇంతమంది జనం ఉండి అనాథల్లా రోడ్లపైనే కాలం వెళ్లదీస్తున్న వారి అభ్యున్నతికి ఏదో ఒకటి చేయాలని ఆ క్షణంలోనే సంకల్పించారు. అది మొదలు ప్రభుత్వాస్పత్రులు, రైల్వే స్టేషన్లు, పార్కులు, ట్రాఫిక్‌ సిగ్నళ్ల చుట్టూ తిరిగారు. అనాథ బాలలను వెతికి పట్టుకున్నారు. ఒకటి రెండు కాదు... పాతికేళ్లుగా సేలంలో పాదయాత్రలా ఆమె ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంది. 


దైవ మార్గం... సేవాభావం... 

అగస్టిన్‌ మేరీకి సేవా గుణం చిన్ననాడే అబ్బింది. బడికెళ్లే రోజుల్లోనే రోడ్డు పక్కనున్న పేద పిల్లల కడుపు నింపడానికి తన పాకెట్‌ మనీతో భోజనం పెట్టించేవారు. మేరీ తండ్రి కూడా ఒక అనాథే కావడం వల్ల ఎవరూ లేని ఒంటరి బతుకులు నెట్టుకు రావడం ఎంత కష్టమో ఆమెకు బాల్యంలోనే అర్థమైంది. తండ్రి నేపథ్యం ఆమెపై ప్రభావం చూపింది. పదిహేడేళ్ల వయసులో టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సులో చేరిన మేరీ... తనకు కావల్సింది ఇది కాదని తెలుసుకున్నారు. ట్రైనింగ్‌ పూర్తి చేసిన తరువాత దైవ మార్గంలో నడిచి, సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్నారు. ఆ క్రమంలోనే నన్‌గా మారాలని నిర్ణయించుకొని జర్మనీ వెళ్లారు. ఆ తరువాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో 1994లో తిరిగి భారత్‌కు వచ్చేశారు. ఎందరికో కొత్త జీవితం... 

జర్మనీ నుంచి సేలంలో దిగిన మేరీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌ ఉద్యోగం సంపాదించారు. చేతిలో టీచర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉండడం ఆమెకు కలిసివచ్చింది. ఒక పక్క వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు వీధి బాలల బాధ్యతను కూడా భుజాలపై వేసుకున్నారు.  రోడ్డుపై నడుచుకొంటూ వెళుతున్నప్పుడు పేద పిల్లలెవరన్నా కనిపిస్తే ఆగి, పలుకరిస్తారు. వివరాలు అడుగుతారు. వారికి తానేమైనా సాయం చేయగలనేమో ఆలోచిస్తారు. ‘‘ఒక రోజు ఓ పిల్లాడు ఏదో అమ్ముతూ కనిపించాడు. వాడి దగ్గరకు వెళ్లాను. పేరు జయసూర్య. చూడ్డానికి ఇంటర్‌ విద్యార్థి వయసు ఉంటుంది. ‘ఇంటర్‌లో నీకు మంచి మార్కులు వచ్చాయి కదా’ అని అడిగాను. వాడు ఆశ్చర్యపోతూ ‘మీకెలా తెలుసు’ అన్నాడు. ‘నువ్వు తెలివైన అబ్బాయివని నాకు అర్థమైంది’ అన్నాను. ‘ఒకవేళ చదివే అవకాశం ఉంటే మంచి మార్కులు తెచ్చుకొని ఉండేవాడిని’ అంటూ నిరాశగా చెప్పాడు. దీంతో అతని కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేసి, కాలేజీ విద్య పూర్తయ్యే వరకు నేనే చదివిస్తానని  హామీ ఇచ్చాను’’ అన్నారు మేరీ. జయసూర్య ఒక్కడినే కాదు, ఇలా రోజూ ఎవరో ఒకరిని కలుస్తూనే ఉంటారు. వారందరి కోసం ‘లోటస్‌’ పేరుతో ఓ ట్రస్ట్‌ను ఆమె నెలకొల్పారు. 


ఇంజనీర్లు... డాక్టర్లు... 

అలా ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా అనాథలు, అభాగ్యులైన పిల్లలను చేరదీసి, ఆశ్రయం కల్పించి, మెరుగైన విద్య అందించారు మేరీ. అంతేకాదు... ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే చదువు ఆపేసిన విద్యార్థులకు కూడా అన్నీ తానై విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. జర్మనీలోని ఆమె పరిచయస్తులు కూడా వాలంటీర్లుగా మారి, సేలం వచ్చినప్పుడల్లా పాఠాలు బోధిస్తున్నారు. ఆమె అండతో చదువుకున్నవారిలో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. ఉన్నతమైన జీవనం గడుపుతున్నారు. 


పెళ్లికి దాచిన డబ్బులతో... 

ట్రస్ట్‌ అయితే పెట్టారు కానీ... మేరీకి అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. మూడేళ్లలో ఆమె తొమ్మిది ఇళ్లు మారాల్సి వచ్చింది.  కారణం... ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు పిల్లలను చేరదీసి, ఇంటికి తేవడమే!  దీంతో మేరీ సాయం కోసం తల్లిదండ్రులను ఆశ్రయించకతప్పలేదు. ‘‘నా పెళ్లికని దాచిన డబ్బు ఇవ్వమని అడిగాను. నాన్న 50 వేల రూపాయలు ఇచ్చారు.   ఆ డబ్బుతో కొంతమంది పిల్లలకు స్కూల్‌ ఫీజులు కట్టాను. అప్పుడు అమ్మానాన్న నా సేవా కార్యక్రమాల కోసం ఒక స్థలం కొనిచ్చారు. బంధువులు కూడా తలో చెయ్యి వేశారు. దాంతో సేలం చుట్టుపక్కల మరికొన్ని ఖాళీ స్థలాలు కొన్నాను. పిల్లల కోసం ఇల్లు కట్టించాను. మిగిలిన సొమ్మును ట్రస్ట్‌ నడిపించడానికి, పిల్లలకు విద్యనందించడానికి ఉపయోగించాను’’ అని మేరీ చెప్పుకొచ్చారు. 


జీతమంతా ట్రస్ట్‌కే... 

ఉపాధ్యాయురాలిగా వచ్చిన జీతం వచ్చినట్టు ట్రస్ట్‌ కార్యకలాపాలకే వాడుతున్నారు మేరీ. అయితే ఇది సరిపోదు. మరి ఏం చేయాలి? నిధులు ఎలా సమకూర్చుకోవాలి? దీని కోసం ఆమె సుమారు నాలుగువేల మంది వివరాలు నమోదు చేసుకున్నారు.  రోజూ రెండొందల మందికి ఆమె కాల్‌ చేసి, సాయం అడుగుతారు. ఇన్నేళ్లుగా అలాంటి దాతల సహకారంతోనే నడిపిస్తున్నారు. స్కూల్లో ఇంగ్లిష్‌ బోధించే మేరీ... చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కూడా తీసుకొంటారు. 


కరోనా సమయంలోనూ... 

ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ఆమె భయపడి ఇంట్లో కూర్చోలేదు. చేసే పని పోయి, చేతిలో డబ్బు లేక పస్తులుంటున్న వారికి కడుపు నిండా భోజనం పెట్టారు. ఈ క్రమంలోనే మేరీకి సొంతంగా ఏకోపాధ్యా పాఠశాల నడిపిస్తున్న ఓ టీచర్‌ కనిపించారు. ‘‘ఆ స్కూల్‌ను నిర్వహించడానికి రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశానని సదరు ఉపాధ్యాయుడు నాకు చెప్పారు. ఇక తనవద్ద డబ్బు లేదని, బడి మూసేయక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే ఆ విద్యార్థుల భవిష్యత్‌ ఏమవుతుందని ఆలోచించి దీంతో భారమైనా కొద్ది వారాల కిందట ఆ బడిని నేనే దత్తత తీసుకున్నాను’ అని చెబుతారు మేరీ. 


కేన్సర్‌ను లెక్క చేయకుండా... 

నరనరాల్లో సేవా స్ఫూర్తి నింపుకున్న అగస్టిన్‌ మేరీ తనకంటూ ఏమీ దాచుకోలేదు. అసలు ఆమెకు అలాంటి ఆలోచనే ఎప్పుడూ రాలేదు. ‘‘వ్యక్తిగత అవసరాలకు నాకు పెద్దగా డబ్బు అక్కర్లేదు. నాకంటూ ఉన్నది అట్టడుగు వర్గాల పిల్లలే. వారి కోసమే ఈ జీవితం’’ అంటున్న మేరీ ఐదేళ్లప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇది చాలదన్నట్టు చాలా ఏళ్లుగా కేన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. 

అయితే ఇవేవీ తన సంకల్పానికి అడ్డుగా భావించలేదు. ‘‘జీవితమన్నాక ఒడుదొడుకులు సాధారణమే. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. రెండు మూడేళ్ల కంటే బతకనని చాలా సందర్భాల్లో వైద్యులు చెప్పారు. కానీ ఇంతకాలం లాక్కొచ్చాను. నా గురించి నాకు ఎలాంటి బాధా లేదు’’ అంటారామె.


ఈ జీవితానికి ఇది చాలు...

మేరీతో మాట్లాడుతుంటే, ఆమె గురించి వింటుంటే ఎవరిలోనైనా భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. కళ్లు చమర్చుతాయి. ఇంత నిస్వార్థంగా ఎలా ఉండగలుగుతారు? ఇదే ప్రశ్న ఆమెను అడిగితే... ‘‘విశ్వాసం, ధైర్యం, దైవభక్తి. ఇవే నన్ను నడిపిస్తున్నాయి. ఈ ప్రపంచాన్ని మార్చేయలేనని తెలుసు. కానీ నేను విన్న, చూసిన పిల్లలకు సాయం చేయగలుగుతున్నాను కదా! ఒక మనసున్న మంచి మనిషిగా, పరోపకారిగా ఈ జీవితాన్ని ముగిస్తే చాలు. నాకు అంతకు మించిన సంతృప్తి ఏమీ ఉండదు’’ అంటారు మేరీ. అందుకే అక్కడి వారి హృదయాల్లో ఆమె ‘మదర్‌ థెరెసా ఆఫ్‌ సేలమ్‌’గా ముద్ర వేసుకున్నారు.


ప్రత్యేకం మరిన్ని...