గాయకుడు ‘జై’ శ్రీనివాస్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-22T09:48:12+05:30 IST

‘ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం’ అంటూ ఐక్యత రాగాన్ని జోడించి ‘దేశం మనదే..

గాయకుడు ‘జై’ శ్రీనివాస్‌ కన్నుమూత

20 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ మృతి

మందమర్రిటౌన్‌, హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం’ అంటూ ఐక్యత రాగాన్ని జోడించి ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే’ అంటూ దేశభక్తి గీతాన్ని తన గొంతుతో హృద్యంగా వినిపించిన గాయకుడు నేరేడుకొమ్మ శ్రీనివాస్‌ అలియాస్‌ ‘జై’ శ్రీనివాస్‌ (41) ఇకలేరు. కరోనా సోకడంతో 20 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య స్వాతి, కూతుళ్లు అభిష్ణు, జైత్ర ఉన్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ సినిమాలో ‘దేశం మనదే...’ పాటతో గాయకుడిగా ఆయన మంచి గుర్తింపు పొందారు. శ్రీనివాస్‌ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. స్థానిక సింగరేణి పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. తండ్రి రామాచారి ఒక ప్రైవేటు స్కూల్‌ నిర్వాహకునిగా, సింగరేణిలో కేకే 3 గనిలో క్లర్కుగా పనిచేసి 2004లో గోల్డెన్‌షేక్‌హ్యాండ్‌ కింద ఉద్యోగ విరమణ పొందారు. శ్రీనివాస్‌ చిన్నప్పటి నుంచే స్టేజీ షోల్లో పాటలు పాడేవారు. సినిమాల్లో పాటలు పాడాలనే బలమైన కోరికతో హైదరాబాద్‌కు వెళ్లారు. ‘దేశం మనదే..’ పాటనే కాకుండా రాజారాణి సినిమాలో ‘ఓ బేబి ఓరకనులతో..’ పాట పాడారు. అలాగే నా చిట్టితల్లి, ‘బోనాల పాట ఢమ ఢమ డప్పుల మోత, తెలంగాణ జననీ తదితర  పాటలతో గుర్తింపు పొందాడు. శ్రీనివాస్‌  మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-22T09:48:12+05:30 IST