Abn logo
Feb 25 2021 @ 14:19PM

కథా రచయిత సింగమనేని కన్నుమూత

అనంతపురం: ప్రముఖ కథారచయిత, సాహితీ విమర్శకులు సింగమనేని నారాయణ కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సింగమనేని నారాయణ స్వస్థలం అనంతపురం జిల్లాలోని బండమీదపల్లి గ్రామం. 1943 జూన్ 23న జన్మించారు. 


సింగమనేని 43కు పైగా కథలు రాశారు. వీరు రచించిన మొట్ట మొదటి కథ ‘న్యాయమెక్కడ?’ 1960లో కృష్ణాపత్రికలో అచ్చయ్యింది. జూదం, సింగమనేని నారాయణకథలు, అనంతం, సింగమనేని కథలు అనే కథా సంపుటాలను, ఆదర్శాలు - అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు అనే నవలలు రాశారు. సీమకథలు, ఇనుపగజ్జెలతల్లి, తెలుగు ‘కథలు - కథన’ రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ‘తెలుగు కథ’ మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సంభాషణ పేరుతో ఒక వ్యాస సంపుటిని కూడా వెలువరించారు.


సింగమనేని మృతిపట్ల సాహితీ ప్రేమికులు సంతాపం తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ..  విశాలాంధ్ర ఎడిటోరియల్ బోర్డు మెంబర్‌గా ఉన్న నారాయణ మృతి బాధాకరమన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement