ట్రంప్‌కే జై కొడుతున్న సిక్కు సమాజం !

ABN , First Publish Date - 2020-10-28T22:52:55+05:30 IST

అమెరికాలోని సిక్కుల్లో అత్యధికులు ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌వైపే మొగ్గుచూపుతున్నారు.

ట్రంప్‌కే జై కొడుతున్న సిక్కు సమాజం !

వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని సిక్కుల్లో అత్యధికులు ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌వైపే మొగ్గుచూపుతున్నారు. తాము ట్రంప్‌కు మద్దతు తెలపడానికి ప్రధాన కారణం అమెరికాలోని చిన్న వ్యాపారాలు, భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడానికి అధ్యక్షుడు అవలంబిస్తున్న విధానాలే అని అమెరికాలోని సిక్కు సమాజం ముఖ్య నేతలు చెబుతున్నారు. నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంపే గెలవాలని కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు. హోరాహోరీ పోరు ఉండే మిచిగాన్, విస్కాన్సిన్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో సిక్కులు ఉన్నారు. వీరందరూ ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌వైపే మొగ్గుచూపుతున్నారని విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన ప్రముఖ సిక్కు నాయకుడు, వ్యాపారవేత్త దర్శన్ సింగ్ ధలివాల్ అన్నారు. 


"భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు, ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిక్కులు మద్దతు ఇస్తున్నారని" ఆయన అన్నారు. "ఇక కమలా గురించి మాట్లాడాలంటే ఆమె డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థి. ఆమె భారత సంతతి మహిళ... అయినా భారత్‌కు వ్యతిరేకం. కానీ, ట్రంప్ అలా కాదు. ఆయన పూర్తిగా ఇండియాకు మద్దతుగా ఉన్నారు. ఈ రెండు కారణాలతోనే తాము ట్రంప్‌కు సపోర్ట్ చేస్తున్నం" అని దర్శన్ సింగ్ చెప్పుకొచ్చారు. అంతేగాక ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి ఎన్నిక కాకపోతే, చైనా మమ్మల్ని చాలా కష్టపెట్టడం ఖాయమని ఆయన తెలిపారు.


మరో సిక్కు నేత జాస్సీ సింగ్ మాట్లాడుతూ... ఈసారి తాము పూర్తిగా ట్రంప్‌కే మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇది ట్రంప్ పట్ల సిక్కు సమాజానికి మద్దతు తెలపడంలో చెప్పుకోదగ్గ మార్పుగా ఆయన అభివర్ణించారు. "2016 ఎన్నికల్లో మా సిక్కు సమాజంలోని చాలా మంది ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. కానీ, ఈ ఎన్నికల్లో చాలా సిక్కులు ట్రంప్‌కే ఓటు వేయబోతున్నారు. మా పూర్తి మద్దతు ఆయనకే" అని జాస్సీ సింగ్ అన్నారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో సిక్కు సమాజం కీలక పాత్ర పోషించబోతుందని సింగ్ పేర్కొన్నారు.


ఇల్లినాయిస్‌లోని సిక్కు గురుద్వారా సిల్విస్ అధ్యక్షుడు జస్వీందర్ సింగ్ జాస్సీ మాట్లాడుతూ.. చిన్న వ్యాపార వర్గాల కోసం ట్రంప్ చేసిన కృషి, భారతదేశం-అమెరికా సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాల కారణంగా సిక్కులు ఈసారి ట్రంప్‌కు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని అన్నారు. 

Updated Date - 2020-10-28T22:52:55+05:30 IST