UK: యూకేలో దారుణం.. నడిరోడ్డుపై సిక్కు పూజారిపై దాడి.. సీసీటీవీ దృశ్యాలతో..

ABN , First Publish Date - 2022-09-11T16:34:36+05:30 IST

యూకేలోని (UK) మాంచెస్టర్‌లో 2022 జూన్ 23న సిక్కు పూజారిపై (Sikh priest) దాడి ఘటనకు సంబంధించి బుధవారం పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

UK: యూకేలో దారుణం.. నడిరోడ్డుపై సిక్కు పూజారిపై దాడి.. సీసీటీవీ దృశ్యాలతో..

లండన్: యూకేలోని (UK) మాంచెస్టర్‌లో 2022 జూన్ 23న సిక్కు పూజారిపై (Sikh priest) దాడి ఘటనకు సంబంధించి బుధవారం పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 28 ఏళ్ల యువకుడి చేతిలో 62 ఏళ్ల బాధితుడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి మెదడుకు తీవ్ర గాయమైందని అక్కడి మీడియా పేర్కొంది. ఇక సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ప్రజల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని మాంచెస్టర్ పోలీసులు వెల్లడించారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూన్ 23 (గురువారం) సాయంత్రం 6.30 గంటలకు మాంచెస్టర్ సిటీలోని టిబ్ స్ట్రీట్ రోడ్డులో అచేతనంగా పడివున్న వ్యక్తిని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నార్త్ వెస్ట్ అంబులెన్స్ సర్వీస్ ద్వారా బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు హిల్టన్ స్ట్రీట్ జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బాధితుడిపై విచక్షణరహితంగా దాడికి తెగబడినట్లు గుర్తించారు. బాధితుడు స్పృహకోల్పోయి కింద పడిపోవడంతో చనిపోయినట్లు భావించి నిందితుడు ఘటనాస్థలి నుంచి నడుచుకుంటూ ఓల్డ్‌హామ్ స్ట్రీట్‌ ఎడమవైపుకు పారిపోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. 


బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని నెట్టింట విడుదల చేసి, నిందితుడి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. దాంతో నిందితుడిని గుర్తించడం సులభతరం అయిందని లాంగ్‌సైట్ సీఐడీకి చెందిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మార్క్ అస్ట్‌బరీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. నేరస్థుడిని పట్టుకునేందుకు కుటుంబ సభ్యుల అనుమతితో సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేయాలని నిర్ణయించామని, ఈ నిర్ణయమే తమకు నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు హెల్ప్ అయిందని సీఐడీ అధికారి మార్క్ తెలిపారు. నిందితుడి దాడి కారణంగా బాధితుడి జీవితం విషాదకరంగా మారిందన్నారు. నిందితుడి దాడిలో సిక్కు పూజారి మెదడు దెబ్బతినడం బాధకరమన్నారు. ఈ ఘటన బాధితుడి జీవితాన్నే మార్చేసిందని, నిందితుడికి కఠిన శిక్షపడే అవకాశం ఉందని మార్క్ అస్ట్‌బరీ చెప్పుకొచ్చారు.  



Updated Date - 2022-09-11T16:34:36+05:30 IST