ట్రైనీ ఎస్సైపై ఎస్సై అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2021-08-04T08:22:09+05:30 IST
ఒక సామాన్య దళిత మహిళ కాస్తోకూస్తో చదువుకోవడమే చాలా కష్టం. అలాంటిది చదువు పూర్తి చేసుకుని ఎస్సైగా కూడా ఎంపికైంది ఆమె.
మహిళా ప్రొబెషనరీ ఎస్సైపై మరిపెడ ఎస్సై అఘాయిత్యం
వరంగల్ సీపీకి బాధితురాలి లిఖితపూర్వక ఫిర్యాదు
సస్పెండ్ చేస్తూ నార్త్‌జోన్ ఇన్చార్జి ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు
వరంగల్ అర్బన్ క్రైం/మహబూబాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఒక సామాన్య దళిత మహిళ కాస్తోకూస్తో చదువుకోవడమే చాలా కష్టం. అలాంటిది చదువు పూర్తి చేసుకుని ఎస్సైగా కూడా ఎంపికైంది ఆమె. కఠినమైన శిక్షణను సైతం పూర్తి చేసుకుంది. అయినా, ప్రొబెషనరీ సమయంలో ఎస్సై రూపంలో పెద్ద ప్రమాదం ఎదురయ్యింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన దళిత యువతి 2020లో ఎస్సైగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకోగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించారు. ఇటీవల ఆమెను మరిపెడ పీఎ్‌సలో ప్రొబెషనరీ ఎస్సైగా నియమించారు. అవివాహిత అయిన ఆమె పోలీసు స్టేషన్ సమీపంలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఎస్సై శ్రీనివా్‌సరెడ్డి వద్ద శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 11.38 గంటలకు ఎస్సై శ్రీనివా్‌సరెడ్డి ట్రైనీ మహిళా ఎస్సైకి ఫోన్ చేసి, ‘నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది.
మనం వెంటనే తనిఖీలు చేయాలి. నాతో పాటు రావాలి’అని హుకుం జారీ చేశాడు. ఆ తర్వాత ఆమెను ప్రైవేట్ వెహికిల్‌లో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో వాహనం నిలిపివేసి, ట్రైనీ మహిళా ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా తన పశుబలంతో అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో ఆమె ముఖం, ఇతర శరీరభాగాలపై గాయాలయ్యా యి. విషయాన్ని బయటకు చెబితే పైఅధికారులకు తప్పుడు రిపోర్టు రాసి, సస్పెం డ్ చేయిస్తానని బెదిరించాడు. జరిగిన విషయాన్ని ఆమె తెల్లవారి కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సూచన మేరకు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని, లేదంటే ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని వేడుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులను రంగంలోకి దింపి కూపీ లాగారు.
ఎస్సైని సస్పెండ్ చేసిన ఐజీ
కేసు విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నియమించారు. సాయం త్రం మరిపెడ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ సమగ్ర విచారణ చేపట్టారు. ప్రాథ మి క దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు అం దజేశారు. వెంటనే ఎస్పీ ఆదేశాలతో ఎస్సై శ్రీనివా్‌సరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఎస్సై శ్రీనివా్‌సరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు వరంగల్ నార్త్‌జోన్ ఇన్చార్జి ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేశారు.
నిరసనలు
దళిత మహిళా ప్రొబెషనరీ ఎస్సైపై లైంగిక వేధింపులను నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకులు వరంగల్ సీపీ కార్యాలయానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. నిందితుడిని సర్వీసు నుంచి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీఎంఎం, ఎమ్మార్పీఎస్, టీపీసీసీ ఎస్సీ విభాగం, పీవోడబ్ల్యూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
