త్రిగుణాలు

ABN , First Publish Date - 2022-05-27T05:47:42+05:30 IST

మన చర్యలన్నిటికీ కారణం మన తలరాతేనని మనలో చాలామంది నమ్ముతూ ఉంటారు.

త్రిగుణాలు

మన చర్యలన్నిటికీ కారణం మన తలరాతేనని మనలో చాలామంది నమ్ముతూ ఉంటారు. కర్మను గుణాల (లక్షణాలు లేదా వ్యక్తిత్వాల) పరస్పర చర్య సృష్టిస్తుందనీ, అది జరగడానికి ఏ కర్తా కారణం కాదనీ ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు. గుణాలు ప్రకృతి నుంచి పుడతాయి, భౌతికమైన దేహంతో ఆత్మను బంధిస్తాయి. గుణాలు మూడు: సత్వ, రజో, తమో గుణాలు. ప్రతి ఒక్కరిలో ఇవి భిన్నమైన నిష్పత్తుల్లో ఉంటాయి. సత్వ గుణం అంటే జ్ఞానంతో అనుబంధం; రజో గుణం అంటే చర్య లేదా కర్మతో అనుబంధం. తమో గుణం అజ్ఞానానికీ, అజాగ్రత్తకూ దారి తీస్తుంది. 


ఎలకా్ట్రన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల కలయిక... విస్తృతమైన లక్షణాలతో వివిధ పదార్థాలను ఉత్పత్తి చేసినట్టే, త్రిగుణాల సమ్మేళనం మన స్వభావానికీ, చర్యలకూ బాధ్యత వహిస్తుంది. ఈ గుణ సమ్మేళనాల్లో ఒకటి... మనలో ప్రతి ఒక్కరూ వేరొకరిమీద ఆధిపత్యం వహించే ధోరణి కలిగి ఉంటుంది. వాస్తవానికి, వ్యక్తుల మధ్య పరస్పర చర్య అనేది వ్యక్తుల గుణాల మధ్య పరస్పర చర్య తప్ప మరొకటి కాదు. విద్యుదయస్కాంత క్షేత్రంలో.... రెండు ధ్రువాలు కలిగిన ఒక అయస్కాంతాన్ని ఉంచితే... అది ఆ క్షేత్రం వెంబడి పరిభ్రమిస్తూ ఉంటుంది. గురుత్వాకర్షక క్షేత్రం ద్వారా వస్తువులు ఆకర్షితం అవుతాయి. ఇలాంటి భౌతికత, రసాయన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా కర్మ అనేది  కర్త కారణంగా జరగదు, గుణాల వల్ల జరుగుతుంది. శ్రీకృష్ణుడు ప్రపంచం అంతర్నిర్మిత స్వయంచాలకతను తన ఉపదేశంలో సూచించాడు. ఆఖరికి మన శరీరం కూడా చాలావరకూ స్వయంచాలకతతోనే పని చేస్తుంది. 


గుణాలు, కర్మ మధ్య సంబంధాన్ని వివరించడానికి సారూప్యత ఒక చక్కటి సాధనంగా కనిపిస్తున్నా, సొంత అనుభవాలు వాటితో కలిసిపోయినప్పుడే సత్య సాక్షాత్కారం, పరివర్తన సాధ్యమవుతాయి.


ఈ జ్ఞానమార్గంలో ప్రధానమైన అడ్డంకి అహంకారం. మనం పెరిగిన పద్ధతి, పరిస్థితి మనమే కర్తలని నమ్మేలా చేస్తాయి. అహంకారం పెరిగేలా చేస్తాయి. కానీ వాస్తవానికి, ఈ మూడు గుణాల కలయికే కర్మను సృష్టిస్తుంది. మనం ఉన్నతమైన మార్గంలో ఎదిగే బాధ్యత అంతా పూర్తిగా మన మీదే ఆధారపడి ఉందనీ, ఇది జరిగేలా ఎవరూ చెయ్యలేరనీ కృష్ణుడు చెప్పాడు. 



కె.శివప్రసాద్‌,

 ఐఎఎస్‌

Updated Date - 2022-05-27T05:47:42+05:30 IST