సంగీత కళాకారులకు శ్రద్ధ సబూరి ముఖ్యం

ABN , First Publish Date - 2022-06-12T05:38:39+05:30 IST

ఆమె కచేరీ చేస్తే ఆడిటోరియంలో హర్షధ్వానాలు మిన్నంటుతాయి. ఆమె గాత్రానికి మైమరిచిపోని వారు ఉండరు. ఆమే కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణా సాయిరాం. ఆమె ఇటీవల విడుదలైన ‘అంటే సుందరానికి’ సినిమాలో ఒక పాట పాడారు. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం...

సంగీత కళాకారులకు శ్రద్ధ సబూరి ముఖ్యం

ఆమె కచేరీ చేస్తే ఆడిటోరియంలో హర్షధ్వానాలు మిన్నంటుతాయి. ఆమె గాత్రానికి మైమరిచిపోని వారు ఉండరు. ఆమే కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణా సాయిరాం. ఆమె ఇటీవల విడుదలైన ‘అంటే సుందరానికి’ సినిమాలో ఒక పాట పాడారు. ఆమెకిదే తొలి తెలుగు చిత్రం. ఈ సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలకరించింది. 


‘అంటే సుందరానికి’తో తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. ఆ విశేషాలు చెప్పండి?

తెలుగులో నాకిదే తొలిచిత్రం. చాలా ఎంజాయ్‌ చే స్తూ పనిచేశాను. ఈ సినిమాకు పనిచేయడం పలురకాల అనుభూతులను మిగిల్చింది. ఈ పాటలో భిన్న భావోద్వేగాలను గొంతులో పలికించాల్సి వచ్చింది. సాంగ్‌ కంపోజింగ్‌ జరిగేటప్పుడు రికార్డింగ్‌ థియేటర్‌లో వివేక్‌సాగర్‌, వివేక్‌ ఆత్రేయ ఇద్దరూ నాతో ఉన్నారు. వాళ్లు ఎలాంటి ఫీల్‌ రావాలనుకుంటున్నారో నాకు చక్కగా వివరించి రాబట్టుకునేవారు.  ఇదొక మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనిపించింది.  


వేలమంది మధ్యన కచేరి, స్టూడియోలో రికార్డింగ్‌ చేయడం..రెండింటిలో దేన్ని ఎక్కువగా ఇష్టపడతారు? 

నా మటుకు నాకు రెండూ కూడా చాలా ఉత్సాహాన్నిచ్చేవే. సినిమా పాటలకు పనిచేసే టీంలో ఫిలిం సౌండ్‌లో నిష్ణాతులు ఉంటారు. మన గొంతు నుంచి వచ్చే చాలా చిన్న చిన్న అపశ్రుతులు కూడా వారి ఎరుకలోకి వస్తాయి. వెంటనే మనకు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తారు. మనం మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టాల్సివస్తుంది. లైవ్‌లో కచేరి కోసం చేసే సాధన మరోలా ఉంటుంది. దాన్ని కల్పనా సంగీతం అంటారు. అక్కడ శ్రోతలను నేరుగా చూస్తూ పాడతాం కాబట్టి వారి స్పందన కు మనం ప్రతిస్పందిస్తాం. కచేరిలో మీరే సంగీత ప్రవాహంలో ఒక పరికరంగా మారి అలా వెళ్లిపోతుంటారు.  


మీ పాటల్లో కూర్పు, గానం కచ్చితత్వంతో ఉంటాయి. ఇది మీకు సాధన ద్వారా అబ్బిందా? సహజంగా వచ్చిందా?  పరిపూర్ణత కోసం మీ తపన ఫలితమా?


మీ ప్రశంసకు సంతోషంగా ఉంది. మనందరికీ పుట్టుకతోనే ఒక ప్రవృత్తి ఉంటుంది. జన్మతః కొన్ని గుణాలు అబ్బుతాయి. సంగీతం విషయంలో నా తల్లిగారి ప్రభావం నాపైన ఉంది.. ఆమె ఏం చేసినా చాలా పరిపూర్ణతో కోసం తపించేవారు. అదే అలవాటు నాకూ వచ్చిందనుకుంటాను. హృదయాంతరాళంలోంచి తపించకపోతే మీకు  పర్‌ఫెక్షన్‌ రాదు. అలాగని కేవలం పరిపూర్ణత మీదనే దృష్టి పెడితే మీకు మీరే శత్రువు అవుతారు. ఎప్పటికీ నిత్య విద్యార్థిగానే ఉండాలి. మన ం చేయగలిగినంత చేయాలి అనే తమిళ శైవసూక్తిని నమ్ముతాను. 




ప్రతి రోజూ మీ సాధన ఎలా ఉంటుంది?

తిండి, నిద్రలానే అభ్యాసం అనేది నా దైనందిన జీవితంలో ఓ భాగం అయిపోయింది. సంగీతానికి ప్రశాంతమైన మనస్సు చాలా అవసరం. చాలా రకాలుగా నా సాధన కొనసాగుతుంది.  రోజూ రెండు గంటలు చేస్తాను. ప్రాణాయామం, యోగాసనాల వల్ల శ్వాసమీద నియంత్రణ వస్తుంది. తర్వాత ఏకాగ్రత కోసం మంత్రజపం చేస్తాను. వయసులో ఉన్నప్పుడు అయితే గంటల తరబడి గాత్ర సాధన చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం కంఠశుద్ధి కోసం రోజూ ఓ గంట సేపు గాత్ర సాధన చేస్తున్నాను.  


మీ బాల్యం నాటి తీపి సంగతుల గురించి చెప్పండి?

మా తల్లితండ్రులది తమిళనాడులోని తంజావూరు, తిరనల్వేలి ప్రాంతం. ముంబై వచ్చారు. నేను అక్కడే పుట్టి, పెరిగాను. మా అమ్మగారు సంగీతం విద్యార్థులకు పాఠాలు నేర్పేవారు. అమ్మ పాడుతున్నప్పుడు వింటూ నేను ప్రభావితమయ్యాను. ఎం. ఎస్‌ సుబ్బలక్ష్మి అమ్మ, టీ. ఆర్‌ మహాలింగం సార్‌, శ్రీనివాస అయ్యర్‌, సుబ్రహ్మణ్యం, ఓలేటి వెంకటేశ్వర్లు గారు లాంటి ఆ కాలం మేటి సంగీతకారులు అంతా మా ఇంటికి వచ్చేవారు. గొప్పవాళ్లం అనేభావన వారిలో లేశమాత్రమైనా కనిపించేది కాదు. మాది చాలా చిన్న ఇల్లు. ఒక లివింగ్‌ రూమ్‌, వంటగది, పూజ గది మాత్రమే ఉన్నాయి. అయినా సాఽధారణ వ్యక్తుల్లా, చిన్నపిల్లల్లా మాతో కలసిపోయేవారు. చాలా సంతోషంగా గడిపేవారు. బాల్యంలోనే అలాంటి గొప్ప వ్యక్తుల సాంగత్యం దక్కడం సంగీతంపై నాలో అమితాసక్తిని పెంచింది. 


మీకు బాగా గుర్తుండిపోయే కచేరీ ఏది?

చాలా ఉన్నాయి. మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీలో ఇచ్చిన ప్రదర్శన నాకు మరపురానిది. అప్పటికి నేను జూనియర్‌ విభాగంలోనే ప్రదర్శన ఇచ్చేదాన్ని. కానీ ఆ విభాగంలో ఉండడం నాకు ఇష్టంలేదు. త్వరగా సీనియర్‌ విభాగంలో చేరాలనేది నా కోరిక. ఎందుకో ఆ రోజు అది నెరవేరబోతుందేమో అని అనిపించింది. ఆ సమయంలో అకాడమీలో రెండు గంటలు పాటు  సోలోగా ప్రదర్శన ఇచ్చాను. నేనూ, పక్కన వయోలిన్‌, మృదంగం మాత్రమే. మధ్యాహ్నం 2-30 గంటల నుంచి 4-30 గంటల వరకూ నాకు సమయం కేటాయించారు. ఆ రోజు న న్ను నేను మరచిపోయి పూర్తిగా లీనమై ప్రదర్శన ఇచ్చాను. ప్రేక్షకులను పట్టించుకునే స్థితిలో లేను. ఆహుతుల్లో చాలామంది సంగీత  రంగంలో నిష్ణాతులు. అలాంటి వాళ్లని మెప్పించడం ఓ పట్టాన సాధ్యంకాదు. ఆ రోజు మాత్రం ప్రదర్శనలో నా నోటి నుంచి చివరి కవితాపంక్తులు రాగానే ఒక్కసారి శ్రోతలు అందరూ లేచి నిల్చొని హర్షధ్వానాలు చేశారు. ఆ  సంఘటన నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. వేదిక దిగగానే గుంపులుగా జనాలు నా దగ్గరకు వచ్చి, అభినందించారు. 


ఇప్పుడు శాస్ర్తీయ సంగీతాన్ని పక్కనపెట్టి, కొత్త తరహా పోకడలకు పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలపై మీ స్పందన?

సంగీతానికి సాంకేతిక హంగులు తోడవుతున్నాయి. కొత్తకొత్త సాంకేతిక పరికరాలు వస్తున్నాయి. మార్పు ఎప్పుడూ మంచిదే. మనం దాన్ని విమర్శించవలసిన అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా మంచి మాత్రమే ఎప్పటికి నిలిచిపోతుంది. ఏది మంచి అనేది కాలమే నిగ్గు తేలుస్తుంది. సంప్రదాయ  సంగీతాన్ని మనం ఇప్పుడు క్లాసిసిజం అని పిలుస్తున్నాం. అది కాలాతీతమైనది. కాలపరీక్షను తట్టుకొని నిలబడింది.  


సంగీతంలో విస్తృతంగా వాడుతున్న ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌పై మీ అభిప్రాయం?

ఎలక్ర్టానిక్‌ మ్యూజిక్‌ను నేను తక్కువ చేయడం లేదు. ఇప్పుడున్న సంగీత ప్రపంచంలో అవన్నీ ముఖ్యమైన భాగమైపోయాయి. వాటిని కాదనడానికి లేదు. మ్యూజిక్‌ను ప్రోగ్రామ్‌ చేసే కొత్త పద్ధతులు ఎన్ని వచ్చినా, మన సంప్రదాయ సంగీత కచేరీ వ్యవస్థను కాపాడుకోవడం మన బాధ్యత. అదొక్కటే దీనికి పరిష్కారం. 


ఏ భాషలో పాడడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు?

నా హృదయానికి దగ్గరైన సాహిత్యం అన్ని భాషల్లోనూ  ఉంది. కానీ చిన్నతనం నుంచే త్యాగరాజ కృతులు నన్ను ఎక్కువగా ఆకర్షించటం వల్ల అనుకుంటాను తెలుగు అంటే ఒకింత ఎక్కువ మక్కువ. అలాగే అన్నమయ్య భక్తి గీతాలు కూడా. భద్రాచల రామదాస కీర్తనలు చాలా మధురంగా ఉంటాయి. నా మాతృభాష కాబట్టి తమిళంలో పాడడాన్ని బాగా ఆస్వాదిస్తాను. . 


తెలుగులో మీకు బాగా నచ్చిన కీర్తన, కృతులు ఏవి?


త్యాగరాజ స్వామి వారి ‘మోక్షము గలదా’ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ‘ఓ రామ నీ నామమెంతో రుచిరా’ కూడా చాలా ఇష్టం. 


వర్ధమాన సంగీత కళాకారులకు మీరిచ్చే సలహా?

ఈ తరం సంగీత కళాకారులు చాలా చురుగ్గా ఉంటున్నారు. చాలా కష్టపడుతున్నారు. 

గుర్తింపు కోసం తొందరపడకుండా శ్రద్ధ, కొంచెం ఓపికతో ఉంటే సంగీత ప్రపంచంలో ఎక్కువగా రాణించగలుగుతారు.


మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీలో ప్రదర్శన ఇచ్చిన తరువాత లాబీలో అడుగుపెట్టగానే షేక్‌ చిన్నమౌలానా సాబ్‌ కనిపించారు. నన్ను చూడగానే ‘ఇందాకటి నుంచి నీ కోసమే ఎదురుచూస్తున్నానమ్మా, ఈ రోజు నువ్వు ‘షణ్ముఖప్రియ’ గీతాన్ని ఒక నాదస్వర విద్యాన్‌లా చాలా గొప్పగా ఆలపించావు. దాన్ని వినకపోయినా, నిన్ను ప్రశంసించకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోయినా నన్ను నే ను క్షమించుకోలేకపోయేవాణ్ణి’ అన్నారు. అది నాకు ఎప్పటికీ మరపురాని అనుభవం. ఆ రోజే సీనియర్‌ విభాగంలోకి ప్రమోట్‌ అయ్యాను. ఆ రోజు నుంచి నా సంగీత జీవితంలో నేను వెనుదిరిగి చూసింది లేదు. 


- సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌



Updated Date - 2022-06-12T05:38:39+05:30 IST