Basara IIIT: విద్యార్థులకు వార్నింగ్

ABN , First Publish Date - 2022-07-31T23:42:17+05:30 IST

బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు తగ్గేదేలేదంటూ

Basara IIIT: విద్యార్థులకు వార్నింగ్

హైదరాబాద్: బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు తగ్గేదేలేదంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ఆందోళన విరమించపోవడంతో బాసర త్రిపుల్ ఐటీ యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఆందోళన చేసే విద్యార్థులు.. చదువుకునే విద్యార్థులను అడ్డుకుంటే షోకాజ్ నోటీసులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. షోకాజ్ నోటీస్ (Showcause notices) తర్వాత కూడా మారకపోతే బర్తరఫ్ (dismissal) చేయాలని భావిస్తున్నారు. ఇంజనీరింగ్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం చదివే 3 వేల మంది విద్యార్థులు డైనింగ్‌ హాల్‌లోనే బైఠాయించారు. హాస్టళ్లలో భోజనం మెరుగుపడలేదని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రతిరోజూ వర్సిటీ అధికారులు, అధ్యాపకులు విద్యార్థులతో ఏర్పాటు చేసిన కమిటీ రోజు మెస్సుల్లో భోజన వసతిని పరిశీలిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్వాలిటీ పెంచాలని అదేవిధంగా ప్రతీరోజు మధ్యాహ్నం భోజనంలో అందించే అరటిపండు స్థానంలో ఆపిల్‌ లేదా ఆరెంజు పండు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. న్యూట్రిషన్‌తో కూడిన ఆహారం పెట్టాలని కోరుతున్నారు. 


తమతో  వీసీ వెంకటరమణ చర్చలు జరపాలని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఆహారం తినకుండా వీసీ కోసం నిరీక్షిస్తున్నారు. కొందరు విద్యార్థుల తీరుపై వీసీ ఆగ్రహంగా ఉన్నారు. తినేవారిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని, అలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కొందరు కావాలని ఇష్యునూ పెద్దగా చేస్తున్నారని తప్పుబడుతున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించడం తమ బాధ్యత అని, అందుకు కట్టుబడి పని చేస్తున్నామని వెంకటరమణ చెప్పారు. బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT) విద్యార్థుల (Students) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెంకటరమణ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని తెలిపారు. కొన్ని పరిష్కరించామని, మరికొన్ని ప్రోగ్రెస్‌లో ఉన్నాయని చెప్పారు. భోజనం మానేసి విద్యార్థులు ఆందోళన చేయడం సరికాదన్నారు. కొత్త మెస్ కాంట్రాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశామని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని వెంకటరమణ తెలిపారు. 


మరోవైపు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు పేరెంట్స్ కమిటీ మద్దతు ప్రకటించింది. భోజనం మానేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై పేరెంట్స్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. క్యాంపస్ మెస్‌లో ఈ1, ఈ2 విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. క్యాంపస్ మెస్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Updated Date - 2022-07-31T23:42:17+05:30 IST