రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత!

ABN , First Publish Date - 2022-05-20T08:15:37+05:30 IST

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీ) గురువారం నుంచి

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత!

భారత్‌ పెట్రోలియం ఇక నుంచి కోటా 

రెగ్యులర్‌ సరఫరాలో 40 శాతం కోత నష్టం వస్తోందని సరఫరా తగ్గింపు

మిగిలిన కంపెనీలూ అదేబాట పడితే తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం


అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీ) గురువారం నుంచి కోటా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చాలా వరకు కోత పెట్టి భారత్‌ పెట్రోలియం బంకులకు ఇంధనాన్ని సరఫరా చేసింది. సుమారు 40 శాతం కోత పెట్టినట్లు పెట్రోలు బంకుల యాజమాన్యాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగినందున, పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.25 చొప్పున నష్టం వస్తోందని, అందువల్ల తగినంత సరఫరా చేయలేమని బీపీసీ బంకులకు స్పష్టం చేసింది. చాలా మంది నగదు చెల్లించినా గురువారం నాడు బంకులకు పెట్రోల్‌ ట్యాంకులు పంపలేదు. రాష్ట్రంలో మొత్తం 3500 బంకులుండగా, వాటిలో సుమారు వెయ్యి వరకు బీపీసీవే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిపై కొరత ప్రభావం పడుతోంది. అంటే మూడింట ఒక వంతు వినియోగదారులపై ఈ కొరత ప్రభావం పడనుంది.


విజయవాడ రీజియన్‌ నుంచి రోజుకు 90 ట్యాంకుల వరకు సరఫరా చేయాల్సి ఉండగా, గురువారం 50 ట్యాంకుల లోపే సరఫరా చేశారు. విశాఖ, నెల్లూరు, కడప రీజియన్లలో కూడా బీపీసీ ఇదే విధానాన్ని అమలు చేసింది. దీంతో డిమాండ్‌కు తగినట్టు వినియోగదారులకు ఇంధనం అందించలేమని బంకుల యాజమాన్యాలు భావిస్తున్నాయి. బీపీసీ బంకులు మాత్రమే ఉన్న గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడతారు. త్వరలో హెచ్‌పీసీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలు కూడా కోటా బాట పట్టే అవకాశం ఉందని ఇంధన వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆ పరిస్థితే వస్తే తీవ్ర కొరత తలెత్తే ప్రమాదముంది.

Updated Date - 2022-05-20T08:15:37+05:30 IST