Abn logo
May 16 2020 @ 04:47AM

ఇల్లే షూటింగ్‌ రేంజ్‌!

Kaakateeya

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో షూటింగ్‌ రేంజ్‌కు వెళ్లి సాధన చేసే పరిస్థితి లేదు. దాంతో తన కోచ్‌ ఫ్లాట్‌నే షూటింగ్‌ రేంజ్‌గా మార్చుకొని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు 17 ఏళ్ల షూటర్‌ దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ అయిన పన్వర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దాంతో లాక్‌డౌన్‌లోనూ సాధనను ఆపదలచుకోలేదు. కానీ ప్రాక్టీ్‌సకోసం బయటకు వెళ్లలేడు. ఎలా? అని ఆలోచించిన దివ్యాంశ్‌ కోచ్‌ దీపక్‌ కుమార్‌ దూబేకు ఓ ఆలోచన తట్టింది. అది.. ఫరీదాబాద్‌లో ఆరో అంతస్థులో ఉన్న తన మూడు పడక గదుల ఫ్లాట్‌ను షూటింగ్‌ రేంజ్‌గా మార్చవచ్చని. లాక్‌డౌన్‌తో దీపక్‌ కుటుంబం మరోచోట చిక్కుకుపోవడంతో అపార్ట్‌మెంట్‌లో అతనొక్కడే ఉండడం కూడా కలిసి వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా పన్వర్‌, దీపక్‌ రంగంలోకి దిగారు. రెండు బెడ్‌రూంలను, లాబీని ఖాళీ చేసి 10 మీటర్ల దూరం ఉండేలా రేంజ్‌ను రూపొందించారు. షూటింగ్‌కు కావాల్సిన విధంగా ఆ గదుల్లో లైట్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా.. ఎంతో కష్టపడి షూటింగ్‌ రేంజ్‌ను తయారు చేశారు. అలాగే కాలనీ అభివృద్ధి సంఘం నుంచి అనుమతి తీసుకున్నారు. షూటింగ్‌ సంఘం సాయంతో మందుగుండును సమకూర్చుకున్నారు. ఈ రేంజ్‌లోనే ప్రాక్టీస్‌ చేసిన పన్వర్‌ 3 ఆన్‌లైన్‌ షూటింగ్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. లాక్‌డౌన్‌లో కొంతలో కొంత ప్రాక్టీస్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని దివ్యాంశ్‌ అన్నాడు. 

మన అథ్లెట్లు ఈ ఏడాది విదేశాల్లో పోటీపడరు

కరోనా కారణంగా ఈ ఏడాది విదేశాల్లో జరిగే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత అథ్లెట్లు పోటీపడరని జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ప్రకటించింది. ఆగస్టు 14న జరిగే డైమండ్‌ లీగ్‌తో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలు మొదలవనున్నాయి. ఇందులో భారత్‌ నుంచి జావెలిన్‌ త్రోయర్లు నీరజ్‌ చోప్రా, శివ్‌పాల్‌ సింగ్‌ పోటీపడాల్సి ఉంది. కానీ.. తాజా నిర్ణయంతో వీరు ఈ టోర్నీకి దూరం కానున్నారు.

Advertisement
Advertisement