శివుణ్ణి మనలోకి ఆహ్వానిద్దాం

ABN , First Publish Date - 2022-02-25T05:30:00+05:30 IST

చాంద్రమాన పంచాంగంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నెలలోని మిగతా రాత్రుల కన్నా చిమ్మచీకటిగా ఉండే రాత్రి. దాన్ని ‘శివరాత్రి’గా... ‘మాస శివరాత్రి’గా పరిగణిస్తారు. మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని... ‘మహా శివరాత్రి’ అంటారు. ఇక్కడ ‘శివ’ అంటే ఒక అర్థంలో ‘ఆది యోగి’...

శివుణ్ణి మనలోకి ఆహ్వానిద్దాం

మార్చి 1న మహ శివరాత్రి

చాంద్రమాన పంచాంగంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నెలలోని మిగతా రాత్రుల కన్నా చిమ్మచీకటిగా ఉండే రాత్రి. దాన్ని ‘శివరాత్రి’గా... ‘మాస శివరాత్రి’గా పరిగణిస్తారు. మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని... ‘మహా శివరాత్రి’ అంటారు. ఇక్కడ ‘శివ’ అంటే ఒక అర్థంలో ‘ఆది యోగి’... మరో అర్థంలో ‘శివ’ అంటే ఏది లేదో అది’. ‘ఉన్నది’ అంటే సృష్టి... లేనిది అంటే ‘శివ’. సృష్టి మొత్తం శూన్యం నుంచి వచ్చిందని ఆధునిక శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ప్రతిదీ శూన్యం నుంచి వస్తుంది. తిరిగి శూన్యంలోకి పోతుంది. శూన్యం అనేది ఈ సృష్టికి ఆధారం. అందుకని శివుణ్ణి సృష్టికి ఆధారంగా భావిస్తాం. ఏది లేదో అదే ఉన్నదానికి ఆధారం.

మనం రాత్రి సమయంలో ఆకాశం వైపు చూస్తే... వందల కోట్ల నక్షత్రాలు దర్శనమిస్తాయి. కానీ అది ముఖ్యం కాదు. నక్షత్రాల కన్నా ఖాళీగా ఉండే స్థలం ఆకాశంలో ఎక్కువగా ఉంటుంది. సృష్టి అతి సూక్ష్మమైనది. విస్తారమైన శూన్యం బ్రహ్మాండమైనది. సృష్టి అంతా శివుడి ఒడిలో జరుగుతున్నట్టు చెబుతారు. శివుణ్ణి నల్లనివాడని అంటారు. విశేషమేమిటంటే... జగత్తులోని ప్రతిదాన్నీ తనలో ఇముడ్చుకొనే దాన్ని ‘అంధకార శక్తి’ అని నేటి ఆధునిక శాస్త్రవేత్తలు అంటున్నారు. దాన్ని మరోలా వర్ణించే వీలు లేక, దాని తత్త్వాన్ని గ్రహించలేక... వాళ్ళు దాన్ని ‘అంధకార శక్తి’ అని పిలుస్తున్నారు.

‘శివరాత్రి’ అంటే... ఆ శబ్దంలోని అర్థం రీత్యా శివుడి రాత్రి. ఈ రోజున మన శరీరంలోని శక్తులు సహజంగా ఉప్పొంగుతాయి. వాటిని ఉపయోగించుకోవడానికి యోగాలో విశేషమైన సాధన ఒకటి ఉంది. ప్రాథమికంగా... మానవ శరీరమైనా లేదా విశ్వం మొత్తమైనా పంచభూతాలతో... అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలతో నిర్మితమైనవే. శివుని నామాలలో ‘భూతేశ్వర’ అనేది ఒకటి. అంటే భూతాలకు నాథుడు. ప్రతి శివరాత్రి ధ్యానలింగ ఆలయంలో జరిగే పంచభూత ఆరాధన ప్రధానంగా ధ్యానలింగ అనుగ్రహాన్ని అనుభూతి చెందడం కోసమే. పంచభూత ఆరాధన అతి శక్తిమంతమైన అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ అవకాశం మన శరీర వ్యవస్థలోని ఆ పంచభూతాలూ సమన్వయంతో, సక్రమంగా పని చేయడానికి దోహదపడుతుంది. 

ఒక వ్యక్తి శరీరంలో పంచభూతాల అమరిక ఎలా ఉందనే దాని మీదే అతనికి సంబంధించిందంతా నిర్ణయమవుతుంది. ఒక మహత్తరమైన అవకాశాన్ని అందుకోవడానికి వీలుగా అతని శరీరం రూపొందాలంటే... ఆ శరీరంలో పంచభూతాల అమరిక సక్రమంగా, సమన్వయంతో ఉండడం చాలా ముఖ్యం. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, నడిచే నేల, జీవశక్తిగా ఉన్న జీవాగ్ని... ఈ పదార్థాలతో మన శరీరం ఏర్పడింది. మనం వాటిని నియంత్రించి, చైతన్యంతో కేంద్రీకరించి ఉంచితే... ఆరోగ్యం, శ్రేయస్సు, విజయం తథ్యం. ఒక విధంగా చెప్పాలంటే... మేము చేసే ప్రయత్నమంతా... ప్రజలు తాము జీవించే విధానాన్ని పంచభూత ఆరాధనగా మలచుకోవడానికి అనువైన వేర్వేరు పరికరాలను సృష్టించడమే. 

జీవ పరిణామ ప్రక్రియలో భాగంగా... జంతుజాలంలో కలిగిన అతి పెద్ద మార్పు... సమాంతరంగా ఉన్న వెన్నెముక నిటారుగా రూపాంతరం చెందడమేనని జీవ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిణామం తరువాతే మేధ వికసించింది. కాబట్టి, మహా శివరాత్రి రోజున సహజంగానే ఉప్పొంగే శక్తితో... ఆ రాత్రంతా జరుపుకొనే వేడుకల్లో... సరైన మంత్రాలు, ధ్యానాల ద్వారా దైవానికి మనం మరొక అడుగు దగ్గర కావచ్చు. జీవితంలో ఎలాంటి సాధనా లేనివారిలో కూడా ఆ రోజున శక్తి ఉప్పొంగుతుంది. ప్రత్యేకించి ఏదైనా యోగ సాధనలో ఉన్నవారు... తమ శరీరాన్ని నిటారుగా ఉంచుకోవడం... అంటే రాత్రంతా నిద్రించకుండా జాగారం చేయడం ఎంతో అవసరం. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికే కాదు... ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికీ, కుటుంబ బంధాల్లో ఉన్నవారికీ కూడా మహా శివరాత్రి ఎంతో ప్రధానమైనది. కుటుంబ బంధాల్లో ఉన్నవారు మహా శివరాత్రిని శివుడి పెళ్ళి రోజుగా భావిస్తారు. విజయ కాంక్ష ఉన్నవారు... ఈ రోజును శివుడు తన శత్రువులను జయించిన రోజుగా పరిగణిస్తారు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు. యోగ శాస్త్రానికి మూల కారకుడైన ‘ఆది యోగి’గా లేదా ‘ఆది గురువు’గా చూస్తారు. ‘నేనే ముఖ్యం’ అనే స్థితిని దాటి... శివుణ్ణి... ఆ ఆదియోగిని మనలోకి ఆహ్వానించే స్థితికి చేరితే... మన జీవితాలను ఒక కొత్త కోణంలో, మరింత స్పష్టతతో చూడగలం.

సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2022-02-25T05:30:00+05:30 IST