చినుకు..చలి!

ABN , First Publish Date - 2020-11-28T07:48:20+05:30 IST

అసలే చలి! ఆపై నివర్‌ తుపాను ప్రభావంతో గాలిలో తేమలో మార్పు రావడం.. ఈదురుగాలులు పెరగడంతో వాతావరణం మరింత

చినుకు..చలి!

నివర్‌తో రాష్ట్రంలో మారిన వాతావరణం

చాలాచోట్ల వానలు... నేలకొరిగిన పైరు.. చేలలో తడిసిన పత్తి

ఆరబెట్టిన ధాన్యం నీళ్లపాలు

నేడు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో మరింత పడిపోయిన ఉష్ణోగ్రతలు 

చలికి తాళలేక చలిమంటలు వేస్తున్న జనం 

వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

డిసెంబరులో మళ్లీ రెండు తుపానులు


హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అసలే చలి! ఆపై నివర్‌ తుపాను ప్రభావంతో గాలిలో తేమలో మార్పు రావడం..  ఈదురుగాలులు పెరగడంతో వాతావరణం మరింత చల్లగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. నివర్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం 2 రోజులుగా మారిపోయింది. చినుకు.. చలి జుగల్బందీకి ప్రజలు వణికిపోతున్నారు. నివర్‌ ప్రభావంతో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.


భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, మెదక్‌, గద్వాల, రంగారెడ్డి, వరంగల్‌ రూరల్‌, ములుగు, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లాల్లో   వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల చిరుజల్లులు పడ్డాయి. 10 మి.మీ నుంచి 31 మి.మీ మధ్య వర్షపాతం నమోదైంది.  తుపాను ప్రభావంతో శనివారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌, భద్రాచలం, హన్మకొండ, హైదరాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌, రామగుండంలో 17 డిగ్రీల నుంచి 19 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌, ఆదిలాబాద్‌లో చలి తీవ్రత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో చలికి తాళలేక ఉదయం, సాయంత్రాల్లో చలిమంటలు వేస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం రోజంతా సూర్యుడు మేఘాల మాటునే ఉండిపోయాడు. 



ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు

ఇప్పటికే నివర్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను గండం పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిందూ మహాసముద్రం, దానికి అనుకొని దక్షిణ అండమాన్‌ సముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తదుపరి 24 గంటల్లో ఇది వాయుగుండగా మారి.. పశ్చిమంగా పయనించి మరింత బలపడి తుపానుగా మారుతుందని.. డిసెంబరు 2న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమలో వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక డిసెంబరు 2న, 7న మరో రెండు తుపానులు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొన్నారు. శుక్రవారం ఏపీలో పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరులో వాన దంచికొట్టింది. లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మర్చి తదితర పంటలు దెబ్బతిన్నాయి. 


రైతన్నకు మళ్లీ సమస్య 

పత్తి, వరి కోత దశలో మళ్లీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల వరికోతను నిలిపివేశారు. కొన్నిచోట్ల కోతకొచ్చిన వరిపంట నేలకొరికింది. పత్తి చేలల్లో మొక్కల మీదే పత్తి తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. టార్పాలిన్లు కిరాయికి తెచ్చి రాశులపై కప్పుతున్నారు. ఇప్పటికే కల్లాలు చేసిన రైతులదీ ఇదే పరిస్థితి. 

సిద్దిపేట మార్కెట్‌ యార్డ్‌లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూత, కాత దశలో ఉన్న మిర్చి పంటకు నష్టం వాట్లింది. 


Updated Date - 2020-11-28T07:48:20+05:30 IST