శివం.. హరం..

ABN , First Publish Date - 2022-03-02T05:44:31+05:30 IST

ఓంకార నాదాలు ప్రతిధ్వనించాయి. జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తిభావంతో పులకించాయి. శంభోశంకర.. హరహర మహాదేవ.. అంటూ భక్తులు పరమేశ్వరుడిని మనసారా కొలిచారు. రుద్రేశ్వరుడిగా, సిద్ధేశ్వరుడిగా, కాశీవిశ్వేశ్వరుడిగా లోకప్రసిద్ధిచెందిన స్వామి అనేక ఆలయాల్లో బిన్నరూపాల్లో భక్తులచే అభిషేకాలు అందుకున్నారు. మంగళవారం పవిత్ర మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో జిల్లా నలుమూలల ఉన్న శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. చేతిలో పండ్ల బుట్టలు, కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలతో సంప్రదాయదుస్తులతో అన్ని వర్గాల ప్రజలు శివాలయాలవైపు అడుగులు వేశారు. నగరంలోనే కాక జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కొనసాగింది.

శివం.. హరం..
వేయిస్తంభాల ఆలయంలో రుద్రాభిషేకం చేస్తున్న భక్తులు

పరమ శివుడికి ప్రణమిల్లిన ఓరుగల్లు

ఆలయాల్లో మారుమోగిన ఓంకారనాదం
భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు
వేయిస్తంభాలగుడికి బారులు తీరిన జనం
వైభవంగా రుద్రేశ్వరీ రుద్రేశ్వరుల కల్యాణం
జాగారం వేళ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పలు ప్రాంతాల్లో అధ్యాత్మిక కార్యక్రమాలు



ఓంకార నాదాలు ప్రతిధ్వనించాయి. జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తిభావంతో పులకించాయి. శంభోశంకర.. హరహర మహాదేవ.. అంటూ భక్తులు పరమేశ్వరుడిని మనసారా కొలిచారు. రుద్రేశ్వరుడిగా, సిద్ధేశ్వరుడిగా, కాశీవిశ్వేశ్వరుడిగా లోకప్రసిద్ధిచెందిన స్వామి అనేక ఆలయాల్లో బిన్నరూపాల్లో భక్తులచే అభిషేకాలు అందుకున్నారు. మంగళవారం పవిత్ర మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో జిల్లా నలుమూలల ఉన్న శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. చేతిలో పండ్ల బుట్టలు, కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలతో సంప్రదాయదుస్తులతో అన్ని వర్గాల ప్రజలు శివాలయాలవైపు అడుగులు వేశారు. నగరంలోనే కాక జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కొనసాగింది.

హనుమకొండ కల్చరల్‌, మార్చి 1: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. లింగరూపుడై ఆవిర్భవించిన పరమశివుడిని ఉపవాసదీక్షతో  అభిషేకిస్తే సర్వసుఖాలు సిద్ధిస్తాయన్న విశ్వాసంతో భక్తులు ఆలయాల బాట పట్టారు. దీంతో అన్ని దేవాలయాల వద్ద భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.

వేయిస్తంభాల గుడిలో..
హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4గంటల నుంచి ప్రారంభమైన భక్తులు తాకిడి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కొనసాగింది. భక్తులు పిల్లాపాపలతో తరలి వచ్చి క్యూలైన్‌లలో గంటల తరబడి నిరీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. అనేకమంది వీఐపీలు కూడా ఆలయానికి తరలివచ్చి రుద్రేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 7.45గంటలకు రుద్రేశ్వరీ, రుద్రేశ్వరుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 3గంటలకు మంగళవాయిద్య సేవ, సుప్రభాత సేవ, మూలగణపతికి పంచామృతాభిషేకం, రుద్రేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ సామూహిక రుద్రాభిషేకాలను భక్తులు నిర్వహించారు.

కల్యాణోత్సవం
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై ఆది దంపతుల కల్యాణోత్సవాన్ని సాయంత్రం 7.45గంటలకు వేదోక్తంగా నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులను అలంకరించి ఊరేగింపుగా వేదికపైకి తీసుకువచ్చి ప్రతిష్టింపచేశారు. గణపతి పూజ, పుణ్యహవచనం, నూతన వస్త్రాల అలంకరణ, భాసిక ధారణ, జిలకర బెల్లం, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం లాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు కల్యాణోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ చీప్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ దంపతులు మేళతాళాల మధ్య స్వామివారికి పట్టువస్త్రాలను తీసుకువచ్చి సమర్పించారు. కల్యాణం అనంతరం నందివాహన సేవలతో స్వామివారిని ఊరేగించారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో భక్తుల దర్శనాలను నిలిపివేసి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహింప చేశారు. తెల్లవారుజామున 4గంటల వరకు లింగోద్భవ పూజలు, మహారుద్రాభిషేకం నిరంతరాయంగా కొనసాగింది.

భక్తులతో ఆలయం కిటకిట
వేయిస్తంభాల ఆలయానికి ఉదయం నుంచి సాధారణ భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో వీఐపీలు తరలివచ్చి రుద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ దంపతులు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి,  జిల్లా జడ్జి శైలజ, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గోపి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు గట్టు మహేష్‌ బాబు, మున్నూరుకాపు సంఘం నాయకుడు మాడిశెట్టి సాంబయ్య, కనుకదుర్గ చిట్‌ఫండ్‌ అధినేత రాగిడి తిరుపతిరెడ్డి,  గాయత్రి గ్రానైట్స్‌ అధినేత వద్దిరాజు వెంకటేశ్వర్లు, అర్జున్‌ రెడ్డి, ఏసీపీ జితేందర్‌ రెడ్డి, హనుమకొండ సీఐ వేణుమాధవ్‌ తదితరులు స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. జాగరణ చేసే భక్తుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తాడూరి రేణుక బృందం కూచిపూడి నృత్యప్రదర్శనలు, హైదారాబాద్‌కు చెందిన కళాకారిణి సురేఖ రెడ్డి భాగవతారిణి హరికథా కాలక్షేపం, భజనలు,  కోలాటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇతర ఆలయాల్లో..
హనుమకొండలోని చారిత్రకంగా సుప్రసిద్ధమైన సిద్ధేశ్వరాలయంలో ఉదయం నుంచి సామూహిక రుద్రాభిషేకాలు, రాత్రి 12 గంటలకు లింగోద్బవ సమయాన ప్రత్యేక రుద్రాభిషేకం, అనంతరం భస్మాభిషేకం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం చలువు పందిళ్లు, మంచినీటి  సౌకర్యం, లైలింగ్‌, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆలయం బయట వరకు పందిళ్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులు మండుటెండలో బారులు తీరి నిల్చోవలసి వచ్చింది. ఆలయంలో 40 అడుగుల ఎత్తయిన శివపార్వతులు, 10 అడుగుల గణపతి,  సుబ్రహ్మణ స్వామి, నందీశ్వరుల విగ్రహాలతో కూడిన  శివపరివార్‌ ఉద్యానవనం ప్రత్యేకత ఆకర్శణగా నిలిచింది. భక్తులు ఈ ఉద్యానవనాన్ని సందర్శించి చాలా సేపు సేదతీరారు. మడికొండలోని మెట్టురామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, రధోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భద్రకాళిగుడిలోని పంచభూతాత్మక శివపంచముఖలింగ క్షేత్రంలోని భద్రేఽశ్వర దేవాలయం (శివాలయం)లో శివరాత్రి జపహోమార్చనాభిషేకాలతో పాటు రుద్ర హవనం నిర్వహించారు. అయినవోలులోని మల్లికార్జున స్వామి దేవాలయంలో లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం జరిపారు. ఎమ్మెల్యే అరూరి రమేష్‌ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  భీమదేవరపల్లి మండలం వంగరలోని కైలాస కళ్యాణి క్షేత్రం (హరిహర గాయత్రీ దేవాలయం)లో మహాశివరాత్రి ఉత్సవాలు, శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉదయం నుంచి నిరంతర అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చన, హారతి,  మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. వరంగల్‌ కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, ఖిలా వరంగల్‌లోని శంభులింగేశ్వరాలయం, స్టేషన్‌రోడ్డులోని ఆకారపు వారి కాశీవిశ్వేరాలయం, కీర్తినగర్‌లోని కోటి లింగాల ఆలయం, జేపీఎన్‌ రోడ్డులోని దుర్గేశ్వరాలయం, రామన్నపేటలోని రామలింగేశ్వరాలయం, కరీమాబాద్‌లోని కాశీవిశ్వేశ్వరాలయం తదితర దేవాలయాల్లో కూడా శివరాత్రి వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ములుగు రోడ్డులోని దత్తపీఠంలో కూడా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. హనుమకొండ శ్రీదేవి ఏషియన్‌ మాల్‌ ప్రాంతంలోని శిరిడీ సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ మతుకుమల్లి హరగోపాల్‌ ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగడ హారతి, మంగళస్నానం, సంస్థాన పూజ, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మాద్యాహ్న హరతి, సంధ్యాహారతి తదితర పూజా కార్యక్రమాలను మందిర పూజారులు కిశోర్‌ శర్మ, మణి శర్మ, చందులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవచారి గ్రౌండ్‌లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నది. జాగరణ చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సమ్మేళనానికి భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం 5.30గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సాగిన ఈ సమ్మేళనంలో ప్రముఖ రచయిత, అవధాని, పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు శివస్తుతిపై ప్రవచనం, ఎల్‌వీ గంగాధరశాస్త్రీ గీతాగాన ప్రసంగం, వీటితోపాటు శివపార్వతి కల్యాణం, మహాహారతి, దేశభక్తి గీతాలు, పేరిణి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సుప్రసిద్ధ గాయనీ గాయకులు మధుప్రియ, చరణ్‌ అర్జున్‌, కనకవ్వ, శశిధర్‌ శర్మ, సారంగదరియా ఫేమ్‌ కోమలి, జబర్ధస్త్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత తదితర కళాకారులు తమ ఆట, పాటలతో అలరించాయి. ఇండస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ ఏనుగుల రాకేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక సమ్మేళనంలో నిజా మాబాద్‌ ఎంపీ అరవింద్‌ పాల్గొన్నారు.

భారీబందో బస్తు
భక్తుల రద్దీని నియంత్రించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను నియమించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా గట్టి భద్రత కల్పించారు. భక్తులు రాక ను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా వాహనాలను దారిమళ్లించారు. ఆలయాలకు వెళ్లే ప్ర ధాన రహదారిపై బారీకేడ్లను ఏర్పాటు చేశారు. భక్తు లు త్వరతగతిన దర్శనం చేసుకొని వెళ్లేలా చూశారు.









పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి..
ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ

పాలకుర్తి, మార్చి 1:  పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం మంగళవారం రా త్రి ఘనంగా జరిగింది. కలెక్టర్‌ శివలింగయ్య దంపతులతో కలిసి  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతు లు ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను మేళతాళాలతో తీసుకొచ్చారు. పండితులు శానగొండ శివకిరణ్‌, పాలకుర్తి సం తో్‌షశర్మల వేదమంత్రాల మధ్య స్వామివారికి సమర్పించారు. కల్యాణ మ హోత్సవంలో పాల్గొన్న 125 మంది దంపతులకు కంకణాలను పంపిణీ చే శారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి తిలకించారు.



కురవిలో మంత్రి సత్యవతి...
వీరభద్రుడికి బంగారు కోర మీసాలు సమర్పణ

మహబూబాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో స్వామి వారికి బంగారు కోర మీసాలు, భద్రకాళి అమ్మవారికి ముక్కుపుడకను  మంత్రి సత్యవతిరాథోడ్‌ మంగళవారం సమర్పించారు.  కుటుంబసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బంగారు కోర మీసాలు, ముక్కు పుడకను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ... కురవి ఆలయాన్ని పర్యటక క్షేత్రంగా అభివృద్ధి చేసి పునర్‌వైభవం తీసుకువస్తామని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్‌ కూడా వీరభద్రుడికి బంగారు కోరమీసాలు సమర్పించిన విషయం విదితమే.

Updated Date - 2022-03-02T05:44:31+05:30 IST