Abn logo
Nov 29 2020 @ 00:43AM

పదునెక్కితేనే ‘నోటా’కు సార్థకత

మెజారిటీ ప్రజలు అభ్యర్థులందరినీ తిరస్కరించినా సరే, తిరస్కృతుల్లో ఒకరు ఎన్నిక కావడానికి అవకాశం కల్పించే విధంగా ప్రస్తుతం నోటా విధానం ఉన్నది. ఓటింగ్ శాతం పెంచాలనే ఎన్నికల సంఘం లక్ష్యం నెరవేరడం కోసం ఎవరూ ఓటు వేయరు. తమ లక్ష్యం నెరవేరడానికే ఓటేస్తారు. నోటా లక్ష్యం నెరవేరాలంటే దానికి పడిన ఓట్లకు విలువ ఉండాలి. నోటాను కూడా ఓ అభ్యర్థిగా గుర్తించినప్పుడే దానికి పడే ఓట్లకు ప్రాధాన్యం ఉంటుంది.


విద్యావంతులు, ఆలోచనాపరులను పోలింగ్ బూతుల దాకా తీసుకొచ్చి ఓట్లు వేయించడం ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనికి పెద్ద సవాలుగా నిలుస్తున్నది. భారతదేశంలో అక్షరాస్యులకన్నా నిరక్షరాస్యులు, ధనికుల కన్నా పేదలు, పారిశ్రామిక వేత్తల కన్నా కార్మికులు, పట్టణ ప్రజల కన్నా గ్రామీణులు, రాజ్యాంగం – ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగిన వారికన్నా అవగాహన లేనివారే ఓటింగ్‌లో ఎక్కువ శాతం పాల్గొంటున్నారని ఇప్పటి దాకా జరిగిన అన్ని ఎన్నికలూ నిరూపించాయి. అందుకే నాటి సోక్రటీస్ నుంచి నేటి సంస్కరణశీలుల వరకు అందరూ ప్రజాస్వామ్యం బుద్ధిస్వామ్యం కాదని, కేవలం మందస్వామ్యమే అని విమర్శిస్తున్నారు. ఈ అపప్రథను తొలగించడానికి భారతదేశంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ గాయమెక్కడుందో తెలుసుకోకుండా మందు పూయడం వల్ల రోగం ముదురుతున్నదే తప్ప కుదురుకోవడం లేదు. 


ఓటు హక్కు కల్పించడానికి కనీస విద్యార్హత పెట్టాలా? సార్వజనీన ఓటు హక్కు విధానం తీసుకురావాలా అనే విషయంలో రాజ్యాంగసభలో విస్తృత చర్చే జరిగింది. చదువుకున్నవారు బ్రిటిష్ ప్రభుత్వంలో కొలువులు చేయడానికి ఇష్టపడితే, నిరక్షరాస్యులే భారత స్వాతంత్ర్య సమరంలో ముందుండి పోరాడారనే విషయం రాజ్యాంగ నిర్మాతలు పరిగణనలోకి తీసుకున్నారు. అవగాహనకు విద్యార్హతలతో సంబంధం లేదని నిర్ధారించి, వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్లే నిరక్షరాస్యులు (లేదా పెద్ద చదువులు లేని వారు), గ్రామీణులు దేశంలో ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 


తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యులు (83.25 శాతం) కలిగిన హైదరాబాద్‌లో గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేవలం 45 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయింది. రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత (49.87 శాతం) కలిగిన గద్వాలలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 83.94 శాతం ఓట్లు పోలయ్యాయి. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న గ్రామీణ నియోజకవర్గాలైన పాలేరు(92.09 శాతం), మధిర(91.15 శాతం), ఆలేరు(91.47శాతం), మునుగోడు(91.30 శాతం)లో ఎక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయి. ఎక్కువ అక్షరాస్యత కలిగిన హైదరాబాద్ నగరంలోని మలక్ పేట(42.36 శాతం), యాకత్‌పురా(42.62 శాతం), నాంపల్లి (45.46 శాతం), జూబ్లిహిల్స్(45.59 శాతం) అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు నమోదయ్యాయి. 


అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పైనే నమ్మకం లేని వారిని, ప్రత్యామ్నాయ రాజ్య వ్యవస్థలను కోరుకునే వారిని వదిలేయండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైనా, గణతంత్ర రాజ్యం పైనా విశ్వాసం ఉన్న వారు కూడా ఓటింగుకు దూరంగా ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చదువుకున్నవారు, సమాజం పట్ల, దేశం పట్ల అవగాహన కలిగిన వారు, భవిష్యత్తును నిర్దేశించగలిగిన శక్తియుక్తులు ఉన్నవారు ఓటింగుకు దూరంగా ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే సంకేతం ఏమాత్రం కాదు. న్యాయనిపుణులు, ప్రజాస్వామ్య అధ్యయనవేత్తలు, పరిశోధకులు తమ తమ పద్ధతుల్లో బుద్ధిజీవులు ఓటింగుకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే విషయాన్ని పరిశోధించారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల్లో తాము ఆశించిన గుణగణాలు ఉన్నవారు లేనందున, ఎవరు గెలిచినా ఒకటే అనే భావం ఏర్పడినందున, యోగ్యత లేని వారందరిలోకి తక్కువ దుర్లక్షణాలు కలిగిన వారినే ఎన్నుకోక తప్పని పరిస్థితి ఉన్నందున మేధావులు ఓటింగుకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. 


ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులందరిపై విరక్తి ఉన్న వారికి సైతం ఓటింగుపై ఆసక్తి కలిగించే సంస్కరణగా ‘నన్ ఆఫ్ ద అబవ్’ (నోటా) ఆప్షన్ బ్యాలెట్ పేపర్ల మీదకి వచ్చింది. దీనికి కూడా ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. అమెరికాలో 1976 నుంచి అమలవుతున్న నోటా విధానం పౌరహక్కుల సంఘాల కృషి ఫలితంగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతదేశంలో 2013 నుంచి అమలవుతున్నది. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో మిగతా అభ్యర్థుల మాదిరిగానే నోటాకు గుర్తు కేటాయించడం కోసం కూడా పోరాడాల్సి వచ్చింది. ఇంత చేసినా నోటా వల్ల అనుకున్న ఫలితం మాత్రం రాలేదు. 2014 లోకసభ ఎన్నికల్లో కేవలం 1.11 శాతం మంది నోటాకు ఓటేస్తే, 2019లో 1.08 శాతం మంది మాత్రమే నోటా మీట నొక్కారు. నోటాకు వోటు వేయడం వల్ల ఓటింగ్ శాతం పెరగవచ్చేమో కానీ, తాము వద్దు అనుకున్న అభ్యర్థులు ఎన్నికవడం ఆగడం లేదనే భావన ఓటర్లలో ఏర్పడింది. నోటాకు పడిన ఓట్లకు ఏమాత్రం విలువ లేదు. అవి చెల్లని ఓట్లుగానూ, మురిగిపోయే ఓట్లుగానూ మారుతున్నాయి. ఫలితాలను ప్రభావితం చేయడం లేదు. నోటా కోరల్లేని పాముగా మిగిలిపోతున్నది. మానవులు ఏ ప్రయత్నం చేసినా ఫలితం ఆశిస్తారు. ఓటు కూడా అంతే. తాము గెలిపించాలనుకునే వారికి ఓటు వేస్తారు. నచ్చని వారు ఎన్నిక కాకూడదని కోరుకుంటారు. మెజారిటీ ప్రజలు అభ్యర్థులందరినీ తిరస్కరించినా సరే, తిరస్కృతుల్లో ఒకరు ఎన్నిక కావడానికి అవకాశం కల్పించే విధంగా ప్రస్తుతం నోటా విధానం ఉన్నది. ఓటింగ్ శాతం పెంచాలనే ఎన్నికల సంఘం లక్ష్యం నెరవేరడం కోసం ఎవరూ ఓటు వేయరు. తమ లక్ష్యం నెరవేరడానికే ఓటేస్తారు. నోటా లక్ష్యం నెరవేరాలంటే దానికి పడిన ఓట్లకు విలువ ఉండాలి. నోటాను కూడా ఓ అభ్యర్థిగా గుర్తించినప్పుడే దానికి పడే ఓట్లకు ప్రాధాన్యం ఉంటుంది. 


అందుకే ప్రజాస్వామిక వాదులు నోటా విధానంలోనూ సంస్కరణలు రావాలని ఉద్యమిస్తున్నారు. వీటి ఫలితంగా మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మరింత పదునైన నోటా విధానం వచ్చింది. నిలబడిన అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, ఆ ఎన్నికను రద్దు చేసే విధానాన్ని మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తున్నది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో బోరి, మంకరవాడి గ్రామ పంచాయతీల్లో నోటాకు ఎక్కువ ఓట్లు రావడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించారు. హర్యానా రాష్ట్రం మరో అడుగు ముందుకేసి నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన చోట, తిరిగి ఎన్నికలు పెట్టడంతో పాటు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు తిరిగి పోటీ చేయడానికి వీలు లేని విధానం అమలు చేస్తున్నది. మిగతా రాష్ట్రాల్లో, చట్ట సభల్లో ఈ విధానం రావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి, న్యాయపోరాటాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం నోటా ఆప్షన్ అభ్యర్థులందరి కంటే కింద, బ్యాలెట్ పేపర్ చివరన ఉంటోంది. అందుకే దాన్ని నోటా (నన్ ఆఫ్ ద అబవ్) అన్నారు. అలా కాకుండా బ్యాలెట్ పేపర్ అగ్రభాగానే ‘నోబ్’ (నన్ ఆఫ్ ద బిలో) ఉండాలని కూడా కొందరు న్యాయపోరాటం చేస్తున్నారు. ఎన్నుకోవడమే కాదు, తిరస్కరించడమూ ప్రజాస్వామిక హక్కుగానే పరిగణించాలని కోరుతున్నారు.


ప్రపంచంలోని ప్రగతికాముక దేశాలు ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ముందడుగు వేసినా, అది స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం అయింది. చట్టసభల్లో ఈ విధానం రావాలంటే, పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


ఎన్నికల ప్రక్రియలో ఎక్కువ మంది పాల్గొనాలి. వారి అభిప్రాయం ఓట్ల రూపంలో వెల్లడయ్యే అవకాశం ఉండాలి. ఆ అభిప్రాయానికి విలువ ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఆ దిశగా ముందడుగు వేసిన దేశాలే పురోగమించాయి. 2013లో నోటా అమలు చేయాలని ఆదేశాలిచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు మంచి అభ్యర్థులను, సమగ్రత కలిగిన వ్యక్తులను నిలబెట్టక తప్పని సంస్కరణకు నోటా విధానం దోహదం చేయగలదని అత్యున్నత న్యాయస్థానం ఆశించింది. ఆ ఆశయం నెరవేరాలంటే నోటా ఓట్లకు విలువ ఉండాలి. 

గటిక విజయ్‌కుమార్

Advertisement
Advertisement
Advertisement