షర్మిల పార్టీ.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ

ABN , First Publish Date - 2021-06-08T08:58:52+05:30 IST

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజు జూలై 8న ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసిన వాడుక రాజగోపాల్‌ ప్రకటించారు.

షర్మిల పార్టీ.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ

  • జూలై 8న ఏర్పాటు.. కార్యక్రమాలు ప్రారంభించాం
  • ప్రకటన విడుదల చేసిన షర్మిల కార్యాలయం

హైదరాబాద్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి):వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజు జూలై 8న ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసిన వాడుక రాజగోపాల్‌ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను, కార్యక్రమాలనూ ఇప్పటికే ప్రారంభించామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు సోమవారం షర్మిల పార్టీ కార్యాలయం ఆ ప్రకటనను విడు దల చేసింది. పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ దగ్గర పనులన్నీ పూర్తయ్యాయని, పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వైఎస్‌ విజయమ్మ ఇచ్చిన లేఖనూ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చామని వాడుక రాజగోపాల్‌ ఆ ప్రకటనలో వెల్లడించారు. పార్టీ పేరుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ మార్చి 23వ తేదీనే అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్నికల కమిషన్‌ పేర్కొందన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి అభ్యంతరాలు రానందున అనుమతుల ప్రక్రియ పూర్తయిందనే తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు.  


పేదోని బిడ్డ పెద్ద చదువులు చదవొద్దా?: షర్మిల 

పేదోని బిడ్డ.. పెద్ద చదువులు చదువొద్దని, సూటు, బూటు వేసుకుని సర్కారు కొలువులు చేయవద్దనే సర్కారు బడులు బంద్‌ పెడుతున్నారా అంటూ సీఎం కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో 3,750 ప్రభుత్వ బడులు మూసేస్తున్నట్లుగా వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. బాంచన్‌ దొరా అంటూ వెంట తిరగడానికి, కేసీఆర్‌ ఇచ్చే బర్లు, గొర్లకు ఆశ పడేందుకే బడులు మూస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-06-08T08:58:52+05:30 IST