టీమిండియా టీ20 ప్రపంచకప్‌‌ జట్టులో షమీకి చోటులేనట్టేనా?

ABN , First Publish Date - 2022-06-19T22:47:06+05:30 IST

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ టీ20 ప్రపంచకప్ ఆడడం కష్టమేనా? మాజా పేసర్ ఆశిష్ నెహ్రా చెబుతున్న దాని ప్రకారం షమీకి భారత

టీమిండియా టీ20 ప్రపంచకప్‌‌ జట్టులో షమీకి చోటులేనట్టేనా?

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ టీ20 ప్రపంచకప్ ఆడడం కష్టమేనా? మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చెబుతున్న దాని ప్రకారం షమీకి భారత టీ20 స్క్వాడ్‌లో చోటు కష్టమే. అయితే, వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో మాత్రం అతడికి చోటు దక్కే అవకాశం ఉందని పేర్కొన్నాడు. జులై 1-5 మధ్య ఇంగ్లండ్‌‌లో జరగనున్న ఆరోది, చివరిదైన టెస్టు మ్యాచ్‌లో షమీ ఆడనున్నాడు. గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆగిపోయిన ఈ రీ షెడ్యూల్ మ్యాచ్‌తో ఈ సిరీస్ పూర్తవుతుంది. 31 ఏళ్ల షమీ పొట్టి ఫార్మాట్‌లో చివరిసారి 2021 టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో కనిపించాడు. ఆ తర్వాత జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. 


ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ జట్టులో షమీకి చోటు ఉండకపోవచ్చని ‘క్రిక్‌బజ్’ ఇంటర్వ్యూలో నెహ్రా చెప్పుకొచ్చాడు. అయితే, అతడి శక్తియుక్తుల గురించి మనకు తెలుసని, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కపోయినా, వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో మాత్రం అతడు ఆడే అవకాశం ఉందన్నాడు. సెలక్టర్లు అతడి పేరును తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొన్నాడు. ఈ ఏడాది మనకు ఎక్కువ వన్డేలు లేకపోవడంతో ఐపీఎల్ తర్వాత షమీ విశ్రాంతిలో ఉన్నాడన్నాడు. ఇంగ్లండ్‌తో జరగునున్న టెస్టు మ్యాచ్ తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో షమీకి చోటు లభించే అవకాశం ఉందని నెహ్రా పేర్కొన్నాడు. అత్యుత్తమ ఆటగాళ్లతో టీమిండియా ఆడాలనుకుంటోందని, షమీ నిస్సందేహంగా వారిలో ఒకడని నెహ్రా కితాబిచ్చాడు.

Updated Date - 2022-06-19T22:47:06+05:30 IST