బీసీసీఐ, గంగూలీని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-12-10T01:46:31+05:30 IST

సారథిగా భారత జట్టుకు ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లీని అనూహ్యంగా వన్డే జట్టు

బీసీసీఐ, గంగూలీని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

న్యూఢిల్లీ: సారథిగా భారత జట్టుకు ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లీని అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రీడాలోకం విస్తుపోయింది. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ప్రకటించిన బీసీసీఐ వన్డే జట్టు పగ్గాలను కోహ్లీ నుంచి లాగేసుకుని రోహిత్ శర్మకు అందించింది.


ఇప్పటికే టీ20 పగ్గాలను వదులుకున్న కోహ్లీకి ఇది కొంత షాకింగ్ వార్తే. ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా, కనీసం మీడియా సమావేశం కూడా లేకుండానే కోహ్లీని తప్పించి రోహిత్‌కు పగ్గాలు అందించడంపై అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 


‘షేమ్ ఆన్ యూ’ అంటూ బీసీసీఐ, దాని అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ట్విట్టర్‌లో దుమ్మెత్తి పోస్తున్నారు. ట్రోల్స్‌తో ట్విట్టర్ దుమ్మురేగుతోంది. ఇప్పటి వరకు బీసీసీఐ అన్నా, గంగూలీ అన్నా ఎంతో గౌరవభావం ఉండేదని, ఇప్పుడది పోయిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసలు కోహ్లీని ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తున్నారు.


95 మ్యాచ్‌లలో 65 విజయాలు అందించాడని తొలగించారా? లేక, 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 గెలుచి చూపించినందుకా? అని నిలదీస్తున్నారు. కోహ్లీ విజయాల శాతం 70.43గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారి దెబ్బకు ‘షేమ్ ఆన్ బీసీసీఐ’ అన్న హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది.


చూస్తుంటే క్రికెట్‌లోకి కూడా రాజకీయాలు ప్రవేశించినట్టుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగని బోర్డుకు హితవు పలికారు.


ఒకవేళ ప్రపంచకప్‌ను ప్రామాణికంగా తీసుకుంటే కనుక ధోనీ, గంగూలీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్‌లలో ఓటమి చవిచూడలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ చీఫ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు సిగ్గుపడాలని నిప్పులు చెరుగుతున్నారు.

Updated Date - 2021-12-10T01:46:31+05:30 IST