Abn logo
Oct 20 2021 @ 02:19AM

షకీబల్‌ సూపర్‌ షో

  బంగ్లా సూపర్‌-12 ఆశలు సజీవం

ఒమన్‌ ఓటమి

అల్‌ అమీరట్‌ (ఒమన్‌): పసికూన ఒమన్‌పై కష్టంగా నెగ్గిన బంగ్లాదేశ్‌.. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12 ఆశలను సజీవంగా ఉంచుకొంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షకీబల్‌ (42, 3/28)తోపాటు ముస్తాఫిజుర్‌ (4/36) నాలుగు వికెట్లతో విజృంభించడంతో.. గ్రూప్‌-బిలో మంగళవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో బంగ్లా 26 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌  నయీమ్‌ (50 బంతుల్లో 64) అర్ధ శతకం చేశాడు. బిలాల్‌ ఖాన్‌ (3/18), ఫయాజ్‌ భట్‌ (3/30) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఒమన్‌ ఓవర్లన్నీ ఆడి 127/9 స్కోరు చేసి ఓడింది. జతిందర్‌ సింగ్‌ (40) ఫర్వాలేదనిపించాడు. 


నయీమ్‌ హాఫ్‌ సెంచరీ..:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. స్వల్ప స్కోరుకే ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (6), మెహ్దీహసన్‌ (0) వికెట్లను చేజార్చుకుంది. అయితే, మరో ఓపెనర్‌ నయిమ్‌, ఆల్‌రౌండర్‌ షకీబల్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. మరోవైపు షకీబల్‌ కూడా బౌండ్రీలతో విరుచుకుపడడంతో 14వ ఓవర్‌లో టీమ్‌ స్కోరు సెంచరీకి చేరింది. అయితే, సింగిల్‌ కోసం తొందరపడిన షకీబల్‌ను ఆకిబ్‌ డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్కడ నుంచి బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొంది. అర్ధ శతకం పూర్తి చేసుకున్న నయీమ్‌.. ఖలీముల్లా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో అవుటయ్యాడు. కానీ, కెప్టెన్‌ మహ్మదుల్లా (17) టీమ్‌ స్కోరును 150 పరుగులు దాటించాడు. 


సంక్షిప్త స్కోర్లు:

బంగ్లాదేశ్‌:

20 ఓవర్లలో 153 ఆలౌట్‌ (మహ్మద్‌ నయీమ్‌ 64, షకీబల్‌ 42; బిలాల్‌ ఖాన్‌ 3/18, ఫయాజ్‌ భట్‌ 3/30); ఒమన్‌: 20 ఓవర్లలో 127/9 (జతిందర్‌ సింగ్‌ 40, కశ్యప్‌ 21; ముస్తాఫిజుర్‌ 4/36, షకీబల్‌ 3/28).