భగత్‌సింగ్‌ సహచరుడు తెలుగింటి అల్లుడు

ABN , First Publish Date - 2020-03-23T05:30:00+05:30 IST

మాతృభూమి దాస్య విముక్తి కోసం 23 ఏళ్లకే ఉరితాడును ముద్దాడిన మహా వీరుడు షహీద్‌ భగత్‌సింగ్‌. ఆయన సహచరుడు విజయ్‌కుమార్‌ సిన్హా...

భగత్‌సింగ్‌ సహచరుడు తెలుగింటి అల్లుడు

మాతృభూమి దాస్య విముక్తి కోసం 23 ఏళ్లకే ఉరితాడును ముద్దాడిన మహా వీరుడు షహీద్‌ భగత్‌సింగ్‌.  ఆయన సహచరుడు విజయ్‌కుమార్‌ సిన్హా మన తెలుగువారి అల్లుడే! భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీసి నేటికి 90 ఏళ్లు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌, విజయ్‌ల మైత్రి, మరికొన్ని జాతీయోద్యమ విశేషాలను విజయ్‌కుమార్‌ కోడలు, పద్మశ్రీ డాక్టర్‌ శాంతా సిన్హా ‘నవ్య’తో పంచుకున్నారు.


‘‘సమాజంపట్ల బాధ్యత, సాటి మనుషులతో ప్రేమగా మెలగడం, భవిష్యత్తు పట్ల ఆశాభావం, జీవితం మీద సానుకూల దృక్పథం... ఇవన్నీ మా మామయ్య, ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు విజయ్‌కుమార్‌ సిన్హా నుంచి నేర్చుకున్నాను.. అప్పుడప్పుడు మనుమరాళ్లు సుధ, దీపలతో తన జాతీయోద్యమ అనుభవాలను చెబుతుండేవారు. మామయ్య స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌. ఆయన తల్లిదండ్రులు శరత్‌కుమారి, మార్కండ్‌. మామయ్య పెద్దన్న రాజకుమార్‌ హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఏ)లో క్రియాశీల సభ్యుడు. ఆయనను 1925, అక్టోబరులో కకోరి కుట్ర కేసులో అరెస్టు చేశారు. ఆ బెంగతో తండ్రి చనిపోయారు. అన్న అరెస్టు, తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ మామయ్యమీద పడ్డాయి. అప్పుడు ఆయన వయసు  16 ఏళ్లు. ఆ తరువాత ఇండియన్‌ టెలిగ్రాఫ్‌, పయనీర్‌, స్టేట్స్‌మేన్‌ లాంటి ప్రఖ్యాత పత్రికల్లో పనిచేశారు. 




భగత్‌సింగ్‌తో  పరిచయం...

కాన్పూర్‌కు చెందిన ప్రఖ్యాత జాతీయోద్యమకారులు అజయ్‌కుమార్‌ ఘోష్‌, బటుకేశ్వర్‌దత్‌, సచీంద్రనాథ్‌ సన్యాల్‌ తదితరులు మా మామయ్యకు చిన్ననాటి స్నేహితులు. హెచ్‌ఆర్‌ఏ ప్రభావంతో ప్రపంచ పోరాటాలపై మామయ్య లోతుగా అధ్యయనం చేశారు.  కార్మిక ఉద్యమాల్లో పాల్గొనేవారు. 1927లో భగత్‌సింగ్‌ కాన్పూర్‌ వచ్చిన సందర్భంలో ఆయనతో మామయ్యకు పరిచయమయింది.  ఆ తరువాత  ఢిల్లీలో జరిగిన హెచ్‌ఆర్‌ఏ మహాసభ ఏర్పాట్లు భగత్‌సింగ్‌, శివవర్మ, సుఖ్‌దేవ్‌, మా మామయ్య చేశారు. 


వేళాకోళం నిజమైంది!

భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సుఖ్‌దేవ్‌లతో మామయ్యకున్న తీపి జ్ఞాపకాలెన్నో. వారు ఒకచోట చేరారంటే, అక్కడ నవ్వులు పూయాల్సిందేనని మా అత్తయ్య రాజ్యం ప్రత్యేకంగా చెప్పేవారు. ఆ బృందంలో మామయ్యే అందరికన్నా చిన్న. అందుకే వాళ్ళు ఆయనను ‘బచ్చు’ (చిన్నోడు) అని పిలిచేవారు. మామయ్యకు, భగత్‌సింగ్‌కు సినిమాలంటే ఇష్టం. వాటిపై చర్చలు కూడా చేసేవారు. వాళ్ళు మామయ్యని ఎప్పుడూ ‘విజయ్‌ సినిమా చూస్తున్నప్పుడే పోలీసులకు దొరికిపోతాడు’ అని వేళాకోళం ఆడేవారట! ఆ మాటలు నిజమయ్యాయి. 1929, సెంట్రల్‌ అసెంబ్లీలో బాంబు దాడి అనంతరం భగత్‌సింగ్‌ అరెస్టు అయ్యారు. అదే ఏడాది ఆగస్టులో బరేలీలోని ఒక సినిమా థియేటర్‌లో మామయ్యను బ్రిటిష్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిర్బంధంలోనూ ఒక్కోజైలు గదిలో నుంచి ఒకరు పెద్దగా స్వాతంత్య్రం, దోపిడీ లేని సమాజాన్ని కాంక్షిస్తూ పాట పాడితే, ఆ పక్క గదిలోని ఖైదీ మరో పంక్తిని అందుకొనేవారట.. 


నేతాజీతో సాన్నిహిత్యం

లాహోర్‌ కుట్రకేసులో 1930, అక్టోబరు 20న భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువడింది. శివవర్మ, మామయ్యతో సహా మిగిలిన వారందరికీ జైవిత ఖైదు విధించింది. తర్వాత ఏడాది మార్చి 23న రోజున ఉరి తీర్పు అమలుచేశారు. ఆ ఏడాది నవంబరు 5న లాహోర్‌ నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు మామయ్యతోపాటూ శివవర్మను తరలించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయోద్యమంలో పాల్గొని ఖైదీలుగా ఉన్న పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, మా అత్తగారి తండ్రి, గాంధేయవాది అన్నే అంజయ్య తదితరులతో మా మామయ్యకు పరిచయం ఏర్పడింది. అక్కడ రాజకీయ ఖైదీల హక్కులకోసం ఆయన  నిరంతర పోరాటం సాగించారు. మామయ్య కుటుంబంతో నేతాజీ సుభా్‌షచంద్రబో్‌సకి సాన్నిహిత్యం ఉండేది. స్వాతంత్ర్యానంతరం కూడా భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, నేతాజీ తదితర యోధుల కుటుంబ సభ్యులతో మామయ్య ఆత్మీయానుబంధం కొనసాగింది. 




అహింస మీదే విశ్వాసం!

అండమాన్‌ జైలులో తన ఉద్యమ సహచరులతో కలిసి రాజకీయ ఖైదీల హోదా కోసం సుదీర్ఘకాలం మామయ్య పోరాడారు తోటి ఖైదీలకు హిందీ, ఇంగ్లీషు భాషలనూ నేర్పేవారు. ఆ నిర్బంధంలో అనుభవించిన చిత్రహింసల గురించి మామయ్య ప్రస్తావించేవారు కాదు. 1938లో అనారోగ్యం కారణంగా మామయ్యని విడుదల చేశారు. తర్వాత ‘‘అండమాన్‌ దీవులు-భారతీయ బాస్టిల్‌’ పుస్తకం రాశారు. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. 1941లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, మరో నాలుగేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 14వ ఏట జాతీయోద్యమంలోకి అడుగుపెట్టిన మామయ్య సుమారు 14 ఏళ్ళు జైలులోనే  గడిపారు. మా అత్తగారు రాజ్యంతో మామయ్య పరిచయం, పెళ్లి ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్ర్యోద్యమ ఘట్టాల్లో భాగమే! 1946లో ఇరువురి వివాహం జరిగింది. అప్పటికే అత్తయ్య ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రె్‌సలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆమె శాంతినికేతన్‌లో ఉన్నత విద్యను పూర్తిచేశారు. తర్వాత ఇరువురూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 1992, జూలై 16న తెలుగు నేల మీదే మామయ్య కన్నుమూశారు. మామయ్య అనుభవాలను అత్తయ్య ‘విజయ్‌కుమార్‌ సిన్హా - ఎ రెవల్యూషనరీస్‌ క్వెస్ట్‌ ఫర్‌ శాక్రిఫైస్‌’ పేరుతో రాశారు. సమాజ పరివర్తనకు అహింసా మార్గమే శరణ్యమని మామయ్య విశ్వసించారు. భగత్‌సింగ్‌ పేరు వింటేనే పులకించేవారు. ఆ మహనీయునితో ఆయనకున్న మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు ఇతరులతో పంచుకునేవారు. ‘ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌’ సినిమాలోనూ మామయ్య పాత్రను చూపించారు.’’


-కె.వెంకటేశ్‌

Updated Date - 2020-03-23T05:30:00+05:30 IST