Abn logo
Aug 5 2020 @ 00:00AM

హోదా కన్నా సేవే మిన్న!

ఒకరు ఐఆర్‌ఎస్‌ అధికారి... మరొకరు రెడ్‌క్రాస్‌లో ఉన్నతోద్యోగి... కానీ హోదాల్లో దొరకని సంతృప్తిని వారు సేవలో వెతుక్కున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఎందరో పేద పిల్లల ఆరోగ్యానికి ఆసరా అయ్యారు. ఈ కరోనా కాలంలోనూ వేలాది మంది ఆకలి తీర్చి మన్ననలందుకుంటున్నారు ముంబయికి చెందిన అక్కా చెల్లెళ్ళు మేఘ, రుమా.


‘‘జీవితానికి సాఫల్యత డబ్బు వల్లో, అధికారిక హోదా వల్లో రాదు. సేవ ద్వారా వస్తుంది. ఇతరుల కష్టాలు తీర్చడంలోనే జీవితానికి అర్థం తెలుసుకోగలుగుతాం’’ అంటారు డాక్టర్‌ మేఘా భార్గవ. మంచి చదువు, ఉన్నతోద్యోగం. దేనికీ వెతుక్కోనవసరం లేని జీవితం ఆమెది, కానీ సాఫల్యత అంటే అది కాదని ఆమెకు తెలుసు. దాన్ని ఆమె సేవలో వెతుక్కుంటున్నారు. దంత వైద్యురాలైన ఆమె పట్టుదలగా చదివి ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారిణి అయ్యారు. తన సోదరి డాక్టర్‌ రుమా భార్గవతో కలిసి మేఘ నిర్వహిస్తున్న ‘సమర్పణ్‌’ స్వచ్ఛంద సంస్థ అణగారిన వర్గాల పిల్లల సంక్షేమం కోసం పని చేస్తోంది. అంతేకాదు, ప్రస్తుత ‘కొవిడ్‌-19’ సంక్షోభంలో వేలాది పేదలకు అండగా నిలుస్తోంది. 


మేఘ, రుమాలది రాజస్థాన్‌లోని కోటా పట్టణం. ఇద్దరికీ చదువంటే ప్రాణం. ‘‘చదువుల విషయంలో మా తల్లితండ్రులు ఏ విధంగానూ రాజీ పడలేదు. రాజస్థాన్‌ లాంటి రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణం నుంచి ఉన్నత చదువుల కోసం మహా నగరాలకు పిల్లలను పంపడం, వారికి ఆర్థికంగా అండదండలు అందించడం.. సాధారణ కుటుంబాల్లో అంత సులువుగా జరిగే పని కాదు. కానీ అమ్మానాన్నా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఇప్పుడు మేము ఈ స్థితికి చేరుకున్నామంటే దానికి కారణం వారే!’’ అంటారు మేఘ. 


అక్కా చెల్లెళ్ళిద్దరూ బాల్యం నుంచీ చదువులో టాపర్లు. మేఘ దంత వైద్యం అభ్యసించి నాలుగేళ్ళపాటు ప్రాక్టీస్‌ చేశారు. అలాగే రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ విభాగాల ఉద్యోగులకూ, మాజీ సైనికులకూ సేవలు అందించారు. పబ్లిక్‌ సర్వీస్‌లో ప్రవేశించాలన్న కోరిక అప్పుడే ఆమెకు కలిగింది. ఎంతో కృషి చేసి, సివిల్స్‌ పాసై, ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)లో చేరారు. ఇప్పుడు ముంబయిలో ఆదాయపుపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. రుమా పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మేనేజిమెంట్‌ను ముంబయి, సింగపూర్‌లలో అభ్యసించి, డిగ్రీలు అందుకున్నారు. అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ సమాఖ్యలో ప్రస్తుతం పని చేస్తున్నారు. 


‘‘చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. మంచి ఉద్యోగాలు సాధించాం. అయినా ఏదో వెలితి మా ఇద్దరినీ వెన్నాడుతూ వచ్చింది. పేద పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. అందుకే 2016లో ‘సమర్పణ్‌’ సంస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మేము సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చే స్థితిలో ఉన్నాం. మొత్తం ప్రపంచాన్ని మేము మార్చలేం. కానీ కొందరికైనా సాయపడి, వారి ముఖాల్లో చిరునవ్వు తేగలిగితే, అంతకన్నా కావలసిందేముంది’’ 


బడి పిల్లల ఆరోగ్యం కోసం...

‘‘చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. మంచి ఉద్యోగాలు సాధించాం. అయినా ఏదో వెలితి మా ఇద్దరినీ వెన్నాడుతూ వచ్చింది. పేద పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. అందుకే మేఘ సలహాదారుగా 2016లో ‘సమర్పణ్‌’ సంస్థను ఏర్పాటు చేశాను’’ అని చెప్పారు రుమా. రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను వారిద్దరూ సందర్శించారు. చాలామంది పిల్లలకు తప్పుల్లేకుండా చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చెయ్యడం కూడా రావట్లేదు. బడుల్లో కనీస సౌకర్యాలు లేవు. పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ‘‘టీచర్లు, విద్యార్థులు, వారి తల్లితండ్రులతో మాట్లాడిన తరువాత సమస్య అర్థమైంది. అప్పుడే ‘స్కూల్‌ హెల్త్‌ పోగ్రామ్‌’కు రూపకల్పన చేశాం’’ అన్నారు మేఘ. ఈ కార్యక్రమం కింద మూడు రాష్ట్రాల్లోని 41 గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రమైన నీటిని ‘సమర్పణ్‌’ అందిస్తోంది. దీనివల్ల దాదాపు 7,400 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. అలాగే పరిశుభ్రతపై విద్యార్థుల్లో ఈ సంస్థ అవగాహన పెంచుతోంది. గిరిజన పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థినులకు బయోడీగ్రేడబుల్‌ శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేస్తోంది. పిల్లల కోసం వైద్య శిబిరాలను నిర్వహించి, ప్రాథమిక వైద్య సంరక్షణ అందిస్తోంది. పేద పిల్లలకు ‘అధ్యయన్‌ కిట్స్‌’ పేరిట వారి విద్యావసరాలకు అవసరమైన పుస్తకాలు, బ్యాగ్‌లు, ఇతర సామగ్రినీ పంపిణీ చేస్తోంది. ఇంకోవైపు రాజస్థాన్‌లో ఇప్పటికీ విద్యుత్‌కు నోచుకోని కోలిపురా గ్రామంలో అరవై అయిదు కుటుంబాలకు సోలార్‌ లాంతర్లు అందజేసింది. ‘‘మొదట్లో మా సొంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళం. తీర్చాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నా ఖర్చులకు సరిపడా సమకూర్చలేకపోయేవాళ్ళం. అలాగే ఆయా ప్రాంతాల్లో పని చెయ్యడానికి వాలంటీర్లు కూడా ఉండేవారు కాదు. క్రమంగా పరిస్థితి మారింది. ‘సమర్పణ్‌’ కార్యక్రమాల గురించి తెలుసుకొని కొందరు ఉత్సాహంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు అని చెప్పారు మేఘ. 


‘‘మా సంస్థకు చోదక శక్తి మేఘ. ఎందరో వైద్యులనూ, సివిల్‌ సర్వెంట్స్‌నూ మా కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయడానికి ఆమె ఎంతో చొరవ తీసుకుంటోంది’’ అంటారు రుమా. ‘‘పిల్లల కోసం వ్యాధి నిర్ధారణ, చికిత్సా శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు ఎంతో తృప్తిగా అనిపిస్తోంది. గ్రామీణ బాలల్లో చాలామంది పోషకాహార లోపం, చర్మ వ్యాధులు, కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారికి పరిశుభ్రత, పోషకాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఆడపిల్లల్లో రుతు సంబంధమైన సమస్యల గురించి వివరించడానికి తరగతులు నిర్వహిస్తున్నాం’’ అన్నారామె.


కరోనా వేళ మేమున్నామంటూ...

‘కొవిడ్‌-19’ విజృంభణ నేపథ్యంలో ‘సమర్పణ్‌’ మరింత క్రియాశీలంగా పని చేస్తోంది. దేశవ్యాప్తంగా ఐఆర్‌ఎస్‌ అధికారులను మేఘ సంప్రతించారు. పని కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న రోజు వారీ కూలీలు, వలస కార్మికులు, గిరిజనులు, వికలాంగులు, వృద్ధ, అనాథ శరణాలయాలకూ చేయూత అందించడానికి నడుంకట్టారు. మున్సిపల్‌ అధికారులు, స్థానిక పోలీసులు, ఇతర సంస్థల సహకారంతో నిత్యావసర సరుకులు, శానిటరీ కిట్స్‌, వండిన భోజనం ప్యాకెట్లను ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, ఆనంద్‌, ఉజ్జయిని, లాతూర్‌, జోధ్‌పూర్‌ నగరాల్లో పంపిణీ చేశారు. ‘‘దాదాపు 29 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశాం. ఇవి దాదాపు ఇరవై లక్షల భోజనాలతో సమానం. వీటిలో గోధుమ పిండి, బియ్యం, పప్పులు, నూనె, చక్కెర, కూరగాయలు, మసాలా దినుసులూ ఉంటాయి. అలాగే ఇళ్ళులేని పేదల కోసం ఆరు లక్షల భోజనాలను అందించాం. ముప్ఫై ఆరువేల పాల పొడి ప్యాకెట్లు కూడా పంచిపెట్టాం. అత్యవసర సేవలు అందిస్తున్న పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు,, దినసరి కూలీలకు రెండు లక్షల అరవై వేలకు పైగా ఫేస్‌ మాస్కులూ, శానిటైజర్లు, సబ్బులూ, చేతి తొడుగులూ పంపిణీ చేశాం. అలాగే ముంబయి మురికివాడల్లో, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కారణంగా నెలసరి ఇబ్బందులు పడుతున్న మహిళలకు 25 వేల బయో డీగ్రేడబుల్‌ శానిటరీ ప్యాడ్స్‌ అందించాం. పది శ్రామిక్‌ రైళ్ళలో ముంబయి నుంచి బయలుదేరిన 16 వేలకు పైగా వలస కూలీలకు ప్రయాణంలో శుభ్రత పాటించడం కోసం శానిటైజేషన్‌ కిట్స్‌ ఇచ్చాం’’ అని వివరించారు మేఘ. ముఖ్యంగా ముంబయిలోని ధారావితో సహా అనేక మురికివాడల్లో ‘సమర్పణ్‌’ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ‘‘దీంతో అంతా పూర్తయిందనుకోవడం లేదు. స్వయంసహాయక బృందాల సహకారంతో శానిటరీ నేప్‌కిన్ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించి, వారి కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు ‘రీబిల్డింగ్‌ లైవ్స్‌’ అనే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం’’ అని చెప్పారు రుమా. ‘‘ఇప్పుడు మేము సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చే స్థితిలో ఉన్నాం. మొత్తం ప్రపంచాన్ని మేము మార్చలేం. కానీ కొందరికైనా సాయపడి, వారి ముఖాల్లో చిరునవ్వు తేగలిగితే, అంతకన్నా కావలసిందేమి లేదు’’ అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్ళు. గోరంత దీపం ఇల్లంతా వెలుగునిచ్చినట్టు వారి సేవాభావం ఎందరికో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

Advertisement
Advertisement
Advertisement