సర్వర్‌ డౌన్‌.. ప‘రేషన్‌’

ABN , First Publish Date - 2020-04-04T09:53:53+05:30 IST

తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీలో మూడోరోజు తీవ్ర గందరగోళం నెలకొంది.

సర్వర్‌ డౌన్‌.. ప‘రేషన్‌’

మొరాయించిన బయో మెట్రిక్‌ మెషిన్లు

గంటలకొద్దీ ఎండలో లబ్ధిదారులు

క్యూలైన్లలో బస్తాలు.. భోజనం అక్కడికే

బియ్యం తీసుకున్నవాళ్లకే రూ.1500 అని జోరుగా ప్రచారం

కూపన్లతో సంబంధం లేకుండా రేషన్‌ షాపులకు పోటెత్తిన జనం

క్యూలైన్లలో కనిపించని భౌతిక దూరం

లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు

రెండు, మూడు రోజుల్లో రూ.1500 నగదు కూడా అందిస్తాం: శ్రీనివాస్‌ రెడ్డి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీలో మూడోరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ)లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వర్‌ డౌన్‌ అయి బయోమెట్రిక్‌ మెషిన్లు మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా బియ్యం పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. దీనికి తోడు ఉచిత బియ్యం తీసుకున్న లబ్ధిదారులకే రూ.1500 నగదు ఖాతాలో వేస్తారని జోరుగా ప్రచారం జరగడంతో కూపన్లతో సంబంధం లేకుండా రేషన్‌షాపుల వద్దకు జనం పోటెత్తారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రేషన్‌ దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా భౌతిక దూరం పాటించాలన్న ఆదేశాలను పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా బియ్యం కోసం ఎగబడ్డారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో  రాష్ట్రంలోని తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నవారికి తలా 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుమిగూడకుండా ఉండేందుకు రోజుకు 50 కూపన్లు మాత్రమే జారీచేస్తున్నారు. బుధ, గురువారాల్లో పంపిణీ ప్రక్రియ సక్రమంగానే జరిగినప్పటికీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ-పాస్‌ మెషిన్లు మొరాయించాయి. మంచిర్యాల, సంగారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి తదితర జిల్లాలో ఒక్కో కార్డుదారుడికి పంపిణీ కోసం అరగంటకుపైగా సమయం పట్టింది.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం కూడా ఈపాస్‌ సర్వర్‌ డౌన్‌ అయింది. గంటలకొద్దీ సమయం పట్టడంతో కార్డుదారులు నిల్చోలేక క్యూలైన్లలో బస్తాలను పెట్టారు. కొందరైతే మధ్యాహ్న భోజనాన్ని రేషన్‌ దుకాణాల వద్దకే  తెచ్చుకుని తిన్నారు. ఈ-పాస్‌ మెషిన్లు మెరాయించడంతో కొన్ని జిల్లాల్లో కార్డుదారుల నుంచి సంతకాలు తీసుకుని బియ్యం పంపిణీ చేశారు. కరీంనగర్‌, సంగారెడ్డి జిల్లాల్లో ప్రతి రేషన్‌ షాప్‌కు వీఆర్వో లేదా వీఆర్‌ఏను ఇన్‌చార్జిగా నియమించారు. కార్డుదారులు వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి.. బియ్యం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజుకు 50 మందికే కూపన్లు ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తలేదు. సర్వర్‌ సరిగా పనిచేసేవరకు రిజిస్టర్‌లో సంతకాలు తీసుకుని బియ్యం పంపిణీ చేయాలని కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.


55,561 టన్నుల పంపిణీ

గతంలో ఎన్నడూ లేనివిధంగా బుధ, గురవారాల్లో రికార్డుస్థాయిలో బియ్యం పంపిణీ జరిగింది. రెండు రోజుల్లోనే 14 లక్షల కార్డుదారులకు 55,561  టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నాలుగు లక్షల కార్డుదారులు బియ్యం తీసుకున్నారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం 2.8 కోట్ల మందికి కావాల్సిన 3.34 లక్షల టన్నుల బియ్యాన్ని రేషన్‌ దుకాణాల్లో పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ నెల మొత్తం రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తామని, గతంలోని 15వ తేదీ వరకు రేషన్‌ ఇచ్చే నిబంధనను ఎత్తివేస్తున్నామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఏడీసీలో సాంకేతిక సమస్యల వల్ల శుక్రవారం కొన్నిచోట్ల సర్వర్‌ డౌన్‌ అయిందని, అయితే ఎవ్వరూ అందోళన చెందొద్దదని లబ్ధిదారులందరికీ బియ్యం పంపిణీ చేస్తామని వివరించారు. కూపన్‌ తీసుకున్నవారు మాత్రమే రేషన్‌ దుకాణాలకు రావాలని చెప్పారు.. రేషన్‌ బియ్యం తీసుకుంటేనే రూ.1500 నగదు ఇస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దని, బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1500 చొప్పున నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.


ప్రచారం నమ్మొద్దని చెప్పినా 

ఉచితంగా పంపిణీ చేస్తున్న 12 కిలోల బియ్యాన్ని తీసుకుంటేనే రూ.1500 బ్యాంకు ఖాతాల్లో పడతాయని జిల్లాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో శుక్రవారం కూపన్లు తీసుకున్నవారితో పాటు తీసుకోనివారూ రేషన్‌ దుకాణాలకు పోటెత్తారు. కూపన్లతో సంబంధం లేకుండా బియ్యం ఇవ్వాలని రేషన్‌ డీలర్లతో వాగ్వాదానికి దిగారు. రేషన్‌ బియ్యం తీసుకుంటేనే రూ. 1500 నగదు ఇస్తారనే ప్రచారం నమ్మెద్దని, బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆ నగదు బ్యాంక్‌ ఖాతాల్లో జమవుతుందని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. కొన్ని జిల్లాల్లో  క్యూలైన్లలో లబ్ధిదారులు భౌతికదూరం పాటించలేదు. ప్రతి రేషన్‌ దుకాణం వద్ద డబ్బాలు గీసినప్పటికీ ఇష్టారీతిగా వ్యవహరించారు.

Updated Date - 2020-04-04T09:53:53+05:30 IST