చిరుతదాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-12-04T08:20:27+05:30 IST

చిరుత దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన అడవిలో పడిపోయారు. ఆయన పై చిరుత దాడి మాత్రం ఆగలేదు.

చిరుతదాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

ఆ మృగాన్ని తరిమి బాధితుడి ప్రాణాలు కాపాడిన కుక్కలు 

కడ్తాల్‌, డిసెంబరు 3: చిరుత దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన అడవిలో పడిపోయారు. ఆయన పై చిరుత దాడి మాత్రం ఆగలేదు. దీంతో చిరుతను కొన్ని కుక్కలు తరిమికొట్టి బాధితుడి ప్రాణాలు కాపాడాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం అనుమా్‌సపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. అనుమా్‌సపల్లి గ్రామానికి చెందిన చెంచు ఎల్లయ్య అటవీ ప్రాంతానికి మన్నెగడ్డ సేకరణకు వెళ్లారు. అదే సమయంలో చిరుత దాడి చేసి ఎల్లయ్యను తీవ్రంగా గాయపరిచింది. ఎల్లయ్య వెంట తీసుకెళ్లిన కుక్కలు చిరుతపై విరుచుకుపడటంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎల్లయ్య మెడ, తల భాగంలో గాయాలు కావడంతో అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయారు. సాయంత్రం వరకూ ఎల్లయ్య ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గ్రామస్థులతో కలిసి అడవిలోకి వెళ్లి ఎల్లయ్య కోసం గాలించారు. దీంతో అడవిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎల్లయ్య కనిపించడంతో, ఆయనను వెంటనే కడ్తాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు.

Updated Date - 2021-12-04T08:20:27+05:30 IST