యూఏఈలో సఫారీలతో సిరీస్‌?

ABN , First Publish Date - 2020-07-23T09:16:22+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అధికారికంగా వాయిదా పడడంతో ఐపీఎల్‌ నిర్వహణ పనులను బీసీసీఐ ముమ్మరం చేస్తోంది. యూఏఈలో లీగ్‌ నిర్వహణకు ప్రభుత్వం ...

యూఏఈలో  సఫారీలతో సిరీస్‌?

లీగ్‌కు ముందే ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ 

ఐపీఎల్‌ మ్యాచ్‌లు 7.30కే ప్రారంభం? 

షెడ్యూల్‌లో మార్పులకు బీసీసీఐ యోచన


ముంబై: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అధికారికంగా వాయిదా పడడంతో ఐపీఎల్‌ నిర్వహణ పనులను బీసీసీఐ ముమ్మరం చేస్తోంది. యూఏఈలో లీగ్‌ నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈలోపు ఐపీఎల్‌ మ్యాచ్‌లు, సమయం, తదితర అంశాలపై పాలకమండలి భేటీలో చర్చించనున్నారు. ఈసారి మ్యాచ్‌ల సమయాన్ని ముందుకు జరపడంతో పాటు లీగ్‌కు ముందే ఆటగాళ్ల ప్రాక్టీస్‌ కోసమని యూఏఈ వేదికగా దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సను ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలిసింది. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్‌ జరిగేలా బోర్డు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. అయితే, షెడ్యూల్‌పై టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ అసంతృప్తిగా ఉందన్న వార్తలు రావడంతో.. వారం రోజులు ముందుగా అంటే సెప్టెంబరు 19నే టోర్నీని ప్రారంభించాలని బీసీసీఐ భావి స్తోంది. మ్యాచ్‌ల సమయాన్ని కూడా రాత్రి 8 గంటలకు కాకుండా అరగంట ముందుగా రాత్రి 7.30 గ.లకు మ్యాచ్‌ మొదలయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. 

వాటాదారుల ఒత్తిడితో..

కరోనా వైరస్‌ కారణంగా చాలా రోజులుగా భారత క్రికెటర్లకు టోర్నీలు లేకపోవడంతో ప్రాక్టీస్‌ కొరవడింది. ఫ్రాంచైజీ వాటాదారుల్లో ఎక్కువ మంది ఐపీఎల్‌ కంటే ముందు పరిమిత ఓవర్ల సిరీ్‌సను జరిపేలా బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల పరిమిత ఓవర్ల సిరీ్‌సను యూఏఈ వేదికగానే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. వాస్తవానికి భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య మార్చిలో మూడు వన్డేల సిరీస్‌ జరగాలి. అయితే, వర్షం కారణంగా అప్పుడు తొలి వన్డే రద్దవగా.. ఆ వెంటనే వైరస్‌ విజృంభణతో మిగతా రెండు మ్యాచ్‌లు జరగలేదు. అప్పటినుంచి భారత్‌  క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడలేదు. ఈ నేపథ్యంలో సఫారీలతో సిరీ్‌సతో టీమిండియా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేస్తే బాగుంటుందని బీసీసీఐ యోచిస్తోంది. దీంతో అటు భారత ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ లభించడంతో పాటు నిలిచిపోయిన సఫారీల సిరీస్‌ పట్టాలెక్కనుంది.

Updated Date - 2020-07-23T09:16:22+05:30 IST