పడిపడి లేచె!

ABN , First Publish Date - 2020-03-14T06:45:55+05:30 IST

పడిపడి లేచె!

పడిపడి లేచె!

ప్రారంభంలో సెన్సెక్స్‌ 10% పైగా పతనం

12 ఏళ్లలో తొలిసారిగా ట్రేడింగ్‌ నిలిపివేత 

మళ్లీ తేరుకుని పరుగులు తీసిన సూచీ

రూ.3.55 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్‌ సంపద


కరోనా ధాటికి శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌నూ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాంతపు ట్రేడింగ్‌ ప్రారంభంలో బేర్‌ పంజాకు బుల్‌ సొమ్మసిల్లింది. సూచీలు లోయర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ను తాకాయి. దాంతో ఎక్స్ఛేంజ్‌లు ట్రేడింగ్‌ను 45 నిమిషాలపాటు నిలిపివేశాయి. స్వల్ప విరామంలో సేదతీరిన బుల్‌ చెంగున లేచి దౌడు తీసింది. రికవరీ ర్యాలీలో సూచీలు ప్రారంభ నష్టాలను పూడ్చుకోవడమే గాక భారీగా లాభపడ్డాయి. 


ముంబై: స్టాక్‌ మార్కెట్లో వారాంతపు ట్రేడింగ్‌ సెషన్‌ ఆద్యంతం ఊగిసలాటలతో ఉత్కంఠగా సాగింది. సూచీల రోలర్‌కోస్టర్‌ రైడ్‌లో మదుపర్లు నరాలు తెగిపోతాయా? అన్నంతగా టెన్షన్‌ పడ్డారు. కరోనా ఉగ్రరూపానికి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్‌ చతికిల పడింది. బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌.. గురువారం నాటి ముగింపుతో పోలిస్తే 3,390 పాయింట్లు (10 శాతం పైగా) పతనమై 30,000 దిగువ స్థాయికి పడిపోయింది. దాంతో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఉదయం 9.20 గంటల నుంచి ట్రేడింగ్‌ను 45 నిమిషాలపాటు నిలిపివేశాయి. గడిచిన 12 ఏళ్లలో సూచీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకడంతో ట్రేడింగ్‌ నిలిపివేయడం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌ పునఃప్రారంభం తర్వాత సూచీలు మళ్లీ ఒక్కసారిగా ఎగిశాయి. వరుస పతనాల దెబ్బకు అత్యంత చౌకగా లభిస్తున్న బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు జోరందుకోవడం కలిసివచ్చింది. దాంతో సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ లాభాల దిశగా పయనించాయి. 


అతి భారీ నష్టాల నుంచి భారీ లాభాల్లోకి.. 

సెన్సెక్స్‌ తన ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 29,388.97తో పోలిస్తే ఏకంగా 5,380.51 పాయింట్లు ర్యాలీ తీసి 34,769.48 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఇంట్రాడే రికవరీ ర్యాలీ. చివరికి సూచీ 1,325.34 పాయింట్ల (4.4 శాతం) లాభంతో 34,103.48 వద్ద పరుగును ఆపింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ స్‌ఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ కూడా 365.05 పాయింట్లు (3.81 శాతం) బలపడి 9,955.20 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 8,555.15 వద్ద ట్రేడింగ్‌ కనిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది. 


రూ.16.5 లక్షల కోట్ల రికవరీ  

మార్కెట్‌ ప్రారంభంలో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల విలువ దాదాపు రూ.13 లక్షల కోట్లు తరిగిపోయి రూ.112,78,172.75 కోట్లకు దిగజారింది. మార్కెట్‌ మళ్లీ కోలుకోవడంతో వారాంతం ట్రేడింగ్‌ ముగిసేసరికి ఇన్వెస్టర్ల సంపద (గురువారం ముగింపుతో పోలిస్తే) రూ.3.55 లక్షల కోట్లు పెరిగి రూ.129,26,242.82 కోట్లకు చేరుకుంది. అయితే వారం మొత్తం మీద మాత్రం ఇన్వెస్టర్ల సంపద రూ. 15 లక్షల కోట్లు ఆవిరైపోయింది.


గతంలో ట్రేడింగ్‌ నిలిపివేసిన సందర్భాలు.. 

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్‌ నిలిపివేయాల్సి రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన. 2008 జనవరి 22న కూడా సూచీలు సర్క్యూట్‌ బ్రేక్‌ చేయడంతో స్వల్పకాలంపాటు ట్రేడింగ్‌ నిలిపివేశారు. 2012 అక్టోబరు 5న ఎన్‌ఎ్‌సఈలో చోటు చేసుకు న్న ఫ్రీక్‌ ట్రేడ్‌ కారణంగానూ కొద్ది నిమిషాలపాటు ట్రేడిం గ్‌ నిలిచిపోయింది. 


బంగారం ధర రూ.1,097 తగ్గుదల 

అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం నాడు రూ.1,097 తగ్గి రూ.42,600కు పరిమితమైంది. వెండి రేటు సైతం కిలోకు రూ.1,574 తగ్గి రూ.44,130కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 1,584 డాలర్లు, వెండి 15.65 డాలర్లు పలికింది. 



కరోనా భయాలతో తీవ్ర ఊగిసలాటలకు లోనవుతున్న స్టాక్‌ మార్కెట్లను ప్రభుత్వం, ఆర్‌బీఐ నిశితంగా గమనిస్తున్నాయి. 

- నిర్మలా సీతారామన్‌, ఆర్థిక మంత్రి 


ప్రపంచ  మార్కెట్లో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మార్కెట్‌ స్థిరత్వంతోపాటు వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత కోసం అవసరమైన చర్యలు  చేపడతాం. 

- ఆర్‌బీఐ 


ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో క్షీణత తక్కువే. మరికొద్ది వారాల్లోనే దేశీయంగా పరిస్థితులు మళ్లీ కుదుటపడతాయి. కరోనా భయాలను అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటాయి. 

- కేవీ సుబ్రమణియన్‌, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు

Updated Date - 2020-03-14T06:45:55+05:30 IST