లాక్‌డౌన్ సడలింపుతో సెన్సెక్స్ జోరు.. 800 పాయింట్లు జూమ్..

ABN , First Publish Date - 2020-06-01T23:49:51+05:30 IST

కొవిడ్-19 లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ...

లాక్‌డౌన్ సడలింపుతో సెన్సెక్స్ జోరు.. 800 పాయింట్లు జూమ్..

ముంబై: కొవిడ్-19 లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పోటీపడడంతో బజాజ్ ఫైనాన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ తదితర షేర్లు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాయి. దీంతో సెన్సెక్స్ 2.7 శాతం మేర ఎగబాకగా.. నిఫ్టీ సైతం అంతే స్థాయిలో లాభం నమోదుచేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊపునిచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో 1250 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్... ట్రేడింగ్ ముగిసే సమయానికి 879.42 పాయింట్ల (2.57 శాతం) లాభంతో 33,303.52 వద్ద ముగిసింది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సైతం  245.85 పాయింట్ల లాభంతో (2.57 శాతం) 9,826.15 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్ 11 శాతం మేర అత్యధిక లాభం నమోదు చేయగా.. టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

Updated Date - 2020-06-01T23:49:51+05:30 IST