3 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్‌

ABN , First Publish Date - 2020-06-23T06:05:14+05:30 IST

దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులను ఏ మాత్రం పట్టించుకోకుండా స్టాక్‌ మార్కెట్లు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఆర్థిక సేవలు, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మూడు నెలల గరిష్ఠ స్థాయికి...

3 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్‌

  • 179 పాయింట్లు లాభపడిన సూచీ  


ముంబై: దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులను ఏ మాత్రం పట్టించుకోకుండా స్టాక్‌ మార్కెట్లు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఆర్థిక సేవలు, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సోమవారం బీఎ్‌సఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 482 పాయింట్ల మేర పుంజుకున్న సెన్సెక్స్‌.. చివరికి 179.59 పాయింట్ల లాభంతో 34,911.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 66.80 పాయింట్లు లాభపడి 10,311.20 వద్ద స్థిరపడింది.


సరిహద్దు ఉద్రిక్తతలపై ఇండియా-చైనా మధ్య చర్చలు మళ్లీ మొదలవడమూ మార్కెట్‌ సెంటిమెంట్‌ను కొంత మెరుగుపర్చింది. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో బజాజ్‌ ఆటో 6.63 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌ 5.34 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 4.85 శాతం బలపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సైతం 4 శాతం పైగా పెరిగాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 3.13 శాతం, ఎన్‌టీపీసీ 2.42 శాతం పుంజుకున్నాయి. హెచ్‌డీఎ్‌ఫసీ అత్యధికంగా 1.13 శాతం నష్టాన్ని నమోదు చేసుకుంది.   


గ్లెన్‌మార్క్‌ దూకుడు

కొవిడ్‌-19 చికిత్స కోసం యాంటీ వైరల్‌ ఔషధం ఫాబీఫ్లూ ను విడుదల చేయటంతో స్టాక్‌ మార్కెట్లో గ్లెన్‌మార్క్‌ షేరు దూసుకుపోయింది. బీఎ్‌సఈలో ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 36.99 శాతం లాభంతో 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.572.70 స్థాయిని తాకింది.  చివరకు 27.06 శాతం లాభంతో రూ.519.80 వద్ద క్లోజైంది. మరోవైపు ఎన్‌ఎ్‌సఈలో కూడా ఈ షేరు 26.96 శాతం లాభపడి రూ.519.75 వద్ద స్థిరపడింది. కాగా రెమ్‌డెసివిర్‌ జెనరిక్‌ ఔషధాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించటంతో సిప్లా షేరు 3 శాతం వరకు లాభపడింది. బీఎ్‌సఈలో ఈ షేరు ఒక దశలో 9.24 శాతం లాభంతో ఏడాది గరిష్ఠ స్థాయిని తాకి చివరకు 2.94 శాతం లాభంతో రూ.655.80 వద్ద క్లోజైంది. 


రిలయన్స్‌ రికార్డుల హోరు

అత్యంత విలువైన కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌ @ 57 


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో ఘనత సాధించింది. 150 బిలియన్‌ (15,000 కోట్ల) డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన ఏకైక భారత కంపెనీగా రిలయన్స్‌ రికార్డు సృష్టించింది. సోమవారం బీఎ్‌సఈ ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆర్‌ఐఎల్‌ షేరు ధర 2.53 శాతం లాభపడి రూ.1,804.10కి చేరింది. తదనుగుణంగా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మరో రూ.28,248.97 కోట్లు పెరిగి మొత్తం రూ.11,43,667 కోట్లకు (15 వేల కోట్ల డాలర్లు) చేరుకుంది. అయితే, మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.


బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ షేరు ధర 0.70 శాతం నష్టంతో రూ.1,747.20కి జారుకుంది. దాంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.11,07,620 కోట్ల (14,568 కోట్లు)కు తగ్గింది. గత శుక్రవారమే ఆర్‌ఐఎల్‌ షేర్లు 6 శాతం పైగా లాభపడటంతో మార్కెట్‌ విలువ రూ.11 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. తద్వారా ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక దేశీయ కంపెనీగా రికార్డును సొంతం చేసుకుంది. ఇంట్రాడేలో నమోదైన సరికొత్త రికార్డు ప్రకారంగా ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్‌ 57వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది మొదట్లో 70వ స్థానంలో ఉన్న ఆర్‌ఐఎల్‌.. కరోనా సంక్షోభానికి స్టాక్‌ మార్కెట్లు కుదేలవడంతో మార్చి 24 నాటికి 104వ స్థానానికి పడిపోయింది.

Updated Date - 2020-06-23T06:05:14+05:30 IST