చైతన్యరాహిత్యంలో మధ్యతరగతి

ABN , First Publish Date - 2022-07-09T10:04:08+05:30 IST

వర్తమాన భారతీయ సమాజంలో మధ్యతరగతి అనే ఒక సామాజిక వర్గం ఇంకా ఉన్నదా? అని అప్పుడప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను.

చైతన్యరాహిత్యంలో మధ్యతరగతి

వర్తమాన భారతీయ సమాజంలో మధ్యతరగతి అనే ఒక సామాజిక వర్గం ఇంకా ఉన్నదా? అని అప్పుడప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను. రాజ్యాంగ సక్రమత, తోటివారి శ్రేయస్సుకు పాటుపడే తాపత్రయం, కుటుంబ సభ్యులు, ఆప్తులు, మిత్రుల బాగోగులపై శ్రద్ధాసక్తులు ఇత్యాది మధ్య తరగతి విలువలు ఉన్న మధ్యతరగతి వర్గం నిజంగా ఉన్నదా? సందేహం లేదు, ప్రస్తావిత మధ్యతరతి విలువలు ఉన్న వ్యక్తులు ఎంతో మంది నాకు తెలుసు. అయితే అటువంటి సమున్నత విలువలు ఉన్న ఒక వర్గం ఉన్నదా? లేదు అని నిశ్చితంగా చెప్పవచ్చు. మన మధ్యతరగతి శ్రేణుల జీవితాలలో ఆ సుగుణాలు అంతర్ధానమై పోతున్నాయి. కాల వైపరీత్యం కాబోలు!


19వ శతాబ్దిలో మన జాతీయ పునరుజ్జీవనోద్యమం, దాని స్ఫూర్తితో, ఆ ఉద్యమానికి తార్కిక కొనసాగింపుగా ప్రజ్వరిల్లిన స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రదీప్తం చేసిన మన తాతల తరాన్ని చూడండి. ఆనాడు మన సమాజంలో ధనవంతులు అతి తక్కువ మంది ఉండేవారు. మిగతా వారందరూ పేదలే. పాశ్చాత్య విద్యా విధానం (ముఖ్యంగా ఆంగ్ల భాషా బోధన, బోధనా మాధ్యమంగా ఆంగ్లం), అలాగే పాశ్చాత్య న్యాయవిచారణా వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత మన సమాజంలో నవీన విద్యావంతులతో మధ్యస్థమైన వర్గం ఒకటి ప్రభవించి కాల క్రమంలో మధ్య తరగతి వర్గంగా పరిణమించింది. మన దేశంలో ప్రప్రథమంగా ఉపాధ్యాయులు, డాక్టర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ప్రభుత్వోద్యోగులు, సైనికాధికారులు, పాత్రికేయులు, రచయితలు మొదలైన ఆధునిక మేధావులు ఆవిర్భవించారు. ఈ బుద్ధిజీవులే మధ్యతరగతి వర్గంలో ప్రధాన భాగంగా ఉన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు అందరూ, కొద్ది మంది మినహా, మధ్యతరగతి వర్గం నుంచి ప్రభవించినవారే. దాదాభాయి నౌరోజీ, గోపాలకష్ణ గోఖలే, లజ్‌పత్ రాయ్, బాలగంగాధర తిలక్, చిత్తరంజన్ దాస్, రాజేంద్ర ప్రసాద్, వల్లభ్ భాయి పటేల్, మౌలానా ఆజాద్, రాజాజీ, సరోజినీ నాయుడు, కేలప్పన్, పొట్టి శ్రీరాములు మొదలైన మహామహులు అందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. ‘దేశ ప్రజానీకంలో జాతీయ చైతన్యాన్ని రగుల్కొల్పడం, స్వాతంత్ర్యోద్యమాన్ని సంఘటితంచేసి, అంతిమంగా విదేశీ పాలననుంచి మాతృభూమిని విముక్తపరచిన ఘనత సంపూర్ణంగా మధ్యతరగతి ప్రజలదే’ అని ప్రముఖ చరిత్రకారుడు తారాచంద్ తన ‘భారత్‌లో స్వాతంత్ర్యోద్యమ చరిత్ర’లో ప్రస్తుతించారు.


ఆ మహోన్నత నాయకుల స్వాతంత్ర్య సమర శంఖారావాలకు ప్రజలు మహోదాత్తంగా ప్రతిస్పందించారు. కలసికట్టుగా రైతు ఉద్యమాలు, పారిశ్రామిక కార్మికుల పోరాటాలను నిర్వహించారు. ఆ ఉద్యమాల, పోరాటాల బలిమితో స్వాతంత్ర్యోద్యమం సంపూర్ణ విజయం సాధించే దిశగా సాగిపోయింది. సఫలమయింది. మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రభవించిన నాయకులు, వారి అనుయాయులు నిస్వార్థ కృషి చేశారు. వారు తమ కోసం కాకుండ పల్లె భారతికి అన్ని విధాల స్వేచ్ఛను సముపార్జించేందుకే జీవితాలను అంకితం చేశారు.


మధ్యతరగతి విద్యావంతుల నాయకత్వంలో సాగిన స్వాతంత్ర్యపోరాటం కేవలం దేశ స్వాతంత్ర్యం కోసమేనా? కాదు, కానేకాదు. అన్ని రంగాలలోనూ దేశ ప్రజల జీవితాలను సమున్నతం చేయడమే ఆ మహోజ్వల పోరాట లక్ష్యం. ఆ కాలంలో టెలివిజన్, ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ స్వాతంత్ర్యోద్యమ వార్తలు ఆసేతు శీతాచలం ఎక్కడికైనా వడివడిగా చేరుతుండేవి.. చంపారన్ సత్యాగ్రహం, జలియన్ వాలా భాగ్ హింసాకాండ, పూర్ణ స్వరాజ్ తీర్మానం, దండి యాత్ర, యువ కిశోరాలు సర్దార్ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు ఉరిశిక్ష, క్విట్ ఇండియా ఉద్యమం, నేతాజీ సుభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతీయులను జాగృతం చేశాయి. లక్ష్య సాధన దిశగా వారిని వడివడిగా ముందుకు నడిపించాయి. ఈ ఘనమైన చరిత్ర నిర్మాతలు మధ్యతరగతి ప్రజలే.


ఏమైపోయింది ఆ మధ్యతరగతి ఇప్పుడు? వర్తమాన భారతీయ ప్రజా జీవితంలో మధ్యతరగతి ప్రజలు కనిపించడం లేదు. ఇది స్పష్టం. ఎందుకని? మధ్యతరగతి వారు తమను తామే ఏకాకులను చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎడతెగకుండా పెరిగిపోతోన్న ధరలు, అధికమవుతోన్న పన్నుల భారం, నిరుద్యోగం, కొవిడ్ కాలంలో దేశీయ వలసల విషాదం, అంచనాలకు అందని కొవిడ్ సంబంధిత మరణాలు, మితిమీరుతున్న పోలీసుల ఆగడాలు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మానవ హక్కుల నిరాకరణ, ఒక పద్ధతి ప్రకారం ముస్లింలు, క్రైస్తవులను ప్రధాన స్రవంతి నుంచి మినహాయించడం, విద్వేష ప్రసంగాలు, బూటకపు వార్తలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, వ్యవస్థల పతనం, ప్రజల తీర్పును తలకిందులు చేయడం, చైనాతో సరిహద్దు ఘర్షణలు... వీటిలో ఏ ఒక్కటీ మధ్యతరగతి భారతీయులలో ఎలాంటి కదలికను తీసుకురాలేదు!


ఇటీవలి పరిణామాలతో ఈ శోచనీయ పరిస్థితిని నిశితంగా విశదం చేస్తాను. 2021 ఫిబ్రవరిలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు. సభా నిబంధనల ప్రకారం కొత్త స్పీకర్‌ను రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవాలి. అయితే ఆ నిబంధనలను మార్చివేసి స్పీకర్ ఎన్నికను బహిరంగ బ్యాలెట్‌తో నిర్వహించాలని నిర్దేశించారు. కొత్త స్పీకర్ ఎన్నిక తేదీని ఖరారు చేసే బాధ్యత రాష్ట్ర గవర్నర్‌దే (ఈయన ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి. అందునా బీజేపీకి చెందివ నేత). అయితే ఆయన తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించడానికి బదులు, ఆ ఎన్నికను వాయిదా వేసి. కొత్త నిబంధనలు కోర్టు పరిశీలనలో ఉన్నాయనే సాకుతో ఆ ఎన్నిక నిర్వహణను నిలిపివేశారు. ఒకరోజు కాదు, రెండురోజులు కాదు, ఏకంగా 17 నెలల పాటు నిలిపివేయడం జరిగింది. ఈ కాలంలో స్పీకర్ లేకుండానే అసెంబ్లీ పని చేసింది. సరే, బీజేపీ సహాయంతో ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఏక్‌నాథ్ షిండే గత నెల 30న ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త స్పీకర్ ఎన్నికకు తేదీ ఖరారు చేయాలని గవర్నర్‌ను కోరాడు. బహిరంగ బ్యాలెట్‌తో కొత్త గవర్నర్ ఎన్నికను నిర్వహించారు. నిబంధనలు ఏమైపోయాయి? పత్రికలు లాంఛనప్రాయంగా సంపాదకీయాలు రాశాయి. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కాలేదు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తన విషయమై మహారాష్ట్ర విద్యావంతులు ఏ మాత్రం పట్టించుకోలేదు. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా గవర్నర్ తన బాధ్యతలను ఎందుకు నిర్వహించలేదని ఎవరూ ప్రశ్నించలేదు. కొత్త స్పీకర్ ఎన్నికను 17 నెలల పాటు నిలిపివేయడం రాజ్యాంగబద్ధమేనా? అమెరికాలోగానీ, బ్రిటన్‌లోగానీ అయితే ఇటువంటి ఉదాసీనతను సహించేవారేనా? 


మరో ఉదాహరణ చూద్దాం. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం జరిగింది (ఇందులో బీజేపీకే ప్రాబల్యమున్నదని మరి చెప్పనవసరం లేదు). ప్రీ–ప్యాక్డ్ ఆహార ధాన్యాలు, చేపలు, తేనె, బెల్లం, గోధుమ మొదలైన వాటిపై 5 శాతం జీఎస్టీ విధించారు. వివిధ రకాల సిరాలు, స్పూన్‌లు, పెన్సిల్ షార్పెనర్లు, ఎల్ఇడి బల్బులు మొదలైన వాటిపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచారు. ఇలా పన్నుల వడ్డింపు సమంజసమేనా? ద్రవ్యోల్బణం వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? అయినా లయన్స్ క్లబ్‌లు, మహిళా బృందాలు, చాంబర్స్ ఆఫ్ కామర్స్, కార్మిక సంఘాలు, వినియోగదారుల సంఘాలు మొదలైన వేవీ ఏమాత్రం పట్టించుకోలేదు. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ఎందుకు ప్రారంభించారో గుర్తుచేసుకునేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.


మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా విద్యాధికులు విశాల సమాజం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? దినపత్రికలు చదవడం, నెట్ ఫ్లిక్స్‌కు అతుక్కుపోవడం, ఐపీఎల్ క్రికెట్‌తో వినోదం, ఆహ్లాదాన్ని పొందడానికే ఎందుకు పరిమితమవుతున్నారు? జాతీయ వ్యవహారాలపై జరిగే చర్చోపచర్చల నుంచి ఈ విద్యావంతులు తమకు తామే స్వచ్ఛందంగా ఎందుకు వైదొలిగారు? ఢిల్లీ అధికార పీఠం కదిలిపోయేలా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడారు. సైనిక దళాల్లో చేరదలుచుకున్న యువకులు తమకు జరగాల్సిన న్యాయం కోసం పోరాడుతున్నారు. కొద్దిమంది పాత్రికేయులు, న్యాయవాదులు, ప్రజా రంగ కార్యకర్తలు ఇంకా వివిధ సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటాల ఫలితాలే దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయనే సత్యాన్ని మధ్యతరగతి మహాశయులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు?



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-07-09T10:04:08+05:30 IST