కార్పొరేట్‌ భక్తితోనే ఆస్తుల అమ్మకం

ABN , First Publish Date - 2020-02-18T06:07:23+05:30 IST

బడ్జెట్‌ లోటును తీర్చుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మడం ఒక విధానంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఈ సంవత్సరం కూడా రూ. రెండులక్షల పదివేల కోట్లు ఈ విధంగా సంపాదించాలని ఆర్థిక శాఖా మంత్రి తాజా బడ్జెట్‌‌లో..

కార్పొరేట్‌ భక్తితోనే ఆస్తుల అమ్మకం

ఈ సంవత్సరం వాటాల అమ్మకం ద్వారా రెండు లక్షల పది వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సేకరించాలని మొన్నటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల వాటాలు అమ్మేయడంతో నేడు ఎల్‌ఐసి వంటి మంచి లాభసాటి సంస్థను తెరమీదకు తీసుకువచ్చారు. రూ.32.3 లక్షల కోట్లకు పైగా విలువైన ఆస్తులున్న ఈ సంస్థ వాటాలు కూడా అమ్మేయబోతున్నట్టు ప్రకటించారు. వ్యసనపరులు కూడా తమ ఆస్తులను చవకగా అమ్ముకోరు. కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమల వాటాల అమ్మకాలన్నీ ఇలాగే సాగుతున్నాయి.


బడ్జెట్‌ లోటును తీర్చుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మడం ఒక విధానంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఈ సంవత్సరం కూడా రూ. రెండులక్షల పదివేల కోట్లు ఈ విధంగా సంపాదించాలని ఆర్థిక శాఖా మంత్రి తాజా బడ్జెట్‌‌లో ప్రతిపాదించారు. ఇందులో తాజాగా ఎల్ఐసి (జీవిత బీమా సంస్థ) కూడా వచ్చి చేరింది. ఇక్కడ రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి. ఒకటి, ఈ రకంగా చేయడం సరైనదేనా అన్నదైతే, మరొకటి ఈ రకంగా వచ్చే ఆదాయం స్థిరంగా ప్రతి సంవత్సరం వస్తుందా అన్నది.


రెండవదానిని ముందు పరిశీలిస్తే మన ముందు కొన్ని అనుభవాలు సాక్షాత్కరించడమేకాక మొదటి దానికి సమాధానం కూడా దొరుకుతుంది. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మడం, బడ్జెట్‌ అవసరాలకు వాడుకోవడం మన దేశంలో కొత్తేమీ కాదు. రెండు దశాబ్దాలకు పైగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మరింత స్పీడుగా అమలవడమే ప్రత్యేకత. 1990వ దశకంలో ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నష్టాలొచ్చే సంస్థలను ప్రభుత్వం ఎన్నాళ్ళు భరిస్తుంది. అందువల్ల అటువంటి సంస్థలను అమ్మేయడమే సరైనదని నాటి ప్రధాని పి.వి. నరసింహా రావు, అప్పటి ఆర్థిక శాఖా మంత్రి మన్మోహన్ సింగ్ వంటి వారు వాదించారు. కొంత మంది ప్రజలు ఈ వాదన సరైనదేనని కూడా భావించారు. అలా కొన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను పూర్తిగా కాని, కొంత భాగం కానీ అమ్మేశారు. తరువాత వాజ్‌పాయ్ ప్రధామంత్రిగా ఉన్న కాలంలో మరో కొత్త వాదన ముందుకు తెచ్చారు. అదేమిటంటే, నష్టాలొచ్చే సంస్థలను ఎవరు కొంటారు, అందువల్ల లాభాలొచ్చే వాటినే అమ్మేస్తామని. సరిగ్గా ఇక్కడి నుండే కొత్త చరిత్ర ప్రారంభమైంది. ఇలా లాభాలొచ్చే సంస్థల వాటాలు అమ్మడానికి నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. దానితో కోట్లాది రూపాయలు లాభాలు గడిస్తున్న మాహా రత్న, మినీ రత్న, నవ రత్న హోదా ఉన్న సంస్థలన్నటిని ఆ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. యుపిఏ–1 ప్రభుత్వ కాలంలో ఈ విధానానికి కొంత బ్రేక్ పడడమే కాక, విశాఖలోని బిహెచ్‌పివి లాంటి కొన్ని ప్రభుత్వరంగ పరిశ్రమల పటిష్టత కూడా జరిగింది. యుపిఏ–2 కాలంలో మారలా వాటాల అమ్మకం ప్రారంభమైంది. మొత్తంగా చూస్తే గత రెండు దశాబ్దాలకు పైగా వివిధ ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ పరిశ్రల వాటాల అమ్మకం, ప్రవేటీకరణ విధానాలను అనుసరిస్తూనే ఉన్నాయి.


1991-–92 ఆర్థిక సంవత్సరం నుండి 2018–-19 వరకు మొత్తం 3,47,439 కోట్ల రూపాయలు ఈ వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వం సంపాదించింది. ఈ క్రమంలో 27 ప్రభుత్వ రంగ పరిశ్రమలు పూర్తిగా మూసివేయబడ్డాయి. మరో 26 పరిశ్రమలు అమ్మివేయడంకాని, విలీనంగాని జరిగాయి. ఈ వాటాల అమ్మకానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఎన్నడూ ప్రభుత్వం ఆశించినంత ఆదాయం ఈ విధంగా రాకపోవడం. ఈ రకంగా రాకపోవడానికి ప్రధాన కారణం ఈ వాటాలకున్న విలువకు కొనుక్కోవడానికి ఎవరూ ముందుకురాకపోవడం. దీనికి ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద రెండే మార్గాలున్నాయి. ఒకటి వాటాల అమ్మకాన్ని నిలిపివేయడం, రెండవది ఉన్న విలువ కంటే తక్కువకు అమ్మివేయడం. ప్రభుత్వం ఈ రెండో మార్గాన్నే అవలంబిస్తోంది. ఉదాహరణకు 2003లో భారత్ అల్యూమినియం కంపెనీలో ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయల విలువైన తన 51శాతం వాటాను కేవలం 551కోట్ల రూపాయలకు అమ్మి వేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 20 వేల కోట్ల రూపాయల విలువైన 10శాతం వాటాలను 4889 కోట్ల రూపాయలుగా చూపించి అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల వాటాల అమ్మకాలన్నీ ఇలా సాగుతున్నవే. ఇంత చవకగా తమ ఆస్తులు అమ్మడం వ్యసనపరులు కూడా చేయరు. కానీ మన ప్రభుత్వం అదే పనికి పూనుకోవడం విడ్డూరమే.


నేడు అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ప్రభుత్వ వాటా 51 శాతం వరకు దాదాపు కుదించబడింది. బాగా లాభాలొచ్చే బ్లూ చిప్ కంపెనీలలో ఇక ఏ మాత్రం వాటాలమ్మినా పూర్తిగా ప్రవేటుపరమవుతాయి. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 52.18, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లో 53.29, గాస్ ఆధారటీ ఆఫ్ ఇండియాలో 52.64, పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 55.37 శాతం వాటాలను మాత్రమే ప్రభుత్వం నేడు కలిగి ఉంది. కంపెనీ చట్టం క్లాజ్ 45 ప్రకారం ఏదైనా పరిశ్రమలో కనీసం 51 వాటా ప్రభుత్వం కలిగి ఉంటేనే ఆ పరిశ్రమను ప్రభుత్వ రంగ కంపెనీ అవుతుంది. 


తన బడ్జెట్‌ లక్షాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మరిన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల వాటాలను అమ్మకానికి పెడుతోంది. అయినా అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడంతో గత సంవత్సరం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ఒక కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అదేమిటంటే ప్రభుత్వానికి 51శాతం కంటే తక్కువ వాటాలున్నా యాజమాన్యం మాత్రం ప్రభుత్వం వద్దే ఉండేటట్లు కంపెనీ చట్టాన్ని సవరించాలని. ఈ విధంగా చట్టాన్ని సవరించి, బ్లూ చిప్ కంపెనీలలో వాటాలను 51 శాతం కూడా లేకుండా అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి ప్రభుత్వం చేస్తున్న వాదనేమిటంటే, ఈ రోజు అనేక ప్రవేటు రంగ పరిశ్రమలలో ఏ ఒక్కరికీ 51 శాతం వాటాలు లేకపోయినా ప్రవేటు పరిశ్రమగానే ఉన్నాయి, కనుక ప్రభుత్వం కూడా 50 శాతం కంటే తక్కువ వాటాలతో అలాంటి యాజమాన్య హక్కులనే కలిగి ఉండవచ్చునని.


గమనించవలసిందేమేమిటంటే, చట్టాలను కూడా సవరించి ఇలా వాటాలు అమ్ముకుంటూ పోతే ప్రస్తుతానికి ప్రభుత్వానికి తన బడ్జెట్‌ అవసరాలు కొంతమేరకు తీరవచ్చు. కాని కొన్నేళ్ళకు ఇక ఈ సంస్థలలో ప్రభుత్వ వాటాలే లేని పరిస్థితి రాక తప్పదు. ఎందువల్లనంటే, అమ్ముతుంటే వాటాలు తరుగుతాయి కాని పెరగవు కదా! అప్పుడు ఇక వేటిని అమ్ముతారు? అందువల్ల ఈ రకమైన ఆదాయం ఎన్నడూ స్థిరమైనది కాదు, సరికదా ఉన్న ఆస్థులను కోల్పోవడమే అవుతుంది. అందువల్ల ఈ విధానం ఈ రకంగాను సమర్థనీయం కాదు.


ఈ సంవత్సరం వాటాల అమ్మకం ద్వారా రెండు లక్షల పది వేల కోట్ల రూపాయల మొత్తాన్ని భారీగా సేకరించాలని మొన్నటి బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల వాటాలు అమ్మేయడంతో నేడు ఎల్‌ఐసి వంటి మంచి లాభసాటి సంస్థను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. రూ.32.3 లక్షల కోట్లకు పైగా విలువైన ఆస్థులున్న ఈ సంస్థ వాటాలు కూడా అమ్మేస్తామని తెలిపారు. ఎంతకు తగ్గించి అమ్ముతారో ప్రభుత్వానికే తెలియాలి. రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టినందుకుగాను ఎల్‌ఐసి ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.20వేల కోట్ల డివిడెండు చెల్లించింది. గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.2611 కోట్ల డివిడెండుగాను, 10 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలోను ప్రభుత్వానికి చెల్లించింది. ఇదికాక– ఎల్‌ఐసి 2019 నాటికి రూ.29,84,331 కోట్లను నీటి పారుదల, హౌసింగ్ వంటి ప్రజాసంక్షేమ చర్యలకు అందించింది. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా సహాయాన్ని అర్థించకుండా ఎల్‌ఐసి ఇంత సహకారాన్ని దేశానికి అందిస్తుంటే, మరోపక్క అంబాని, ఆదాని వంటి ఏ ప్రవేటు పరిశ్రమా ఈ రకంగా చేయడంలేదు సరికదా, ప్రభుత్వం నుండి భారీగా రాయితీలు పొందడం, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టడం నేడు పరిపాటిగా మారడాన్ని మనం చూస్తున్నాం. 


దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమలు 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.20,33,732 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాయి. రూ.1,59, 635కోట్ల లాభాలనార్జించాయి. రూ.76,578 కోట్లు డివిడెండ్లు, వివిధ పన్నుల రూపంలో రూ.3,50,052 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. రూ.86,980కోట్ల విదేశీ మారక నిల్వలను ఆర్జించాయి. రోజూ బంగారు గుడ్లుపెట్టే బాతును చంపేసిన తెలివితక్కువవానిలా ప్రభుత్వం నేడు బంగారుబాతులాంటి ప్రభుత్వ సంస్థల వాటాలను తన రోజువారీ అవసరాలకు తెగనమ్మడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. 


ఏ ఆస్తులు అమ్మకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వచ్చే ఆదాయవనరైన సంపన్నులపై విధించే 1957నుండి ఉన్న ఆస్తి పన్నును మోదీ ప్రభుత్వం 2016లో రద్దు చేసింది. దీనిని మరలా పునరుద్ధరించి శత కోటీశ్వరుల వద్ద ఉన్న ఆస్తిపై ఒక్క శాతం పన్ను విధించినా ప్రభుత్వానికి సాలీనా 5 లక్షల 60 వేల కోట్ల రూపాయలు, వారసత్వ పన్నుద్వారా మరో 9 లక్షల 30 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ తెలిపారు. ఇలా వచ్చిన 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో ప్రాధమిక విద్య, వైద్యం, వృద్ధాప్య పింఛన్ పెంచడం, ఉపాధి హామీ, రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనాలు వంటి చర్యలకు ఖర్చు చేస్తే దేశం అభివృద్ధి చెందడమే కాక నేటి ఆర్థిక మాంద్యం నుండి కూడా బయట పడుతుంది. కాని ప్రభుత్వం ఆ పని చేయకపోగా ప్రభుత్వ సంస్థల వాటాలను తెగనమ్మడానికి పూనుకోవడం దేశభక్తా? కార్పొరేట్ భక్తా? అన్నది తేటతెల్లమే.

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2020-02-18T06:07:23+05:30 IST