Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కొత్తజోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్!

twitter-iconwatsapp-iconfb-icon
కొత్తజోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమానికి కేంద్రం తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రం సిద్ధించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు, వివిధ రంగాలలో వినూత్న సంస్కరణలు చేపట్టారు.


పరిపాలనలో వికేంద్రీకరణ ఉండాలి, ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అత్యధిక ఉద్యోగ అవకాశాలు స్థానికులకు దక్కాలి, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి అన్నవి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. వీటిని దృష్టిలో ఉంచుకుని ముందుగా 33 జిల్లాలను, కొత్తగా అవసరం మేరకు రెవిన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాలలో పాత ఉద్యోగాలను, కొత్త ఖాళీలను ఉమ్మడి రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థ, అంతకుముందున్న నిబంధనల ప్రకారం భర్తీ చేస్తే తెలంగాణ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర సాధనకు అర్థం ఉండదు. అందువల్ల, కేసీఆర్ ఉద్యోగ సంఘాలు, నిపుణులు, మేధావులతో రెండేళ్లపాటు పలుమార్లు చర్చించి కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన తెలంగాణ నూతన జోనల్ వ్యవస్థ, తదనుగుణంగా రూపొందిన జీఓ 317 సుమారు 60 ఏళ్ళుగా తెలంగాణ నియామకాలలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది నిరుద్యోగ యువతకు వరప్రదాయినిగా మారబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ మూలంగా రాబోయే తరాలకు ఈ నూతన జోనల్ వ్యవస్థ ఆశాజ్యోతి కానున్నది. తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతానికి, గ్రామాలకు అన్ని శాఖల ఉద్యోగుల సేవలు అందుబాటులోకి రానున్నవి. తెలంగాణ నూతన జోనల్ వ్యవస్థ గొప్పతనం అర్థం చేసుకోవాలంటే 100 సంవత్సరాల చరిత్ర మనం గుర్తు చేసుకోవలసి ఉంటుంది. 


హైదరాబాద్ సంస్థాన ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రాంతం వారికే దక్కే విధంగా 1919లో నిజాం రాజు ముల్కీ నిబంధనలు తీసుకువచ్చారు. 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తరువాత రాజ్ ప్రముఖ్ (గవర్నర్) ఫర్మాన్ ద్వారా ముల్కీ నిబంధనలు తిరిగి తీసుకొచ్చారు. 1950 లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత భారత రాజ్యాంగంలోని 35 (బి) ఆర్టికల్ ద్వారా హైదరాబాద్ స్టేట్‌కు ముల్కీ నిబంధనలు వర్తింపజేశారు. ఆ తదుపరి తెలంగాణ ప్రాంతాన్ని 1956లో ఆంధ్రలో విలీనం చేసిన తర్వాత కూడా భారత రాజ్యాంగంలోని 35 (బి), ఎస్సార్సీ చట్టం సెక్షన్ 119 ప్రకారం ముల్కీ నిబంధనలకు రక్షణ కల్పించారు. అయితే ఏవిఎస్ నర్సింహరావు మరికొందరితో కలిసి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌లో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.


1969 తెలంగాణ ఉద్యమంలో ముల్కీ నిబంధనలు ముఖ్యపాత్ర పోషించాయి. దీనిని గమనించి 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 8 పాయింట్ ఫార్ములా (ఆంధ్రకు తరలించిన నిధుల లెక్కతీయడం, తిరిగి తెలంగాణకు సమకూర్చడం, తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రణాళికలు, ప్రణాళికా సంఘం సలహాదారు అధ్యక్షతన అధికారుల కమిటీ, కమిటీలో అధికారులకు ఎక్కువ అధికారాలు, స్థానికులకు తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యోగుల సర్వీసు సమస్యల పరిష్కారం, తెలంగాణ అభివృద్ధి కేంద్రం శ్రద్ధ వహించడం) తెచ్చారు. 1972లో అది 5 పాయింట్ ఫార్ములాగా రూపాంతరం చెందింది. ఆ తరువాత ది డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వి.వెంకట్ రెడ్డి వేసిన కేసులో ముల్కీ నిబంధనలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ముల్కీ నిబంధనలను 1972లో మళ్ళీ భారత ప్రభుత్వం గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వారు కొట్లాడి సాధించుకున్న హక్కులకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసి 6 పాయింట్ ఫార్ములా (వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, విద్యాసంస్థలలో స్థానికులకు సమాన అవకాశాలు, నాన్ గెజిటెడ్, వివిధ క్యాడర్ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు పరిపాలన ట్రిబ్యునల్, వీటి అమలుకు, సమస్యల పరిష్కారానికి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ, ఇవన్నీ అమలు చేస్తున్న నేపథ్యంలో ముల్కీ రూల్స్, ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అవసరం లేదు) 32 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371Dని తీసుకువచ్చి 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా తెచ్చి తెలంగాణ హక్కులను కాలరాశారు. దీనిమూలంగా జిల్లా స్థాయిలో 20, జోనల్ క్యాడర్‌లో 30, రాష్ట్రస్థాయిలో 40శాతం స్థానికేతరులకు కేటాయించారు. తెలంగాణ ప్రజలు గత్యంతరం లేక ఒప్పుకోవాల్సిన పరిస్థితి. 


రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా అప్పటి ప్రభుత్వాలు పాటించక పోవడంతో అప్పటి టీఎన్జీఓల ఒత్తిడి కారణంగా 1985లో 610 జీఓ (1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా నియామకం అయిన స్థానికేతరులను తిరిగి వారి స్వస్థలాలకు పంపించడం) ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ఆఖరుకు 610 జీఓ కూడా అమలుకు నోచుకోక తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగడం వలన 2001లో గిర్‌గ్లానీ కమిషన్ వేయవలసి వచ్చింది. చివరకు ఆ కమిషన్ రిపోర్టు కూడా అమలుకు నోచుకోలేదు. చారిత్రాత్మక పోరాటం ద్వారా కేసీఆర్ నాయకత్వంలో 2014లో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. 


తెలంగాణ సాధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 97ను అనుసరించి 371డి మరియు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోనే ఉండిపోయాయి.


తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. కానీ ఈ భర్తీ ప్రక్రియలో పాత జోనల్ వ్యవస్థల వలన, జిల్లా స్థాయిలో 20, జోనల్ స్థాయిలో 30, రాష్ట్ర స్థాయిలో 40శాతం స్థానికేతరులకు అవకాశం ఉండడం వలన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. యువతకు మంచి జరగాలంటే కొత్త జోనల్ వ్యవస్థ అవసరం అని కేసీఆర్ గారు అన్ని స్థాయిల్లో 95శాతం లోకల్ రిజర్వేషన్లు ఉండే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 4 (2) సెక్షన్ ప్రకారం, ప్రభుత్వ అవసరాలకు అనుకూలంగా ఉద్యోగుల పంపిణీ చేయాలని, వీలయినంత మేరకు ఉద్యోగి ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏ ఉద్యోగి అయినా ఈ నూతన జోనల్ కేటాయింపు వలన ఇబ్బందికి లోనైతే 60 రోజుల్లో ప్రభుత్వానికి వివరించాలని, ప్రభుత్వం సెక్షన్ 3 నియమాలను అనుసరించి పరిష్కరించాలని రాష్ట్రపతి ఉత్తర్వులలో సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జీవో 317 విడుదల చేసి రాష్ట్రపతి ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలుచేస్తున్నది.


అయితే కాంగ్రెస్, బిజెపిలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు నూతన జోనల్ వ్యవస్థను తప్పు పడుతూ, జోనల్ వ్యవస్థ మూలంగా బదిలీ అవుతున్న 5 నుండి 10 శాతం ఉద్యోగస్తుల సమస్య పేరుతో కుటిల రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణలో రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలుపుకొని సుమారు 9.3 లక్షల మంది ఉన్నారు. దేశంలో అత్యధికంగా ఉద్యోగులున్న రాష్ట్రం తెలంగాణనే. ఈ జోనల్ వ్యవస్థ ఖరారు అయ్యాక ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ఐఎఎస్ ఆఫీసర్ కమిటీ నివేదిక అందిన వెంటనే సుమారు 60- నుంచి 70 వేల ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయనున్నది. కేంద్ర ప్రభుత్వంలో సుమారు 15,62,912 ఖాళీలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గత అయిదు సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ఆర్మీ మినహా కేవలం 4,44,813 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడం వలన ప్రభుత్వ రంగంలో సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.


1991 నుండి ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం వలన కేంద్రానికి 5 లక్షల కోట్లు చేరాయి. 13 ఏళ్ల బీజేపీ పాలనలో 3.74 లక్షల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు అమ్మగా 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 1.24 లక్షల కోట్ల ఆస్తులు తెగనమ్మారు. ఈ రెండు జాతీయ పార్టీలు అమ్మిన సంస్థల వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు రిజర్వేషన్‌లో కోల్పోయిన ఉద్యోగాలు సుమారు 1.2 లక్షలు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి గ్రామానికి ప్రభుత్వ సదుపాయాలు అందాలనే సదుద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వులు సెక్షన్ 4(2)ను అనుసరించి ఉద్యోగుల విభజన జరిగింది. కొత్త జోనల్ వ్యవస్థ అమలు మూలంగా వివిధ క్యాడర్‌లలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులలో కేవలం 5 నుండి 10 శాతం మంది మాత్రమే ప్రభావితం అవుతున్నారు.


ఈ విషయంలో కూడా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పరస్పర బదిలీలకు, భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి మేలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలంగాణ నిరుద్యోగ యువతకు స్థానిక రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థ తెస్తే బీజేపీ, కాంగ్రెస్‌లు కుటిల రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణ యువత, ఉద్యోగులు దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.