స్వీయ నియంత్రణే అసలైన ఆయుధం

ABN , First Publish Date - 2020-04-25T09:08:59+05:30 IST

‘కరోనా వైరస్‌ కనిపించని శత్రువు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండడమే మనముందున్న కర్తవ్యం..

స్వీయ నియంత్రణే అసలైన ఆయుధం

కరోనా నివారణ, నిర్మూలన  అందరి బాధ్యత

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే క ఠిన చర్యలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ రవిందర్‌  


వరంగల్‌ అర్బన్‌,  ఆంధ్రజ్యోతి ప్రతినిధి: ‘కరోనా వైరస్‌ కనిపించని శత్రువు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండడమే మనముందున్న కర్తవ్యం.. మిగతా యుద్ధాలకు భిన్నంగా కరోనా వైర్‌సపై చేసే యుద్ధానికి ప్రత్యేక లక్షణం ఉంది.. ఈ శత్రువును ఓడించాలంటే ప్రజలంతా సైనికులు కావాలి.. అయితే యుద్ధరంగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు.. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు హాయిగా ఉండడమే కరోనాను అంతమొందించే యుద్ధతంత్రం.. అందుకే ప్రజలంతా  స్వీయ నియంత్రణ పాటించాలి..’ అని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ రవిందర్‌ అన్నారు. ఆయన ఆంధ్రజ్యోతితో శుక్రవారం ప్రత్యేకంగా మాట్లాడారు...


ప్రశ్న: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ ఏ విధంగా అమలవుతోంది..? 

జవాబు: పకడ్బందీగా అమలవుతోంది. అనవసరంగా రోడ్లమీదకు వచ్చే వారి వాహనాలు సీజ్‌ చేస్తున్నాం.  వరంగల్‌, జనగామ, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట లాంటి పట్టణాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాం. అదే విధంగా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాక పోకలను నియంత్రించాం.


ప్ర: లాక్‌డౌన్‌ అమలు పరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారా..?

జ: ప్రజల రాకపోకలపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాలు, సిటిజన్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌ ఉపయోగిస్తున్నాం. ట్రాకింగ్‌ సిస్టం ద్వారా ఒకే వాహనం ఎన్ని సార్లు రోడ్డు మీదకు వచ్చిందనే విషయం తెలుసుకోగలుగుతున్నాం.. డ్రోన్‌ కెమెరాల ద్వారా కంటైన్మంట్‌ ఏరియాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తున్నాం.. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కాలనీల్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. వాటి ఆధారంగా చర్యలు చేపడుతున్నాం.


ప్ర: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? 

జ: అనవసరంగా రోడ్డుమీదకు వచ్చిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశాం. ఇప్పటివరకు కమిషనరేట్‌ పరిధిలో 466 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం.  12,515 ఈ- పెటీ కేసులు పెట్టాం.. అదే విధంగా 9,539 వాహనాలను సీజ్‌ చేశాం. ఇందులో 8877 ద్విచక్రవాహనాలు, 438 ఆటోలు, 186 కార్లు, 38 ఇతర వాహనాలు ఉన్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 23,638 కేసులు నమోదు చేసి, రూ. 83 లక్షల జరిమానా విధించాం. మద్యం అక్రమ అమ్మకాలు సాగించిన వారిపై 31 కేసులు నమోదు చేశాం..


ప్ర: కరోనా భయభ్రాంతులకు గురిచేస్తున్నప్పటికీ, ప్రజలు రోడ్ల మీదకు ఎందుకు వస్తున్నారంటున్నారు..? 

జ: ప్రభుత్వం అన్ని విధాలుగా చైతన్యపరుస్తోంది. కళ్ళ ముందు దాని తీవ్రత కనిపిస్తోంది.. అయినా జనం వస్తూనే ఉన్నారు. కరోనా వైర్‌సతో యుద్ధం భిన్నమైందని అర్థం చేసుకోవాలి. ఆయుధాలను సమకూర్చుకుని యుద్ధరంగంలోకి వెళ్ళే అవకాశం లేదు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్ళల్లో ఉండటమే కరోనాను గెలిచే యుద్ధతంత్రం.


ప్ర: కరోనా కష్ట కాలంలో పోలీసుల పాత్రలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయంటారు..? 

జ:  పోలీసుల బాధ్యత మరింత పెరిగింది. ట్రాకింగ్‌, ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ఐసోలేషన్‌ అనే అంశాలతో ప్రత్యేకంగా పనిచేస్తున్నాం.  శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే కాదు.. అనేక అంశాలపై దృస్టి సారించాల్సి వస్తోంది. పాజిటివ్‌ కేసులకు సంబంధించి కాంటాక్టు వివరాలు వేగంగా సేకరించి వారిని క్వారంటైన్‌ సెంటర్‌లకు తరలించడం... నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచడం, కొరత ఏర్పడితే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తెప్పించడం, అధిక ధరలకు అమ్మకుండా చూడడం, బ్లాక్‌మార్కెటింగ్‌కు తరలించకుండా ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి పర్యవేక్షణ జరపడం చేస్తున్నాం.  కాంట్రాక్టర్‌లతో మాట్లాడి వలస కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు చేపట్టాం. 


ప్ర: కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా అనేక అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రజలు వీటితో గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. ?

జ: కరోనా కుల,మత, ధనిక, పేద, ప్రాంతాల తారతమ్యాలు లేకుండా విజృంభిస్తుంది.. సోషల్‌ మీడియా మీద ప్రత్యేకంగా  దృష్టి సారించాం.  కల్పిత వీడియోలు, సమాచారంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.


ప్ర: లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఏవిదంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు..?

జ: పోలీసుల కోసం కాకుండా తమ  కుటుంబ స భ్యుల క్షేమం కోసం అనవసరంగా బయటకు రావొద్దు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి.   ప్రా ణాలు పణంగా పెట్టి పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నార న్న విషయాన్ని గుర్తించాలి.. పోలీసుల ఆదేశాలు పాటించాలి.

Updated Date - 2020-04-25T09:08:59+05:30 IST