Abn logo
Jun 25 2021 @ 20:36PM

భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు పట్టివేత

హైదరాబాద్‌: తమకు అందిన పక్కా సమాచారంతో దాడి చేసి భారీ మొత్తంలో నకిలీ విత్తనాలను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కాలం చెల్లిన విత్తనాలను అమ్ముతున్న ప్రాంతాలపై బాలానగర్, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారని సీపీ సజ్జనార్ తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం కాలం చెల్లిన విత్తనాలను  అమ్ముతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. వీరి నుంచి 14.4 టన్నుల కాలం చెల్లిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. 2కోట్ల విలువైన కృత్రిమ విత్తనాలను పట్టుకున్నామన్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన షైక్ కాలేష్ అనే వ్యక్తి నకిలీ విత్తనాలను రైతులకు అమ్ముతున్నాడని ఆయన తెలిపారు. కాలేస్ వద్ద కానల మహేష్ విత్తనాలు తెచ్చి మార్కెటింగ్ చేసేవాడన్నారు. వీరికి గొల్లపెద్ద డొద్దన్న, చక్కలి జయమ్మ,  పుల్యాల రవి, పెద్ది పూర్ణచందర్, షైక్ గౌస్ సహకరించారని సీపీ పేర్కొన్నారు. కాలేష్ వలీ ఈ ముఠా మొత్తానికి న్యాయకత్వం వహించాడన్నారు. 

రిజెక్ట్ అయిన సీడ్స్‌ను కానల మహేష్ వద్ద కలెక్ట్ చేసి మళ్లీ వారికి అమ్మేవారన్నారు. అనేక రకాల కంపెనీల పేరుతో ప్యాకింగ్ చేసి  కాలేష్ వలీ అమ్మేవారన్నారు. గత ఆరేళ్లుగా ఈ వ్యాపారం జరుగుతోందని సీపీ పేర్కొన్నారు. మేడ్చల్‌లో 3, షాద్‌నగర్‌లో ఒక కేసు నమోదు చేసామని, మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ లో 12 కేసులు నమోదు చేసామని సీపీ తెలిపారు.  వారి వద్ద నుంచి ఒక ఐషర్ వెహికల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అగ్రికల్చర్ అధికారుల సహకారంతో గత మూడు నెలలుగా అనేక ప్రాంతాల్లో దాడులు చేసామని సీపీ తెలిపారు. మొత్తం 2కోట్ల 17 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేసామన్నారు. నకిలీ విత్తనాల గురించి రైతులు నిర్భయంగా సమాచారం 9490617444 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. అన్ బ్రాండ్ విత్తనాలను, లూజ్ విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని రైతులకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.