వైసీపీలో ముసలం!

ABN , First Publish Date - 2022-06-11T07:09:11+05:30 IST

అధికార వైసీపీలో లుకలుకలు పెరుగుతున్నాయి. దాడులు, గొడవలు, విమర్శలతో నేతలు రోడ్డెక్కుతున్నారు. కృష్ణా జిల్లా వైసీపీలో ఏర్పడిన ముసలం ముదిరింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి-మాజీ మంత్రి పేర్ని నాని.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ-వైసీపీ మాజీ..

వైసీపీలో ముసలం!

బందరులో బాలశౌరికి నిరసన సెగ.. పేర్ని నానిపై ఎంపీ ఫైర్‌

కొనకళ్లతో వారానికొకసారైనా మాట్లాడకపోతే నీకు నిద్రపట్టదు

వైసీపీని తిట్టిన సుజనాతో కార్యక్రమాలా?

ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా ఇక నుంచి బందరులోనే ఉంటా

బాలశౌరి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే వంశీపై యార్లగడ్డ విసుర్లు

గత ఎన్నికల్లో విలన్‌పై పోటీ చేశా

వైసీపీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించా

మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడేదెవరో

ప్రభుత్వం విచారిస్తే తేలుతుందని వ్యాఖ్య


(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

అధికార వైసీపీలో లుకలుకలు పెరుగుతున్నాయి. దాడులు, గొడవలు, విమర్శలతో నేతలు రోడ్డెక్కుతున్నారు. కృష్ణా జిల్లా వైసీపీలో ఏర్పడిన ముసలం ముదిరింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి-మాజీ మంత్రి పేర్ని నాని.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ-వైసీపీ మాజీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు నడుమ విభేదాలు భగ్గుమన్నాయి. అటు శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీ ‘అసమ్మతి’ నేత ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇది ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరుల పనే అని అనువని ఇస్తున్నారు.  మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి వ్యతిరేకంగా సొంత పార్టీ కార్పొరేటర్‌ అస్ఘర్‌ అలీ తన అనుచరులతో ఆందోళనకు దిగారు. ‘బాలశౌరీ గో బ్యాక్‌’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అస్ఘర్‌.. పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఈ ఆందోళన వెనుక ఆయన హస్తమే ఉందని ఎంపీ వర్గం భావిస్తోంది. గత కొంత కాలంగా బాలశౌరికి, పేర్ని నానికి పొసగడం లేదు.


ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. కాపులకు తానే పెద్ద అన్న రీతిలో పేర్ని నాని వ్యవహరిస్తున్నారని బాలశౌరి గుర్రుగా ఉన్నారు. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం మచిలీపట్నంలో మ్యూజియం, ఆడిటోరియం నిర్మించాలన్న ఎంపీ ప్రతిపాదన కార్యరూపం దాల్చకుండా పేర్ని అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వైసీపీ కార్పొరేటర్‌ అస్ఘర్‌ చిన్న విషయానికే బాలశౌరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం వెనుక పేర్ని నాని ఉన్నారని ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సంఘటన అనంతరం బాలశౌరి మాజీ మంత్రిపై విరుచుకుపడ్డారు. ‘బందరు ఎమ్మెల్యే పేర్ని నాని అగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. సొంత పార్టీ ఎంపీ మచిలీపట్నంలో తిరగకుండా అడ్టుకుంటున్నాడు. టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికి ఒకసారైనా మాట్లాడకపోతే ఆయనకు నిద్రపట్టదు. వేరే పార్టీ ఎంపీ(సుజనా చౌదరి)తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఆ ఎంపీ ముఖ్యమంత్రిని, పార్టీని, ప్రభుత్వాన్ని అవినీతిమయమని తిడితే స్పందించడు.


కానీ సొంతపార్టీ ఎంపీ బందరు రాకూడదు. బందరు నీ అడ్డాకాదు.. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటా. నా ప్రొటోకాల్‌ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తా. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా. తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే రకం కాదు నేను. మూడేళ్లలో ఒక్కసారైనా ఒక్క కార్యక్రమానికి సొంత పార్టీ ఎంపీని పిలిచావా.. ప్రొటోకాల్‌ గురించి నువ్వు, నీ పక్కనున్నవాళ్లు మాట్లాడడం సిగ్గుచేటు. బందరు అభివృద్ధికి ఎప్పుడైనా సహకరించావా? నువ్వు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడ్డావో బందరు ప్రజలందరికీ తెలుసు’ అని ధ్వజమెత్తారు.


గన్నవరంలో వంశీకి సెగ

ఇక గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు, వైసీపీ డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి కొంతకాలంగా విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం విదితమే. తాజాగా వారికి మరో నాయకుడు జత కలిశారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వంశీపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా వంశీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒక విలన్‌పై పోటీ చేశానన్నారు. అతడిని పార్టీలోకి తీసుకునే సమయంలో వ్యతిరేకించానని చెప్పారు. ప్రతిసారీ తాను అధిష్ఠానంతో పోరాటం చేయలేనని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నత కాలం గన్నవరం రాజకీయాల్లో తాను ఉంటానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. ఈ రోజు వరకు తాను టీడీపీ నాయకులతో మంతనాలు జరపలేదన్నారు. వైసీపీ అధిష్ఠానం గన్నవరం సీటు ఎవరికి ఇస్తే వారు పోటీ చేస్తారని.. అద్దెకొచ్చిన వారికి ఇస్తుందా లేక సొంత పార్టీలో ఉన్నవారికి ఇస్తుందా అనేది దాని ఇష్టమని చెప్పారు. తనకిస్తే పోటీచేస్తానన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు మట్టి అక్రమాలపై తాను పోరాటం చేశానన్నారు.


‘నేనుఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని తిట్టలేదు. ఆరోజు టీడీపీలో ఉండీ వైసీపీ నాయకులను తిట్టి ఈ రోజు వైసీపీలోకి వచ్చి టీడీపీ నాయకులను తిడుతున్నారు.. వ్యక్తిగత దూషణలు చేసే వ్యక్త్తిత్వం కాదు నాది’ అని యార్లగడ్డ పేర్కొన్నారు. తాను గన్నవరం వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ఒక తట్ట మట్టి కూడా తవ్వలేదని.. పైసా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడేదెవ రో ప్రభుత్వం విచారిస్తే తేలుతుందని చెప్పారు.

Updated Date - 2022-06-11T07:09:11+05:30 IST