మోతెక్కించారు

ABN , First Publish Date - 2020-07-18T09:04:22+05:30 IST

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌ స్టోక్స్‌ (356 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 176)) సొగసైన ఇన్నింగ్స్‌, ఓపెనర్‌ సిబ్లే (372 బంతుల్లో

మోతెక్కించారు

స్టోక్స్‌, సిబ్లే సెంచరీలు 

ఇంగ్లండ్‌ 469/9 డిక్లేర్డ్‌ 

చేజ్‌కు ఐదు వికెట్లు

విండీస్‌తో రెండో టెస్ట్‌


బెన్‌ స్టోక్స్‌, డామ్‌ సిబ్లే అసలు సిసలు టెస్ట్‌ ఆటతో రెండోరోజూ ఆకట్టుకున్నారు. నాలుగో వికెట్‌కు డబుల్‌ సెంచరీకిపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ భారీస్కోరు సాధించింది. 


మాంచెస్టర్‌: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌ స్టోక్స్‌ (356 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 176)) సొగసైన ఇన్నింగ్స్‌, ఓపెనర్‌ సిబ్లే (372 బంతుల్లో 5 ఫోర్లతో 120) సెంచరీతో వెస్టిండీ్‌సతో రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరితోపాటు కీపర్‌ బట్లర్‌ (40) సత్తా చాటడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది ఆఫ్‌ స్పిన్నర్‌ రోస్టన్‌ చేజ్‌కు ఐదు వికెట్లు లభించాయి. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ శుక్రవారం ఆట ఆఖరికి వికెట్‌ నష్టానికి 32 రన్స్‌ చేసింది. 

అసలు సిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌: సిబ్లే, స్టోక్స్‌ మొదటి రోజు మాదిరే వెస్టిండీస్‌ బౌలర్లను విసిగించారు. ఎంతో ఓపికతో ఆడిన వీరు టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌ ఇలా ఉండాలి అని నిరూపించారు. అయితే విండీస్‌ పేసర్లు వీరిద్దరినీ పదేపదే ఇబ్బందిపెట్టినా వికెట్‌ మాత్రం సాధించలేకపోయారు. ముఖ్యంగా గాబ్రియెల్‌, జోసెఫ్‌ గంటకు 140 కి.మీ.లకుపైగా వేగంతో వేసిన బంతులు పలుమార్లు స్టోక్స్‌, సిబ్లే బ్యాట్‌ అంచులను తాకుతూ వెళ్లాయి. అంతేకాదు..పదునైన యార్కర్లతో ఆ ఇద్దరినీ బౌలర్లు బెంబేలెత్తించారు. కానీ 11 ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకున్న వెస్టిండీస్‌ పేసర్లపై స్టోక్స్‌ ఎదురు దాడికి దిగి చక్కటి షాట్లతో అలరించాడు. మరోవైపు సిబ్లే టెస్ట్‌ల్లో రెండో సెంచరీ పూర్తి చేయగా..భోజన విరామానికి ఇంగ్లండ్‌ 264/3 స్కోరు చేసింది. 

11 పరుగులకు 2 వికెట్లు: లంచ్‌ అయిన వెంటనే చేజ్‌ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన స్టోక్స్‌ తన పదో సెంచరీకి చేరుకున్నాడు. ఇక..శతకం అనంతరం పలుమార్లు అవుటయ్యే ప్రమాదాలను తప్పించుకున్న సిబ్లే చివరకు చేజ్‌ బౌలింగ్‌లో రోచ్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దాంతో 260 పరుగుల నాలుగో వికెట్‌కు భాగస్వామ్యానికి తెరపడింది. ఇదే ఊపుతో పోప్‌ను కూడా చేజ్‌ ఎల్బీగా బలిగొన్నాడు. దాంతో 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ రెండు వికెట్లు చేజార్చుకుంది. అనంతరం స్టోక్స్‌కు బట్లర్‌ జతవడంతో టీ విరామానికి ఇంగ్లండ్‌ 5 వికెట్లకు 378 పరుగులు చేసింది. 

విండీ్‌సకు బ్రేక్‌: భోజన, టీ విరామాల మధ్య అద్భుతమైన షాట్లతో అలరించి..డబుల్‌ సెంచరీ దిశగా దూసుకుపోతున్న స్టోక్స్‌కు పేసర్‌ రోచ్‌ బ్రేక్‌ వేశాడు. రోచ్‌ బంతిని స్టోక్స్‌ రివర్స్‌ స్వీప్‌తో స్టాండ్స్‌లోకి పంపబోగా బ్యాట్‌ అంచును తాకుతూ కీపర్‌ డౌరిచ్‌ చేతిలోకి వెళ్లింది. దాంతో వెస్టిండీస్‌ ఊపిరి పీల్చుకుంది. తర్వాత బట్లర్‌ సత్తాచాటగా, ఆఖర్లో బెస్‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31 నాటౌట్‌) దూకుడు ప్రదర్శించాడు. 


10 టెస్ట్‌ల్లో స్టోక్స్‌కు ఇది పదో సెంచరీ. కాగా విండీ్‌సపై అతనికిది రెండోది.


సంక్షిప్తస్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 469/9 డిక్లేర్డ్‌ (స్టోక్స్‌ 176, సిబ్లే 120, బట్లర్‌ 40, బెస్‌ 31 నాటౌట్‌, చేజ్‌ 5/172, రోచ్‌ 2/58) వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌:  32/1 (బ్రాత్‌వైట్‌ బ్యాటింగ్‌ 6, జోసెఫ్‌ బ్యాటింగ్‌ 14, కర్రాన్‌ 1/8).

Updated Date - 2020-07-18T09:04:22+05:30 IST