అటా.. ఇటా!

ABN , First Publish Date - 2022-01-06T06:22:41+05:30 IST

దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య రెండో టెస్ట్‌ రసకందాయంగా మారింది. సీనియర్‌ బ్యాటర్లు రహానె (58), పుజార (53) అర్ధ శతకాలతో రాణించడంతో..

అటా.. ఇటా!

రెండో టెస్టులో పోరాడుతున్న దక్షిణాఫ్రికా 

లక్ష్యం 240 పరుగులు

ప్రస్తుతం 118/2 

నడిపిస్తున్న ఎల్గర్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 266

రహానె, పుజార అర్ధ శతకాలు


సఫారీలగడ్డపై చారిత్రక సిరీస్‌ విజయంపై గురిపెట్టిన భారత్‌ మధ్య.. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ అడ్డు నిలవడంతో.. రెండో టెస్ట్‌ ఫలితం అటా.. ఇటా అని ఉత్కంఠ రేపుతోంది. రహానె, పుజార కీలక సమయంలో ఆదుకోవడంతో.. భారత్‌ 240 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. అయితే, ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. గట్టిగానే బదులిస్తోంది. విజయం కోసం సఫారీలకు మరో 122 పరుగులు కావాల్సి ఉండగా.. భారత్‌ 8 వికెట్లు పడగొట్టాలి. పలుమార్లు బంతి శరీరానికి తగిలినా ఎల్గర్‌ పట్టుదలతో పోరాడుతున్న నేపథ్యంలో.. మ్యాచ్‌పై భారత్‌ పట్టు సడలుతున్నట్టుగా కనిపిస్తోంది!  


జొహాన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య రెండో టెస్ట్‌ రసకందాయంగా మారింది. సీనియర్‌ బ్యాటర్లు రహానె (58), పుజార (53) అర్ధ శతకాలతో రాణించడంతో.. ప్రత్యర్థి ముందు భారత్‌ 240 పరుగుల  లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఛేదనలో దక్షిణాఫ్రికా బుధవారం ఆట చివరకు 2 వికెట్ల నష్టానికి  118 పరుగులతో దీటుగా బదులిస్తోంది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (46), డుస్సెన్‌ (11) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (31), పీటర్సన్‌ (28) అవుటయ్యారు. ఎల్గర్‌ ముందుండి నడిపిస్తుండడంతో సఫారీల విజయానికి 122 పరుగులు కావాల్సి ఉండగా.. సిరీస్‌ నెగ్గేందుకు భారత్‌కు 8 వికెట్లు అవసరం. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 85/2తో మూడోరోజు ఆటను కొనసాగించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (40 నాటౌట్‌) సత్తా చాటాడు. రబాడ, ఎన్‌గిడి, జాన్సెన్‌ తలో 3 వికెట్లు దక్కించుకున్నారు.

 

ఆదుకొన్న మిడిలార్డర్‌: ఎట్టకేలకు మిడిలార్డర్‌ గాడిలో పడడంతో.. ప్రత్యర్థి ముందు టీమిండియా పోరాడగలిగే లక్ష్యాన్ని ఉంచింది. వరుస వైఫల్యాలతో జట్టులో తమ స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న వెటరన్లు పుజార, రహానె కీలక సమయంలో ఫామ్‌ చాటుకున్నారు. సఫారీ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగులు సాధించారు. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ పుజార.. ఎన్‌గిడి బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే 2 ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. రహానె కూడా వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 25వ ఓవర్‌లో జాన్సెన్‌ బౌలింగ్‌లో రహానె చూడముచ్చటైన సిక్స్‌తో అలరించాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మరో రెండు బౌండ్రీలతో గేర్‌ మార్చాడు. మరోవైపు ధాటిగా ఆడిన పుజార అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రహానె కూడా 2 వరుస ఫోర్లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ దాటాడు. కాగా, రహానెను అవుట్‌ చేసిన రబాడ.. మూడో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. తర్వాతి ఓవర్‌లో పుజారను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సెటిల్డ్‌ బ్యాటర్లు ఇద్దరూ స్వల్ప తేడాతో పెవిలియన్‌కు చేరడంతో స్కోరు వేగం మందగించింది. రిషభ్‌ పంత్‌ (0) మరోసారి నిర్లక్ష్యమైన షాట్‌తో వికెట్‌ పారేసుకోగా.. అశ్విన్‌ (16)ను ఎన్‌గిడి క్యాచ్‌ అవుట్‌ చేశాడు. ఈ దశలో విహారి, శార్దూల్‌ (28) ఆదుకొనే ప్రయ త్నం చేయడంతో భారత్‌ 188/6తో లంచ్‌కు వెళ్లింది. ఆ తర్వాత విహారి సంయమనంతో ఆడగా.. శార్దూల్‌ ఎదురుదాడి చేస్తూ జట్టు స్కోరును 200 మార్క్‌ దాటించారు. జాన్సెన్‌ వేసిన 50వ ఓవర్‌లో 6,4,4తో బ్యాట్‌ను ఝుళిపించిన శార్దూల్‌.. మరో భారీషాట్‌కు యత్నించి క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో 7వ వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. షమి (0)ని జాన్సెన్‌ డకౌట్‌ చేసినా.. టెయిలెండర్లు బుమ్రా (7), సిరాజ్‌ (0)తో కలసి 17, 21 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన విహారి.. సవాల్‌ విసరగలిగే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగాడు. 


జోరుగా సఫారీలు: లక్ష్య ఛేదనలో ఓపెనర్లు ఎల్గర్‌, మార్‌క్రమ్‌ శుభారంభాన్నివ్వడంతో టీ సమయానికి  దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోకుండా 34 రన్స్‌ చేసింది. అయితే, మూడో సెషన్‌ ఆరంభంలోనే భారత్‌కు బ్రేక్‌ దొరికింది. ధాటిగా ఆడుతున్న మార్‌క్రమ్‌ను శార్దూల్‌ ఎల్బీ చేయడంతో.. తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పీటర్సన్‌ కూడా ఎల్గర్‌కు సహకారం అందిస్తూ.. రెండో వికెట్‌కు 46 రన్స్‌ జోడించాడు. అయితే, పీటర్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్‌ జట్టుకు ఆశించిన బ్రేక్‌ ఇచ్చాడు. కానీ, ఎల్గర్‌, డుస్సెన్‌.. భారత బౌలర్లను విసిగిస్తూనే రోజును ముగించారు. 


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 202.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 229.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సెన్‌ 8, మయాంక్‌ (ఎల్బీ) ఒలివియెర్‌ 23, పుజార (ఎల్బీ) రబాడ 53, రహానె (సి) వెర్రెన్‌ (బి) రబాడ 58, విహారి (నాటౌట్‌) 40, పంత్‌ (సి) వెర్రెన్‌ (బి) రబాడ 0, అశ్విన్‌ (సి) వెర్రెన్‌ (బి) ఎన్‌గిడి 16, శార్దూల్‌ (సి) మహరాజ్‌ (బి) జాన్సెన్‌ 28, షమి (సి) వెర్రెన్‌ (బి) జాన్సెన్‌ 0, బుమ్రా (సి) జాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 7, సిరాజ్‌ (బి) ఎన్‌గిడి 0; ఎక్స్‌ట్రాలు: 33; మొత్తం: 60.1 ఓవర్లలో 266 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-24, 2-44, 3-155, 4-163, 5-167, 6-184, 7-225, 8-228, 9-245; బౌలింగ్‌: రబాడ 20-3-77-3, ఒలివియెర్‌ 12-1-51-1, ఎన్‌గిడి 10.1-2-43-3, జాన్సెన్‌ 17-4-67-3, కేశవ్‌ మహరాజ్‌ 1-0-8-0.


దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (ఎల్బీ) శార్దూల్‌ 31, డీన్‌ ఎల్గర్‌ (బ్యాటింగ్‌) 46,  పీటర్సన్‌ (ఎల్బీ) అశ్విన్‌ 28, డుస్సెన్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 40 ఓవర్లలో 118/2; వికెట్ల పతనం: 1-47, 2-93; బౌలింగ్‌: బుమ్రా 10-1-42-0, షమి 9-2-22-0, శార్దూల్‌ 9-1-24-1, సిరాజ్‌ 4-0-14-0, అశ్విన్‌ 8-1-14-1. 

Updated Date - 2022-01-06T06:22:41+05:30 IST