శివాలెత్తిన శార్దూల్

ABN , First Publish Date - 2022-01-05T08:46:23+05:30 IST

భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (7/61) కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో

శివాలెత్తిన శార్దూల్

భారత బ్యాటర్స్‌ విఫలమై నిరాశపరిచినా.. పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అదిరిపోయే బౌలింగ్‌ ప్రదర్శనతో జట్టుకు ఊపిరిలూదాడు. తొలి టెస్టులో ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయినా.. ఈ మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా చెలరేగాడు. అవుట్‌ స్వింగ్‌, ఆఫ్‌ కట్టర్లతో విరుచుకుపడి కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా ఆ జట్టు స్వల్ప ఆధిక్యానికే  పరిమితమైంది. ఆ తర్వాత భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించడంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే ప్రయత్నంలో ఉంది.


ఏడు వికెట్లతో అదుర్స్‌

దక్షిణాఫ్రికా 229

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 85/2

ప్రస్తుత ఆధిక్యం 58


దక్షిణాఫ్రికాలో అత్యుత్తమ గణాంకాలు (7/61) నమోదు చేసిన భారత బౌలర్‌గా శార్దూల్‌. అలాగే సఫారీ జట్టుపై ఏ వేదికపై అయినా భారత్‌ నుంచి ఇదే ఉత్తమ ప్రదర్శన. ఈ క్రమంలో అశ్విన్‌ (7/66 నాగ్‌పూర్‌లో)ను శార్దూల్‌ అధిగమించాడు. అంతేకాకుండా వాండరర్స్‌ మైదానంలోనూ ఉత్తమ బౌలింగ్‌తో మాథ్యూ హోగర్డ్‌ (7/61) సరసన నిలిచాడు.


జొహాన్నె్‌సబర్గ్‌: భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (7/61) కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఆతిథ్య జట్టు వణికిపోయింది. దీంతో భారీ స్కోరు ఖాయమనుకున్న దశ నుంచి ఆ జట్టు కేవలం 27 పరుగుల ఆధిక్యానికే పరిమితమైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పుజార (35 బ్యాటింగ్‌),రహానె (11 బ్యాటింగ్‌) ఉండగా ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు పీటర్సన్‌ (62), బవుమా (51) అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. షమికి రెండు వికెట్లు దక్కాయి.


దీటుగా ఆరంభమైనా..: 35/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఉదయంసెషన్‌లో తొలి గంటపాటు నిలకడగా బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ ఎల్గర్‌, పీటర్సన్‌ జోడీ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయారు. వీరిద్దరు దాదాపు 20 ఓవర్లపాటు బౌలర్లను విసిగించారు. ఈక్రమంలో పీటర్సన్‌ కెరీర్‌లో తొలి అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు. తొమ్మిది ఫోర్లతో టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. మరోవైపు ఎల్గర్‌ పెద్దగా పరుగులు చేయకపోయినా వికెట్‌ కాపాడుకుంటూ సహచరుడికి మద్దతుగా నిలిచాడు. షమి, బుమ్రా, సిరాజ్‌ బంతులు ఈ జోడీని ఇబ్బందిపెట్టలేకపోయాయి. అయితే 36 ఓవర్లు ముగిశాక శార్దూల్‌ బరిలోకి దిగడంతో సీన్‌ పూర్తిగా మారిపోయింది. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని చావుదెబ్బ తీశాడు. తన రెండో ఓవర్‌లోనే ఎల్గర్‌ను అవుట్‌ చేసిన అతడు ఆ తర్వాత ప్రమాదకరంగా మారిన పీటర్సన్‌ పనిబట్టాడు. దీంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక లంచ్‌ బ్రేక్‌ చివరి ఓవర్‌లో డుస్సెన్‌ (1)ను పెవిలియన్‌కు చేర్చాడంతో సఫారీ జట్టు 102/4 స్కోరుతో ఇబ్బందిపడింది. అయితే పంత్‌ అందుకున్న ఈ క్యాచ్‌ వివాదాస్పదంగా మారింది. రీప్లేలో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి నేలకు తాకి పంత్‌ చేతుల్లోకి వెళ్లినట్టు కనిపించింది. 


ఐదు వికెట్లతో శార్దూల్‌ జోరు: రెండో సెషన్‌లోనూ శార్దూల్‌ ఆతిథ్య జట్టును ఇబ్బంది పెట్టి మరో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో కెరీర్‌లో తొలిసారి ఇన్నింగ్స్‌ ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా, సిరాజ్‌లకు ఈ రెండు సెషన్లలో వికెట్‌ లభించలేదు. ఆరంభంలో బవుమా, వెర్రెన్‌ (21) జోడీ మాత్రం జట్టును ఆదుకునే ప్రయత్నంలో ఐదో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. అవుట్‌ స్వింగర్లతో పాటు ఆఫ్‌ కట్టర్లతో దాడికి దిగిన శార్దూల్‌ ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో అవుట్‌ చేసి భారత్‌కు రిలీ్‌ఫనిచ్చాడు. ఆ వెంటనే రబాడ (0)ను షమి పెవిలియన్‌కు చేర్చగా 179/7తో జట్టు దయనీయంగా కనిపించింది. కానీ ఈ సమయంలో జాన్సెన్‌ (21), కేశవ్‌ (21) భారత్‌ దూకుడును నిలువరించారు. ఓపిగ్గా ఆడిన జోడీ ఎనిమిదో వికెట్‌కు విలువైన 38 పరుగులు జోడించడంతో జట్టు ఇన్నింగ్స్‌ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే 76వ ఓవర్‌లో కేశవ్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో మిగిలిన వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. చివర్లో శార్దూల్‌ ఒకే ఓవర్‌లో జాన్సెన్‌, ఎన్‌గిడి (0)లను అవుట్‌ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్‌ ముగిసింది. 


పుజార దూకుడు: రెండో ఇన్నింగ్స్‌ను భారత్‌ వేగంగా ఆరంభించింది. కెప్టెన్‌ రాహుల్‌ (8) ఏడో ఓవర్‌లోనే వెనుదిరిగినా మయాంక్‌ (23) ధాటిగా ఆడాడు. అయితే ఒలివియెర్‌ చేతిలో ఎల్బీగా వెనుదిరగడంతో 44 రన్స్‌కు భారత్‌ 2 వికెట్లు కోల్పోయింది. అయితే పుజార సహజశైలికి భిన్నంగా బ్యాట్‌ ఝుళిపించడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 18, 20వ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది ఒత్తిడి పెంచాడు. అటు రహానె కూడా వికెట్‌ కాపాడుకుంటూ సహకరించాడు. ఫామ్‌ కోల్పోయిన వేళ ఈ వెటరన్స్‌ తమ స్థాయిని నిరూపించుకుంటూ మూడో రోజు కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సిన బాధ్యత ఉంది.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 202

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 28; మార్‌క్రమ్‌ (ఎల్బీ) షమి 7; పీటర్సన్‌ (సి) మయాంక్‌ (బి) శార్దూల్‌ 62; వాన్‌డర్‌ డుస్సెన్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 1; బవుమా (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 51; వెర్రెన్‌ (ఎల్బీ) శార్దూల్‌ 21; జాన్సెన్‌ (సి) అశ్విన్‌ (బి) శార్దూల్‌ 21; రబాడ (సి) సిరాజ్‌ (బి) షమి 0; కేశవ్‌ (బి) బుమ్రా 21; ఒలివియెర్‌ (నాటౌట్‌) 1; ఎన్‌గిడి (సి) పంత్‌ (బి) శార్దూల్‌0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం: 79.4 ఓవర్లలో 229 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-14, 2-88, 3-101, 4-102, 5-162, 6-177, 7-179, 8-217, 9-228, 10-229. బౌలింగ్‌: బుమ్రా 21-5-49-1; షమి 21-5-52-2; సిరాజ్‌ 9.5-2-24-0; శార్దూల్‌ 17.5-3-61-7; అశ్విన్‌ 10-1-35-0.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సెన్‌ 8; మయాంక్‌ (ఎల్బీ) ఒలివియెర్‌ 23; పుజార (బ్యాటింగ్‌) 35; రహానె (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 85/2. వికెట్ల పతనం: 1-24, 2-44. బౌలింగ్‌: రబాడ 6-1-26-0; ఒలివియెర్‌ 4-0-22-1; ఎన్‌గిడి 3-1-5-0; జాన్సెన్‌ 6-2-18-1; కేశవ్‌ 1-0-8-0.

Updated Date - 2022-01-05T08:46:23+05:30 IST