3 దశాబ్దాల ఆస్తి వివాదానికి తెర

ABN , First Publish Date - 2022-06-27T09:25:46+05:30 IST

మూడు దశాబ్దాలుగా ఎన్నో మలుపులు తిరుగుతూ..

3 దశాబ్దాల ఆస్తి వివాదానికి తెర

జాతీయ లోక్‌ అదాలత్‌లో దక్కిన పరిష్కారం

ఒకేరోజు 7.5 లక్షల కేసుల్లో కుదిరిన రాజీ


ఖమ్మం లీగల్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులు, హైదరాబాద్‌, జూన్‌ 26: మూడు దశాబ్దాలుగా ఎన్నో మలుపులు తిరుగుతూ.. సా....గుతూ వస్తున్న ఓ కుటుంబ ఆస్తి వివాదానికి తెరపడింది. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించింది. ఖమ్మం అర్బన్‌ మండలం వి.వెంకటాయపాలేనికి చెందిన కుతుంబాక కుటుంబంలో ఆరుగురు సభ్యులు. వారిలో కుతుంబాక చిద్విలాసరావు మరణం తర్వాత.. ఉమ్మడి కుటుంబానికి ఉన్న 14 ఎకరాల ఆస్తి పంపకంపై వివాదం తలెత్తింది. చిద్విలాసరావు కుమారుడు.. తనకు 14వ ఏట.. అంటే 1993లో ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దావా వేశారు. అప్పటి నుంచి ఈ కేసు మలుపులు తిరుగుతూ వస్తోంది. ప్రతివాదుల్లో ముగ్గురు మరణించగా.. వారి వారసులను కేసులో చేర్చారు. ఈ క్రమంలో ప్రతీ కోర్టులో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని కేసుల్లో కనీసం ఐదు కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలని జాతీయ లోక్‌అదాలత్‌లో నిర్ణయించారు. అందులో భాగంగానే కుతుంబాక కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి మహ్మద్‌ అబ్దుల్‌ జావీద్‌పాషా సూచనల మేరకు.. సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.శ్రీనివాస్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. కేసులో ఉన్న 21 మంది కక్షిదారులను పిలిపించి మాట్లాడగా.. వారు రాజీకి అంగీకరించారు. దీంతో.. ఫిర్యాదికి 2.14 ఎకరాల భూమిని కేటాయిస్తూ న్యాయమూర్తి లోక్‌అదాలత్‌ అవార్డును జారీచేశారు. 


ఒక్కటైన కుటుంబాలు

విడిపోయి.. వివాదాల్లో చిక్కుకున్న కుటుంబాలు జాతీయ లోక్‌ అదాలత్‌ చొరవతో, రాజీ కుదుర్చుకుని ఒక్కటయ్యాయి. సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో జిల్లా అదనపు న్యాయమూర్తి జీవన్‌కుమార్‌ విడిపోయిన ఓ జంటను కలిపారు. వారి దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య కుటుంబ వివాదం కూడా పరిష్కృతమైంది. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మురళీ మోహన్‌ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. అంతేకాదు..దత్త కుమారుడికి, కోడలికి.. వారి పిల్లలకు కూడా తల్లిదండ్రులు ప్రేమాభిమానాలతో కొంత ఆస్తి,డబ్బు అందజేశారు. వారంతా న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో ఒక్కటయ్యారు. మరోవైపు.. చీఫ్‌జడ్జి సమక్షంలో ఖలీల్‌ అనే వ్యక్తిపై ఎస్‌బీఐ దాఖలు చేసిన రుణ ఎగవేత కేసులో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకున్నాయి. తన తల్లి చేసిన బ్యాంకు అప్పును, ఆమె మరణానంతరం కుమారుడు చెల్లించడానికి ముందుకు రాగా, బ్యాంకు కొంత అప్పును మినహాయించింది.  


7.5 లక్షల కేసుల పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో ఆదివారం 7.5 లక్షల కేసులను పరిష్కరించినట్లు తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ మార్గదర్శకంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా కోర్టుల పరిధిలో చేపట్టిన లోక్‌ అదాలత్‌లలో భాగంగా బాధితులకు రూ.109.45 కోట్లు పరిహారం అందేలా కేసులను పరిష్కరించారన్నారు.

Updated Date - 2022-06-27T09:25:46+05:30 IST