సన్నద్ధమయ్యాకే బడులు తెరవాలి!

ABN , First Publish Date - 2020-09-04T06:33:23+05:30 IST

కొవిడ్–-19 మహమ్మారి విలయం జాతినిర్మాణాన్ని ప్రభావితం చేసే విద్యావ్యవస్థనూ అతలాకుతలం చేస్తోంది. అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ విద్యాసంవత్సరం దేశంలో 32.5కోట్ల విద్యార్థుల...

సన్నద్ధమయ్యాకే బడులు తెరవాలి!

ఈ పరిస్థితుల్లో, పాఠశాలలు ఎలాగైనా తెరవాలి అనుకుంటే పిల్లల ఆరోగ్యానికి భద్రత కల్పించాల్సిందే. అవి తెరిచేనాటికే కావాల్సిన ఏర్పాట్లను శరవేగంగా సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 62,277 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది 72,30,293 మంది చదువుతారని అంచనా. ఇంతమంది విద్యార్థులకు కొవిడ్–-19 ప్రమాదం లేకుండా ప్రభుత్వం పాఠశాలల్లో కట్టుదిట్టమైన ప్రణాళికను అమలు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహణలో ఒక ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేస్తూ, నిరంతరం పర్యవేక్షించాలి.


కొవిడ్–-19 మహమ్మారి విలయం జాతినిర్మాణాన్ని ప్రభావితం చేసే విద్యావ్యవస్థనూ అతలాకుతలం చేస్తోంది. అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ విద్యాసంవత్సరం దేశంలో 32.5కోట్ల విద్యార్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేయనుంది. అనేక ఆలోచనలు చేసిన కేంద్రప్రభుత్వం కూడా విద్యాసంవత్సరం మీద ఇంకా స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తలో ఆలోచనలతో ముందుకెళ్తున్నాయి. కొవిడ్-–19 అదుపులోకి వచ్చేంతవరకూ పాఠశాలలు తెరిచే ప్రసక్తే లేదని దిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ స్పష్టం చేశారు. మొదటి గంట పేరుతో కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్ బోధన మొదలు పెట్టింది. కర్ణాటక శూన్య విద్యాసంవత్సరాన్ని ప్రకటించినప్పటికీ, ప్రయివేటు స్కూళ్లు, కళాశాలల విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్ క్లాసులు యథావిధిగా జరిగిపోతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం దీనిమీద ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రం దేశమంతటా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఆర్.డి) మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ ఐదు నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కళాశాలలు కూడా అక్టోబర్ 15నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం, విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. 


మారుమూల ప్రాంతాల్లో కూడా కొవిడ్–-19 విలయతాండం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో విద్యాలయాలు నిర్వహించడం కత్తిమీద సామే. దీనిపై ఎం.హెచ్.ఆర్.డి ఒకానొక దశలో ఈ ఏడాదిని శూన్య విద్యా సంవత్సరం చేయాలని యోచించింది. కేజీ నుంచి పీజీ వరకు ఒక ఏడాది రద్దు అంటే భవిష్యత్తులో దాని ప్రభావం చాలా రంగాలపై పడుతుంది. పైచదువులు, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లేవారికి ఇదో అవరోధం అవుతుంది. మరో కోణంలో చూస్తే.. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు ఉపాధి లేక ఇబ్బందులకి గురౌతున్నారు. బ్రతుకుతెరువు కోసం బోధకులు కూరగాయలు, అరటి పళ్ళు అమ్ముకోవడం, కూలిపనులకి వెళ్లడం వంటి సంఘటనలను చూస్తున్నాం. కొవిడ్–౧9 పుట్టిన చైనాతో సహా ప్రపంచంలోని ఏ దేశంలోనూ విద్యాసంస్థలు మూయలేదు. కాకపోతే ఆ దేశాలకున్న సాంకేతిక సంపద, వనరులు, సామాజిక పరిస్థితులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధితో పోలిస్తే మన దేశం భిన్నం. మరో పదేళ్లవరకు కరోనా ప్రభావం సమాజం మీద ఉంటుందని, ఎవరికి వాళ్ళు అప్రమత్తం కావటమే ఆయుధమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఇటీవల తెగేసి చెప్పేశారు. భారత బయో టెక్నాలజి సంస్థ ప్రజల ముంగిటకు వేక్సిన్ రావాలంటే కనీసం 15నెలలు పడుతుందని భారత వైద్య పరిశోధనా సంస్థ (ఐ.సి.ఎం.ఆర్)కి స్పష్టంచేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అనేక అంతర్మథనాలు చేసిన ఎం.హెచ్.ఆర్.డి కొవిడ్–19తో సహజీవనం కొన్నాళ్ళు తప్పదనే నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవచ్చునని రాష్ట్రాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు మార్గదర్శకాలను సూచిస్తూ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. 


మన రాష్ట్రంలో సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మారుమూల పల్లెల్లో సైతం కరోనా వైరస్ కుదిపేస్తున్న ఈ తరుణంలో విద్యాసంస్థలు ప్రారంభం కావటం పెద్ద సవాలే. ప్లస్ టూ, కళాశాల విద్యార్థులైతే అవగాహనతో మసలుకుంటారు. పాఠశాల్లో చదివే చిన్నపిల్లలకి ఇప్పుడు బడులు తెరవడం ఇబ్బందే. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఒకటి, రెండు, మూడు తరగతుల పిల్లలు బడికి వస్తే వారి చేత భౌతిక దూరాన్ని పాటింపజేయటం చాలా కష్టమైన పని. అమెరికాలో పాఠశాలలు తెరచిన రెండు వారాల్లో 97వేలమంది చిన్నారులు కరోనా వైరస్ బారినపడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఇటీవలే తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఎంతో పకడ్బందీగా ఒక్క వారం రోజుల పాటు పదవ తరగతి పరీక్షలు నిర్వహించింది. ఐనా 38 మంది కొవిడ్–-19 బారినపడ్డారు. ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబర్ 5, కళాశాలలకు అక్టోబర్ 15 తేదీలను ప్రారంభ తేదీలుగా ప్రకటించింది. అలాకాకుండా పెద్దపిల్లలుండే కళాశాలలు ముందు,చిన్నారులుండే పాఠశాలలు తరువాత తెరిస్తే బాగుంటుందనేది కొందరి విద్యావేత్తలు మనోగతం. విద్యా సంవత్సరాన్ని పరిరక్షించాలని, సరైన జాగ్రత్తలతో పిల్లలకి విద్యాప్రమాణాలు అందాలని యుటిఎఫ్ లాంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేరళ తరహాలో విద్యార్థులకు ప్రత్యేక టీవీ ఛానెల్ ఏర్పాటు చేయాలని, ఆన్‌లైన్ పాఠాల కోసం పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వాలని కోరుతోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని పాఠశాలలకు పంపడానికి చాలామంది తల్లిదండ్రులు నిరాసక్తత చూపిస్తున్నారు. 


ఈ పరిస్థితుల్లో, పాఠశాలలు ఎలాగైనా తెరవాలి అనుకుంటే పిల్లల ఆరోగ్యానికి భద్రత కల్పించాల్సిందే. అవి తెరిచేనాటికే కావాల్సిన ఏర్పాట్లను శరవేగంగా సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 62,277 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది 72,30,293 మంది చదువుతారని అంచనా. ఇంతమంది విద్యార్థులకు కొవిడ్–-19 ప్రమాదం లేకుండా ప్రభుత్వం పాఠశాలల్లో కట్టుదిట్టమైన ప్రణాళికను అమలు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహణలో ఒక ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేస్తూ, నిరంతరం పర్యవేక్షించాలి.ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రణాళికాబద్ధ బోధన జరగాలి. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత, పౌష్ఠికాహారం, వ్యాయామం, క్రీడలు, భౌతిక దూరం పాటించడం వంటి వాటికి మెండు ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలు ప్రారంభించే ముందే తరగతి గదులన్నీ రసాయనిక ప్రక్రియల ద్వారా శుద్ధిచేయాలి. విద్యాకేంద్రాలకి సరిపడినంత శానిటైజేషన్ సామగ్రి అనగా- సబ్బులు, మాస్కులు, శానిటైజర్లు కావాల్సిన మోతాదులో సమకూర్చాలి. ప్రతీ పాఠశాలలోనూ రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేటట్టు చూడాలి. వాష్ రూంలు తగినన్ని అందుబాటులో ఉండాలి. విద్యార్థులు పాఠశాలల్లో భౌతిక దూరం పాటించేందుకు అవసరమైతే ఉదయం పూట కొన్ని తరగతులు, మధ్యాహ్నం పూట కొన్ని తరగతులతో షిప్ట్ పద్ధతిలో నడపాలి. ఒక షిప్ట్ ముగిసిన వెంటనే తరగతి గదులను శానిటైజ్ చేయాలి. రద్దీ నివారించేందుకు మధ్యాహ్న భోజన పథకం మానేసి, విద్యార్థుల ఇళ్లకు డ్రైరేషన్ అందించాలి. విద్యార్థులకు విటమిన్ బిస్కట్లు అందించాలి. ఈ విద్యా సంవత్సరంలో 220కిగాను ఇప్పటికే కోవిడ్ కారణంగా 60 పని దినాలు కోల్పోయాము. ఇక 160 రోజులతో విద్యా సంవత్సరాన్ని నడపాలి. అందుకోసం సిలబస్ బాగా కుదించాలి. ఈ విద్యా సంవత్సరం 25-30శాతం సిలబస్ తగ్గిస్తూ విద్యాశాఖ ఇప్పటికే సమయాత్తమైంది. విధిగా పాఠశాలల చుట్టూ తరచూ క్లోరిన్ పౌడర్ చల్లాలి. తక్కువ సమయాల్లో బోధన ఆహ్లాదంగా ఉండేటట్టు చూడాలి. సాధ్యమైనంత వరకు ఆరు బయట గాలి తగిలే వాతావరణంలో తరగతులు నిర్వహించాలి.


స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా పాఠశాలలు నిర్వహించుకొనేందుకు ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఇవ్వాలి. అవసరమైతే త్వరితగతిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు స్కూలుకు వచ్చేటప్పుడు, ఇళ్లకు వెళ్లేటప్పుడు కచ్చితంగా టెంపరేచర్ పరీక్షించాలి. పాఠశాలల్లో టెంపరేచర్ మిషన్, ఆక్సిమీటర్, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ప్రతీ స్కూలుకూ వైద్య సిబ్బంది, అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచాలి. ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులతో ఫోన్లలో అందుబాటులో ఉండాలి. విద్యార్థులు పరీక్షలు మరీ కట్టుదిట్టంగా కాక కాస్త ఫ్లెక్సిబుల్‌గా నిర్వహించాలి. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తరచూ కరోనా గురించి కౌన్సెలింగ్ ఇస్తూ అప్రమత్తం చేయాలి. పాఠశాలల్లో శానిటేషన్ కమిటీలను ఏర్పాటు చెయాలి. సానిటరీ నేప్కిన్లు పారవేయడానికి ప్రత్యేక డస్ట్ బిన్స్ అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు పాఠశాల్లో డస్ట్ బిన్లు శుభ్రంచేయాలి. ఈఏడాది విద్యార్థులకు యూనిఫామ్ దుస్తుల నుంచి వెసులుబాటు కలిపించాలి. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే పాఠశాలలు కరోనా రహితంగా ఉండి ఆరోగ్య విద్యాలయాలుగా వర్ధిల్లుతాయి.

చిలుకూరి శ్రీనివాసరావు

పాఠ్యపుస్తక రచయిత

Updated Date - 2020-09-04T06:33:23+05:30 IST