అభివృద్ధి జరిగినా, అంటరానితనమే!

ABN , First Publish Date - 2022-07-31T08:07:39+05:30 IST

స్వాతంత్ర్యం సంపాదించుకొని 75 వసంతాలు అవుతున్నది. అమృతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం.

అభివృద్ధి జరిగినా, అంటరానితనమే!

స్వాతంత్ర్యం సంపాదించుకొని 75 వసంతాలు అవుతున్నది. అమృతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు అటు జాతీయస్థాయిలో, ఇటు రాష్ట్రాల స్థాయిలో దళిత కులాల అభివృద్ధి కోసం, విద్యా ఉద్యోగరంగాలలోనే కాకుండా, బహుముఖాల అభివృద్ధి కోసం ఎన్నో పథక రచనలు చేశాయి, అమలు చేశాయి. అంబేడ్కర్ దూరదృష్టితో చేసిన సమరం కారణంగా షెడ్యూలు కులాలకు విద్యా ఉద్యోగాలలో, వివిధ జీవన రంగాలలో రిజర్వేషన్ లభించింది. రాజకీయ అధికారం కోసం చట్టసభలలో వారి ప్రాతినిధ్యం ఉండేలాగా పార్లమెంటులోను, శాసనసభలలోను నియోజకవర్గాలు రిజర్వు అయినాయి. ఫలితంగా దళిత కులాల వారికి, కనీసం వారిలో ప్రముఖమైన కులాల వారికి విద్యా ఉద్యోగాలలో మంచి అవకాశాలు లభించాయి. విద్యావంతుల సంఖ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఈ 75 సంవత్సరాలలో బాగా పెరిగింది. అభివృద్ధి జరిగింది, సామాజిక పరిణామమూ జరిగింది.


నేను రెండు సంవత్సరాల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు వారి దళిత్‌ అండ్‌ ఆదివాసీ స్టడీస్ కోసం ‘The Madigas of Telangana, A Study of Socio-Cultural Transformation’ అంశంపై ఓ పరిశోధన చేశాను. నాతో ఐదుగురు పరిశోధన సహాయకులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పది పాతజిల్లాలలో, ఒక్కో జిల్లానుంచి పది పన్నెండు గ్రామాలను తీసుకొని, అక్కడి మాదిగ గూడేలలో పరిస్థితులను అధ్యయనం చేశాం. గమనించిన దాని ప్రకారం, నేడు దళిత కులాలలో ప్రధాన సమస్య నిరుద్యోగం. డిగ్రీ చదువుకున్న వారు కూడా కూలి పనులకు పోయే స్థితి. కానీ, దళితుల దైనందిన జీవనస్థితి బాగా మెరుగైంది. ప్రతి గూడేం ఓ కాలనీగా సిమెంటు రోడ్లు, పక్కా ఇండ్లు, విద్యుత్‌ సౌకర్యం, నీటి సౌకర్యం వచ్చాయి. దైనందిన జీవనంలో ప్రమాణాలు బాగా పెరిగాయి. 50 ఏండ్ల నాటి మాదిగ గూడేలు, మాలపల్లెలలతో పోలిస్తే నేటి కాలనీలలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అంతేకాదు, దళితుల సామాజిక జీవనంలో, గ్రామ జీవితంలో కూడా మంచి పరిణామాలు వచ్చాయి. గ్రామాలలోని ఆయా కులాలకు, గూడేలలోని దళితులకు మధ్య సంబంధాలు పెరిగాయి. గూడెంలో పెళ్ళి జరిగితే ఊరి వారికి శుభలేఖలు ఇచ్చి పెండ్లిండ్లకు పిలవడాలు, వూరిలో పెండ్లి జరిగితే దళిత కులాలవారిని పిలవడం, అక్కడా ఇక్కడా సహపంక్తి భోజనాలు జరుగుతున్నాయి. దళితకులాలలో పెండ్లి జరిగితే బ్రాహ్మణ పూజారి వెళ్ళి పెండ్లిళ్ళు చేసి అక్కడ ప్రసాదం ఆరగిస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అటు గూడేలలోని వారు, ఇటు గ్రామాలలోని వారు మాకు చెప్పారు. ఈ పరిణామాలు మేలి మలుపేనని ఒప్పుకోవాలి. అయితే అంటరానితనం అవశేషాలు అక్కడక్కడ కనిపించినందున అది పూర్తిగా పోయిందని చెప్పలేం. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో బాగా వెనుకబడిన గూడేలున్నాయి. అక్కడ జోగిని అవశేషాలు కనిపించాయి. కాని మొత్తంమీద జరిగిన సామాజిక వికాసం తక్కువ కాదు. వార్తలలో, మాధ్యమాలలో ఈ మంచి పరిణామాలు, అభివృద్ధి కనిపించవు, వినిపించవు. ఎప్పుడైనా దళితులపై జరిగిన దాష్టీకాలే ముందుకు వస్తాయి. అభివృద్ధి గణనీయంగానే ఉన్నందున, భవిష్యత్ పథకాల రచన గురించి, ఇతర పరిణామాల గురించి ఇప్పుడు విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. 


ఈ 75 ఏండ్లలో జరిగిన దళిత అభివృద్ధి Inclusive గా ఉందా Exclusiveగా ఉందా ఆలోచించాలి. ఉమ్మడి రాష్ట్రంలో స్వాతంత్ర్యానంతరం పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీకళాశాల విద్యార్థుల కోసం వందల హాస్టళ్ళు కట్టారు. ఈ హాస్టళ్ళు ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు వేరువేరుగా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఎన్టీరామారావు ప్రారంభించిన గురుకుల పాఠశాలలు నేటికీ విజయవంతంగా నడుస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఒక్క తెలంగాణలోనే 981 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు ఇదే సంఖ్యలో ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలలు తర్వాత జూనియర్ కళాశాల స్థాయికి పెరిగాయి. కానీ ఇవి కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకుల పాఠశాలలుగానే ఉన్నాయి. అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే గురుకుల పాఠశాలగా ఇవి రూపొందలేదు. 


ఇలా హాస్టళ్ళు, పాఠశాలలు, కళాశాలలు వేర్వేరుగా ఉండటం వల్ల సామాజిక సమానత్వం ఏ విధంగా సాధ్యపడుతుంది? ఎస్సీ హాస్టల్ గురించో, ఎస్సీ గురుకులం గురించో ఎవరు ఆలోచించినా, మాట్లాడినా మాదిగ, మాల లేదా మరో దళిత కులం అని గుర్తుకువచ్చే పరిస్థితి. ఇది మాదిగలను మాలలను ప్రధాన సమాజంలో కలిపేలాగా ఉందా లేక వారిని ఇంకా వేరుగానే ఉంచి దళిత ముద్ర కొనసాగించేలాగా ఉందా? నాకు గుర్తున్నంత వరకు, ఐదుదశాబ్దాల క్రితం మొదటి ఎస్సీ కాలనీ ఖమ్మం జిల్లా మీనవోలు గ్రామంలో ఏర్పడింది. పంచరత్న పురి అని పేరు పెట్టి దానిని ఊరికి దూరంగా కట్టారు. నాటి నుండి నేటి వరకూ మాల, మాదిగ వంటి కులాలవారికి కట్టే ఇండ్లు అన్నీ వూరికి దూరంగా ప్రత్యేక కాలనీలుగానే కడుతున్నారు. పేదలకు గృహనిర్మాణాలు చేపట్టేటప్పుడు దళితులు అందరితో కలిసిపోయే రీతిలో పాలకులు పథకరచన చేయడంలేదు. మళ్ళీ సరికొత్త మాదిగ గూడేలు, మాల పల్లెలు సృష్టిస్తున్నారు తప్ప, వారు గ్రామంతో కలిసిపోయి, అన్ని కులాలతో సమానమైన సామాజిక స్థాయి తెచ్చే ప్రయత్నం చేయడంలేదు. గృహనిర్మాణాలు చూసినా, హాస్టళ్ళు, పాఠశాలలు, కళాశాలలు చూసినా ఇదే అర్థమవుతున్నది. ఈ పథకాలు దళితులు శాశ్వతంగా ఊరికీ, ఇతర కులాలకు దూరంగా ఉండే స్థితిని కొనసాగిస్తాయి తప్ప, వారిని మిగతావారితో కలిపేలాగా చేసి వివక్షను శాశ్వతంగా నిర్మూలించే రీతిలో లేవు. ప్రస్తుత అభివృద్ధి విధానం దళితులను ఇంకా దూరంపెట్టేదిగానే ఉండటం సరికాదు. చట్టబద్ధమైన రిజర్వేషన్ కొనసాగిస్తూనే, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ళు అన్నింటిలో అందరికీ ప్రవేశం కల్పించి అందరూ సమానమే అనే భావన పాదుకొలిపేలా చేయవలసిన పథకాలు దళిత కులాలను సమాజంనుండి వేరుచేసేవిగా తయారయ్యాయి. ఈ విధానం, ఆ ఆలోచనాధోరణి కచ్చితంగా మారాలి.


ఎన్నికల ప్రక్రియ అత్యంత ఖరీదైనదిగా తయారైన నేపథ్యంలో, దళిత కులాలవారు రాష్ట్రస్థాయిలో కానీ, దేశస్థాయిలో కానీ తమకంటూ ఓ పార్టీ పెట్టుకొని గెలిచి రాజ్యాధికారాన్ని సాధించగలిగే పరిస్థితి లేదు. దళితులు ఆధిపత్యకులాల వారి పార్టీలలోనే చేరవలసిన పరిస్థితి ఉంది. ఈ కారణంగానే, ప్రతి పార్టీలో ఎస్సీ సెల్‌లు ఏర్పడ్డాయి. ఒక పార్టీ పాలనలో దళితులకు అన్యాయం జరిగినా, ఓ దాష్టీకం జరిగినా అ ప్రభుత్వంలోని దళిత నాయకులు ఖండించలేని, విమర్శించలేని స్థితి. అంబేద్కర్ ఆశించిన దళిత రాజ్యాధికారం నేటికీ ప్రశ్నార్థకమే. 


స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంలో, ఒకసారి వెనక్కు తిరిగి చూస్తే దళితుల అభివృద్ధికోసం ఉద్దేశించిన పథకాలు వారిని సమాజంలో కలుపుకొనిపోయి దళిత సమస్యను అంతం చేసే దిశగా కాక, వారిని ప్రతీ దశలోనూ, ప్రతీ చోటా వేరుపెడుతూ ఇంకా దశాబ్దాల పాటు వివక్షను కొనసాగించేలాగా ఉన్నాయి. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ భవిష్యత్తులో ప్రభుత్వాలు రచించే పథకాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే సమసమాజాన్ని సాధించే దిశగా అడుగుపడుతుంది.


ప్రొ. పులికొండ సుబ్బాచారి

Updated Date - 2022-07-31T08:07:39+05:30 IST