సౌదీలో 17 ఏళ్ల యువ‌తుల‌కు డ్రైవింగ్ ప‌ర్మిట్స్‌!

ABN , First Publish Date - 2021-06-02T18:21:42+05:30 IST

2017 సెప్టెంబ‌ర్‌లో మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ చేసే వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చిన సౌదీ అరేబియా.. ఇప్పుడు 17 ఏళ్లు నిండిన‌ యువ‌తుల‌కు కూడా డ్రైవింగ్ ప‌ర్మిట్‌ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

సౌదీలో 17 ఏళ్ల యువ‌తుల‌కు డ్రైవింగ్ ప‌ర్మిట్స్‌!

రియాద్: 2017 సెప్టెంబ‌ర్‌లో మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ చేసే వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చిన సౌదీ అరేబియా.. ఇప్పుడు 17 ఏళ్లు నిండిన‌ యువ‌తుల‌కు కూడా డ్రైవింగ్ ప‌ర్మిట్‌ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 17 ఏళ్లు నిండిన‌ యువ‌తులు డ్రైవింగ్ ప‌ర్మిట్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఈ తాత్కాలిక డ్రైవింగ్ ప‌ర్మిట్ కోసం ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో యువ‌తుల‌కు మెడిక‌ల్‌ చెక‌ప్ ఉంటుంద‌ని పేర్కొంది. డ్రైవింగ్ స్కూళ్ల‌లో ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపింది. ఏడాది పాటు ఈ డ్రైవింగ్ ప‌ర్మిట్ చెల్లుబాటు అవుతుంద‌ని, 18 ఏళ్లు నిండిన త‌ర్వాత ఈ డ్రైవింగ్ ప‌ర్మిట్‌నే డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవ‌చ్చ‌ని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్ప‌ష్టం చేసింది. అయితే, డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం ద‌రఖాస్తు చేసుకునే యువ‌తుల‌కు కొన్ని ప్ర‌త్యేక ష‌ర‌తులు విధించింది. 

1. ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యానికి నిబంధ‌న‌ల మేర‌కు ఆయా యువ‌తుల‌పై డ్ర‌గ్స్‌కు సంబంధించి ఎలాంటి కేసులు ఉండ‌కూడ‌దు.

2. డ్రైవింగ్‌కు ఇబ్బంది క‌లిగించే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌రాదు.

3. ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి జ‌రిమానాలు ఉంటే.. వాటిని క్లియ‌ర్ చేసుకోవాలి.

4. ద‌ర‌ఖాస్తుదారులు సౌదీయేత‌రులు అయితే రెసిడెన్సీ ప‌ర్మిట్ త‌ప్ప‌నిస‌రి.

5. డ్రైవింగ్ స్కూళ్ల‌లో నిర్వ‌హించే థియేరిటిక‌ల్ టెస్టు పాస్ కావాలి.            


Updated Date - 2021-06-02T18:21:42+05:30 IST