సౌదీలో బాలుడ్ని బ‌లిగొన్న‌ 'స్వాబ్‌ స్టిక్'..!

ABN , First Publish Date - 2020-07-15T16:11:04+05:30 IST

కోవిడ్ టెస్టు బాలుడి ప్రాణాలు తీసింది. క‌రోనా ప‌రీక్ష స‌మ‌యంలో బాలుడి ముక్క‌లో వేసిన స్వాబ్ స్టిక్ లోప‌లే విరిగిపోయింది.

సౌదీలో బాలుడ్ని బ‌లిగొన్న‌ 'స్వాబ్‌ స్టిక్'..!

రియాద్: కోవిడ్ టెస్టు బాలుడి ప్రాణాలు తీసింది. క‌రోనా ప‌రీక్ష స‌మ‌యంలో బాలుడి ముక్క‌లో వేసిన స్వాబ్ స్టిక్ లోప‌లే విరిగిపోయింది. దీంతో ముక్కుకు స‌ర్జరీ చేసిన వైద్యుల చిన్న పొర‌పాటు వ‌ల్ల‌ బాలుడికి ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘ‌ట‌న గ‌త శుక్ర‌వారం సౌదీ అరేబియాలోని షక్రా జనరల్ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే... అబ్దుల్ అజీజ్ అల్ గుఫాన్ అనే 18 నెల‌ల బాలుడికి జ్వ‌రం రావ‌డంతో త‌ల్లిదండ్రులు షక్రా జనరల్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ఒక్క శ‌రీర ఉష్ణోగ్ర‌త అధికంగా ఉండ‌డం త‌ప్పితే మ‌రేత‌ర క‌రోనా ల‌క్ష‌ణాలు గుఫాన్‌కు లేకున్నా వైద్యులు కోవిడ్ టెస్టు చేయాల‌ని సూచించారు. దాంతో త‌ల్లిదండ్రులు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించారు. ఆ స‌మ‌యంలో గుఫాన్‌ ముక్కులో వేసిన స్వాబ్ స్టిక్ లోప‌లే విరిగిపోయి అత‌నికి శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. అది గ్రహించిన వైద్యులు బాలుడి ముక్కుకు స‌ర్జ‌రీ చేశారు. అనంత‌రం స్టిక్ ముక్క‌ను తొలిగించామ‌ని, గుఫాన్‌కు ఏ స‌మస్య లేద‌ని చెప్పారు. 


ఈ క్ర‌మంలో కొద్దిసేప‌టి త‌ర్వాత బాలుడికి మెలుకువ వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న గుఫాన్ త‌ల్లి.... కుమారుడు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌టం గ్ర‌హించింది. వెంట‌నే అక్క‌డ ఉన్న ఆస్ప‌త్రి సిబ్బందిని త‌న కుమారుడిని ప‌రీక్షించాల్సిందిగా చెప్పింది. కానీ, రాత్రి స‌మ‌యం కావ‌డంతో డాక్ట‌ర్లు లేర‌ని, బాలుడిని చూడ‌టం కుద‌ర‌ద‌ని చెప్పారు సిబ్బంది. అయితే, ఉద‌యం లేచేస‌రికి గుఫాన్ అచేత‌నంగా పడి ఉండ‌టం చూసిన త‌ల్లి వెంట‌నే న‌ర్సుల‌తో ఈ విష‌యం చెప్పింది. బాలుడు శ్వాస తీసుకోవ‌డం లేద‌ని గ్రహించిన న‌ర్సులు వెంట‌నే వైద్యుల‌కు స‌మాచారం అందించారు. దాంతో వైద్యులు హూటాహూటిన గుఫాన్‌ను వెంటిలేట‌ర్‌పైకి త‌ర‌లించారు. స్కాన్ చేసిన వైద్యుల‌కు అత‌ని ఊపిరితిత్తుల్లోని ఓ శ్వాస‌నాళం మూసుకుపోయిన‌ట్లు తేలిసింది. దాంతో ఆప‌రేష‌న్ కోసం వెంట‌నే రియాద్‌లోని స్పెషాల్టీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. కానీ, అంబులెన్స్ రావ‌డానికి గంట‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది. అప్ప‌టికే గుఫాన్ ప్రాణాలు కోల్పోయాడు. గుఫాన్ త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా విల‌పించిన తీరు అక్క‌డి వారిని కంట‌త‌డి పెట్టించింది. 

Updated Date - 2020-07-15T16:11:04+05:30 IST