వ్యాక్సిన్ వేసుకుంటేనే మక్కాలోకి అనుమతి: సౌదీ

ABN , First Publish Date - 2021-04-06T12:41:39+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. రంజాన్

వ్యాక్సిన్ వేసుకుంటేనే మక్కాలోకి అనుమతి: సౌదీ

రియాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. రంజాన్ మాసం మొదలైన నాటి నుంచి ఇమ్యూనిటీ కలిగి ఉన్న వారు మాత్రమే ఉమ్రా తీర్థయాత్ర చేసేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్నవారు, గడిచిన 14 రోజుల్లో ఒక డోస్ తీసుకున్న వారు లేదా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు మాత్రమే ఉమ్రా చేసేందుకు అనుమతి ఉండనున్నట్టు స్పష్టం చేసింది. మక్కా మసీదులో జరిగే ప్రార్థనలలో పాల్గొనే వారికి కూడా ఇవే నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది. 


ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. హజ్ యాత్ర వరకు ఇవే ఆంక్షలు కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గతేడాది హజ్ యాత్రకు కేవలం పది వేల మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఏడాది ఎంతమందికి అనుమతినిస్తుందో వేచి చూడాలి. 2019లో హజ్ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ముస్లింలు వెళ్లారు. ఇదిలా ఉంటే.. సౌదీలో ఇప్పటివరకు 3.93 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. 6,700 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ డోస్‌ ఇచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది.

Updated Date - 2021-04-06T12:41:39+05:30 IST