సంకీర్తనోద్యమ పితామహుడు

ABN , First Publish Date - 2022-03-18T05:30:00+05:30 IST

భారత దేశంలో పదిహేను-పదిహేడు శతాబ్దాల మధ్య భక్తి ఉద్యమం అత్యున్నత స్థాయికి చేరింది. ఆ భక్తి ఉద్యమకారులలో... సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి.....

సంకీర్తనోద్యమ పితామహుడు

నేడు శ్రీ చైతన్య మహాప్రభు జయంతి


భారత దేశంలో పదిహేను-పదిహేడు శతాబ్దాల మధ్య భక్తి ఉద్యమం అత్యున్నత స్థాయికి చేరింది. ఆ భక్తి ఉద్యమకారులలో... సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసి, ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు.


చైతన్య మహాప్రభువును సాక్షాత్తూ శ్రీకృష్ణుడిగా పలువురు భక్తులు విశ్వసిస్తారు. ఆయన ప్రారంభించిన సంకీర్తనోద్యమం కుల, మత, వర్ణ, వృత్తి, స్రీ, పురుష భేదాలకు అతీతంగా... సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికోన్నతిని సాధించే అవకాశాన్ని అందించింది. సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించిన తరువాత... శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమ ప్రచారం కోసం భారత దేశమంతటా విస్తృతంగా పర్యటించారు. భక్తితత్త్వాన్ని ప్రజలకు బోధించారు. 


అత్యంత పాపభూయిష్టమైన జీవనాన్ని గడిపేవారు తమ దురలవాట్లను విడిచిపెట్టేలా, పవిత్రమైన భగవన్నామాలను జపించేలా చేయడం శ్రీచైతన్యుల సంకీర్తనోద్యమం సాధించిన గొప్ప విజయం. నవద్వీపంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జగాయ్‌, మాదాయ్‌ అనే సోదరులు చెడు సావాసాల కారణంగా మద్యానికి బానిసలై, స్త్రీలోలురై, దొంగతనాలకు అలవాటు పడి, అనేక పాపకార్యాలు చేసేవారు. వారిని గమనించిన  శ్రీ చైతన్య మహాప్రభు అనుచరుడు శ్రీ నిత్యానంద ప్రభు... హరి నామాన్ని జపించాల్సిందిగా వారిని కోరారు. ఆగ్రహించిన ఆ సోదరులు నిత్యానంద ప్రభును గాయపరిచారు. వారిని శిక్షించడానికి శ్రీ చైతన్య మహాప్రభు సిద్దపడినప్పటికీ, నిత్యానంద ప్రభు విజ్ఞప్తి మేరకు శాంతించారు. తమ తప్పును తెలుసుకున్న ఆ సోదరులు మహా ప్రభువు పాదాలమీద పడి, క్షమించాలంటూ శరణు వేడారు. ఇక మీదట పాపకృత్యాలు చేయబోమని మాట ఇస్తేనే క్షమిస్తానని చైతన్య మహాప్రభు చెప్పి, ఆ విధంగా ప్రమాణం చేయించారు. అనంతరం ఆ సోదరులు భగవంతుణ్ణి ఆశ్రయించి, గొప్ప భక్తులై తరించారు. 


అలాగే సాకార మల్లిక్‌, దబీర్‌ ఖాస్‌ అనే సోదరులు అప్పటి బెంగాల్‌ రాజ్యాన్ని పాలిస్తున్న నవాబ్‌ హుస్సైన్‌ షా ఆస్థానంలో మంత్రులు. వారు బ్రాహ్మణులైనా, అప్పటి మహమ్మదీయుల దండయాత్రల వల్ల ప్రభావితులై... నవాబుల ఆస్థానంలో చేరి, పాలనలో కీలకపాత్ర పోషించేవారు. శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమం గురించి తెలుసుకున్న ఆ సోదరుల హృదయాల్లో భగవద్భక్తి మేలుకుంది. ఉన్నతోద్యోగాలను వదిలేసి, మహా ప్రభును ఆశ్రయించారు. వారే సనాతన గోస్వామి, రూప గోస్వాములుగా మారి... శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశానుసారం గౌడీయ వైష్ణవ తత్త్వాన్ని, శాస్త్ర సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తమ రచనల్లో అక్షరబద్ధం చేశారు. ఆ పరంపరకు ఆద్యులయ్యారు.


శ్రీ చైతన్యుల ముఖ్య అనుచరుల్లో ఒకరైన హరిదాస ఠాకూర్‌ మహమ్మదీయ కుటుంబంలో జన్మించారు. సంకీర్తనోద్యమం పట్ల ఆకర్షితులైన ఆయన ప్రతి రోజూ మూడు లక్షల హరినామాలను జపించేవారు. హరిదాస ఠాకూర్‌ దీక్షాతత్పరతలను మెచ్చిన శ్రీచైతన్యులు ఆయనకు ‘నామాచార్య’ అనే బిరుదు ఇచ్చారు. శ్రీచైతన్య మహాప్రభు కృప కులమతాతీతంగా భాసిల్లిందనడానికి హరిదాస ఠాకూర్‌ చరితమే నిదర్శనం. 


‘ఈ పృథ్విపై ఉన్న ప్రతి నగరాన, గ్రామాన నా నామాన్ని జపించెదరు’ అంటూ ఆనాడు శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన  భవిష్యవాణిని సార్థకం చేస్తూ... భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఈ సంకీర్తనోద్యమాన్ని పశ్చిమ దేశాలకూ వ్యాప్తి చేసి, మహా ప్రభువు బోధనలను విశ్వమానవాళికీ చేరవేశారు. శ్రీచైతన్య మహాప్రభు అడుగుజాడల్లో నడుస్తూ,  తన శిష్యులకు మద్యం, జూదం, వ్యభిచారం, మాంసాహారాలకు దూరంగా ఉండాలనే నాలుగు నియమాలను సూచించారు. ఈ పరివర్తనతో వారిలో పెంపొందిన సత్ప్రవర్తన, సద్గుణాలను మాత్రమే అర్హతలుగా... వైదిక శాస్త్ర నిర్దేశానుసారం అన్ని వర్గాల వారికీ దీక్షను అనుగ్రహించారు. శ్రీల ప్రభుపాద ఏర్పాటు చేసిన ‘కృష్ణ చైతన్య సంఘం’లోని సభ్యులు సుశిక్షితమైన జీవన విధానాన్ని గడుపుతూ ఎందరినో కృష్ణ చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. సామాజిక పరివర్తన కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.


శ్రీ చైతన్య మహాప్రభు పదిహేనవ శతాబ్దంలో (1486) పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా నవద్వీప మాయాపూర్‌లో... పరమ భక్తులైన శ్రీజగన్నాథ మిశ్రా, శచీదేవి దంపతులకు జన్మించారు. ఆయన బాల్య నామం ‘విశ్వంభర’, ముద్దు పేరు ‘నిమాయ్‌’. ఇరవై నాలుగేళ్ళ వయసు వరకూ ఆయన నవద్వీపంలోనే బ్రహ్మచర్య ఆశ్రమాన్నీ, గృహస్థ జీవనాన్నీ గడిపారు. ఆయన భార్య లక్ష్మీప్రియా దేవి చిన్న వయసులోనే మరణించగా... మళ్ళీ వివాహం చేసుకోవాలని తల్లి ఆయనను కోరారు. ఆమె మాట ప్రకారం శ్రీ విష్ణుప్రియా దేవిని శ్రీ చైతన్యులు వివాహం చేసుకున్నారు. 


సన్న్యాసం స్వీకరించిన తరువాత... తల్లి ఆనతి మేరకు శ్రీ జగన్నాథపురి (పూరీ)లో శ్రీ చైతన్య మహాప్రభువు ఇరవై నాలుగేళ్ళు నివసించారు. ఆరు సంవత్సరాలు శ్రీమద్భాగవతాన్ని ప్రచారం చేస్తూ దక్షిణభారతదేశమంతటా పర్యటించారు. అలాగే భగవద్గీత ఉపదేశాలను ఆచరణీయ పద్ధతిలో ప్రచారం చేశారు. ఈ భూలోకంలో 48 సంవత్సరాల పాటు తన దివ్య లీలలను ఆయన ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన ఆ సంకీర్తనోద్యమం శ్రీల ప్రభుపాద ద్వారా  ‘హరేకృష్ణ’ సంకీర్తనోద్యమంగా ప్రపంచవ్యాప్తమయింది. నేటికీ వారి శిష్యుల ద్వారా కొనసాగుతోంది. 


సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, అధ్యక్షుడు, 

‘హరే కృష్ణ మూవ్‌మెంట్‌’, హైదరాబాద్‌, 

9396956984

Updated Date - 2022-03-18T05:30:00+05:30 IST