Basara IIIT రగడ: నూతన డైరెక్టర్‌గా Satish kumar నియామకం

ABN , First Publish Date - 2022-06-16T20:01:10+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వీరి నిరసనల మధ్యే ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియామకం జరిగింది.

Basara IIIT రగడ: నూతన డైరెక్టర్‌గా Satish kumar నియామకం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వీరి నిరసనల మధ్యే ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.


కాగా... 12 డిమాండ్లతో బాసర ట్రిపుల్ ఐటీ మెయిన్ గేటు వద్ద గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.  విద్యార్థులు గేటు వైపు దూసుకురాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు.  మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారికి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విధంగా తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా క్యాంపస్ ఎస్పీ కంట్రోల్‌లో ఉంది... తాగునీరు, విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించాలి’’ అని విద్యార్థులు ట్వీట్ చేశారు.


మంత్రి సబితారెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థుల ఆగ్రహం

విద్యార్థుల ఆందోళనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసి వ్యాఖ్యలపై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవి సిల్లీ డిమాండ్లు అని మంత్రి పేర్కొనడం దారుణమన్నారు. ‘‘హైదరాబాద్‌లో ఉండి మాట్లాడటం కాదు... ఇక్కడికి వచ్చి చూడాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ తీరు బాగోలేదని, చర్చలకు పిలిచి బెదిరించారని విద్యార్థులు తెలిపారు. 

Updated Date - 2022-06-16T20:01:10+05:30 IST