తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్‌ చంద్ర శర్మ

ABN , First Publish Date - 2021-10-10T07:42:18+05:30 IST

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ.. పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా రానున్నారు.

తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్‌ చంద్ర శర్మ

  • రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
  • ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు జస్టిస్‌ పీకే మిశ్రా
  • ఒకేసారి 13 మంది సీజేల నియామకానికి ఆమోదం
  • ఎనిమిది మందికి పదోన్నతి, ఐదుగురు సీజేల బదిలీ
  • సుప్రీం కొలీజియం సిఫారసులకు గ్రీన్‌ సిగ్నల్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయ శాఖ


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ.. పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా రానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సెప్టెంబరు 16న చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం మూడు వారాల్లోనే ఆమోదించింది. ఈ మేరకుకేంద్ర న్యాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ సోమవారం రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. 


చిన్న వయసులోనే సీనియర్‌ న్యాయవాదిగా.. 

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ 1961 నవంబరు 30న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. 1984లో హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆ ఏడాది టాపర్‌గా నిలవడంతోపాటు యూనివర్సిటీ నుంచి మూడు బంగారు పతకాలు సాధించారు. 1984లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజ్యాంగ వ్యవహారాలు, సర్వీస్‌, సివిల్‌, క్రిమినల్‌ విభాగాల్లో అనేక కేసులను వాదించి.. ఉత్తమ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 42 ఏళ్ల వయసులోనే సీనియర్‌ న్యాయవాదిగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి గుర్తింపు సాధించి.. ఆ హైకోర్టులో అతిపిన్న వయస్కుడైన సీనియర్‌ న్యాయవాదిగా పేరుపొందారు. 2008లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు జడ్జిగా, 2010లో శాశ్వత జడ్జిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరిలో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయి.. ఆగస్టు 31 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 


ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కు పదోన్నతి కల్పించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయశాఖ నియమించింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఏకే గోస్వామి ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి, గతంలో గుజరాత్‌ హోంశాఖ మంత్రిగా పనిచేసిన అమిత్‌ షాను ఒక కేసులో సీబీఐ కస్టడీకి పంపిన నేపథ్యం ఉన్న జస్టిస్‌ ఎ.ఎ.ఖురేషి కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు. చిన్న రాష్ట్రమైన త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఖురేషిని రాజస్థాన్‌ వంటి పెద్ద రాష్ట్రానికి బదిలీ చేయాలని సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని కూడా కేంద్రం ఆమోదించింది. 

Updated Date - 2021-10-10T07:42:18+05:30 IST