Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

తెలంగాణలో ఎలా ఉంటావో చూస్తామని నన్ను బెదిరించారు

twitter-iconwatsapp-iconfb-icon

ఆలయాల్లో మసాజ్‌ సెంటర్లు అసత్య ప్రచారం

నా నిధి గళమే.. హైదరాబాద్‌లో నాకున్నది ఇళ్లు, మూడు ఎకారలు

గిట్టకే నాపై ఆరోపణలు.. దర్మం నిత్య జీవితంలో భాగం

కేసీఆర్‌ను మంచిగా మాట్లాడమని చెప్పానంతే..

వందల ఎకరాలేం లేవు.. నిజమని నిరూపిస్తే వారికే రాసిస్తా

ఓపెన హార్ట్‌ విత్ ఆర్కేలో సత్యవాణి వ్యాఖ్యలు


దైవభక్తి, దేశభక్తి తప్ప భూమి భుక్తి, ఆస్తుల రక్తి లేనేలేవని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకురాలు సత్యవాణి స్పష్టం చేశారు. సొసైటీని నడపడంలో, ఆలయాల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు, కబ్జాలకు పాల్పడలేదని వివరించారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో 04-11-2013న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆమె తన మనోభావాలను పంచుకున్నారు. 


ఆర్కే: ఆధ్మాత్యిక సత్యవాణిగా పేరున్న మీరు ఏపీఎన్జీవోల సభ తరువాత సమైక్యాంధ్ర సత్యవాణి అయ్యారు. పాపులారిటీ కూడా వచ్చింది. అదంతా ఎలా జరిగింది?

సత్యవాణి: పాపులారిటీ అంటే నాకు భయం. మనిషి పతనం మొదలయ్యేది అక్కడే. కాబట్టే 20 ఏళ్లుగా పేరు బయటకు రాకుండా ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఏపీఎన్జీవోల సభకు వెళ్లడం.. ఓ దైవ ఘటన. ఇంటికి ఒకరు రావాలని నిర్వాహకులు కోరడంతో వెళ్లాను. సచివాలయంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడంతో కొందరు సీమాంధ్ర ఉద్యోగినులు తారసపడి పట్టుబట్టి మరీ మాట్లాడించారు. అప్పటికే రాష్ట్ర పరిణామాలపై ఆవేదనతో ఉన్నాను. వివిధ పార్టీల జాతీయ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాను. కాబట్టి, అప్పటికప్పుడు సభలో సమైక్యవాదం వినిపించాననడం సరికాదు.


ఆర్కే: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించారు కదా?

సత్యవాణి: అది సద్విమర్శ మాత్రమే. తమ్ముడూ.. అని ఆయనను సంబోధించాను. వాడుతున్న భాష గురించి మాత్రమే అభ్యంతరపెట్టాను. మంచిగా మాట్లాడుకుందామన్నాను. ఆ సభ తర్వాత నాపై విమర్శలు నిజం. వాటిని పట్టించుకోలేదు... నవ్వుకున్నాను. కానీ, విజ్ఞులు, విద్యాధికులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారేమిటని మాత్రం బాధపడ్డాను.


ఆర్కే: ఆధ్యాత్మికపరులెవరూ సమైక్యాంధ్ర, విభజనల గురించి మాట్లాడటం లేదుకదా?

సత్యవాణి: జాతి ఇక్కడే పొరపడుతున్నది. ధర్మం నిత్య జీవితంలో భాగం. అయినా.. తెలుగు వారి మధ్య మూడో మనిషి జోక్యానికి వీలు కల్పించవద్దని మాత్రమే నేను చెప్పాను. నిజానికి, నా ధర్మ ప్రచారాన్ని ఆదరిస్తున్నవారిలో తెలంగాణవారే ఎక్కువ. కపటంలేని వారి జీవనవిధానమంటే నాకు చాలా ఇష్టం. ఎన్జీవోల సభ తరువాత ఆ ప్రాంతానికి చెందిన చాలామంది అభినందించారు. అయితే.. నా మాటలను నెగెటివ్‌గా తీసుకుని, ఎవరైనా బాధపడి ఉంటే, మన్నించమనడానికీ సిద్ధమే.


ఆర్కే: ఆ సభ తరువాత మీపై విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. వాటిలో వాస్తవమెంత?

సత్యవాణి: ఒక్కటీ లేదు. ట్యాంకర్లు పెట్టి.. నీటి వ్యాపారం చేస్తున్నానని ఆరోపించారు. అయితే.. 1.30లక్షలు పెట్టి హైదరాబాద్‌లో 1989లో ఒక ఎకరం కొన్నాను. మా గుడిలో పూజలు చేసే తిరుపతయ్యకు పక్షవాతం వచ్చింది. ఆ భూమిని ఆయనకు ఇచ్చాను. అక్కడున్నది ఒక బోరు మాత్రమే. దానితో నీటి వ్యాపారం చేసే పరిస్థితి ఆ పొలంవద్ద లేదు. అయితే, ఎవరో నా పొలం పక్కన ట్యాంకర్లు పెట్టి తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. పక్కనున్న ఐదెకరాలు నావేననీ అసత్యప్రచారం చేశారు. కానీ, అది ఫరీద్‌ అనే రైతుది. ఇక ఆలయాల్లో (ధర్మపురి) మసాజ్‌ సెంటర్లున్నాయని, సరస్వతి ఆలయాన్ని సగం చూపించి గెస్ట్‌హౌస్‌ నడిపిస్తున్నానని ప్రచారం చేశారు. అలాగే.. భూమి కబ్జాలను అడ్డుకునేందుకు 20 ఏళ్లుగా పోరాడుతున్న నాపై ఇప్పుడు అవే ఆరోపణలు రావడం విచిత్రం. మియాపూర్‌లో సర్వే నం.101లో కొంత భూమి ఉంది. రికార్డులమేరకు గతంలో అది రహమున్నీసా బేగం అనే ఆమె పేరిట ఉంది. ఇప్పడది ఐదు సొసైటీల కింద 20ఏళ్లుగా వివాదంలో ఉంది. శ్రీదీప్తినగర్‌ హుడా లే-అవుట్‌ కింద కొందరు ఇళ్లు కూడా కట్టుకున్నారు.


ఆర్కే: సొసైటీ భూములను అమ్మారని ఆరోపణలు వినిపించాయి. అందులో వాస్తవమెంత?

సత్యవాణి: 1981-82లో మా సోదరుడి ద్వారా సొసైటీతో పరిచయం ఏర్పడింది. నాకు అక్కడ 266 గజాల స్థలం ఉంది. నా వైపు నుంచి 600మందికిపైగా చేర్పించాను. అందరి కోరికతో వెంకట్రామ్‌నగర్‌ వెల్ఫెర్‌ సొసైటీలో కన్‌స్ట్రక్షన్‌ విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతున్నాను. ఒక్క తెలంగాణ నుంచే 600మందికిపైగా సొసైటీలో ఉన్నారు. అంతేగానీ సొసైటీ భూములను అమ్మాననేది వాస్తవం కాదు. 1995లో ఒక నాయకుడు కబ్జాకు ప్రయత్నించగా, న్యాయపోరాటం చేశాం. ఇప్పుడది సుప్రీంకోర్టు విచారణలో ఉంది. యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. 2004లో వైఎస్‌ వచ్చాక, స్థలాల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. నేను ఒప్పుకోలేదు గానీ, మిగతా సభ్యుల మాటకు తలొగ్గాను. సుప్రీంకోర్టు కూడా క్రమబద్ధీకరణకు అంగీకరించింది. కాకపోతే, తన తీర్పు ప్రకారం ఆ ప్రక్రియ జరగాలని స్పష్టంచేసింది. ఇప్పుడా ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌ లో ఉంది. ఈలోగా కొందరు నాపై మీడియాలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మార్వో బహిరంగ విచారణ జరిపారు. సొసైటీ స్థలాలపై మొదటినుంచీ కన్నేసిన కొందరు బ్రోకర్లు, నాయకులు అక్కడ నా వాదనను రికార్డు కానీయలేదు. ‘‘నువ్వు తెలంగాణలో ఎలా ఉంటావో చూస్తాం’’ అంటూ తోసేశారు. సొసైటీ సభ్యులు వచ్చినా మాట్లాడనీయలేదు. ఎమ్మార్వో కూడా వాళ్ల వాదననే రికార్డు చేసుకొని వెళ్లిపోయారు.


ఆర్కే: దురాక్రమణ జరిగినట్టు ఎమ్మార్వో కూడా నివేదిక ఇచ్చారు కదా?

సత్యవాణి: ఎమ్మార్వో బహిరంగ విచారణ జరిపారు. నివేదికలో ఏం చెప్పారో తెలియదు.

తెలంగాణలో ఎలా ఉంటావో చూస్తామని నన్ను బెదిరించారు

ఆర్కే: మీ ధర్మ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి?

సత్యవాణి: ధర్మ ప్రచారానికి ప్రతినిధులు తప్ప నిధులు అక్కర్లేదు. నా నిధి గళమే. ‘‘మీ గళం గంభీరమైంది’’ అంటూ జాతి పునరుజ్జీవ నాయకుడు మోపిదేవి కృష్ణస్వామి ఆశీస్సులు అందించగా, నా ధర్మ ప్రచార ఆకాంక్షను కంచి పరమాచార్యులు ఆశీర్వదించారు. ప్రచారానికి వెళితే నిర్వాహకులే ఖర్చులు భరిస్తారు. సత్యపథం అనే పత్రిక నడిపిస్తున్నాను. తొలినుంచీ ఆలయ నిర్వహణపై ఆసక్తి లేదు. ఇప్పుడు వివాదం చేస్తున్న ఆలయం విషయమూ అంతే. ఒక చెట్టు కింద ఉన్న అమ్మవారికి అక్కడున్న సర్పంచ్‌ గుడి కట్టించాలని ప్రయత్నించి సగం పనిచేశారు. ఒకసారి ప్రతిష్టాపనకు వెళ్లినప్పుడు, గుడిని పూర్తి చేస్తే బాగుంటుందనిపించింది. అక్కడి పూజారికి మేమే జీతమిచ్చి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేశాం. అందరూ కోరడంతో నిర్వహణను స్వీకరించాను. అదే ధర్మపురి క్షేత్రం.


ఆర్కే: అక్కడి ఆలయాల్లో మసాజ్‌ సెంటర్లు నడుపుతున్నారని, సుబ్బారావుతో కలిసి అంతా ఊడ్చేశారనీ మీపై అభియోగాలు... ఏమంటారు?

సత్యవాణి: అలాంటిదేమీ లేదు. సుబ్బారావు ఆ భూమికి ట్రస్టీ. ఆయన ఉండగా ఆలయాల పని కొంత జరిగింది. ఆయన వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు. శ్రీదర్మపురి క్షేత్రంలో 14 ఆలయాలు నిర్మితమయ్యాయి. నేను ధర్మకర్తను మాత్రమే.


ఆర్కే: శివబాలయోగి మహరాజ్‌ ట్రస్టు, నాంపల్లి బాబా ట్రస్టుల విషయం ఏమిటి?

సత్యవాణి: తేళ్ల లక్ష్మీకాంతం అనే నాయకురాలు శంషాబాద్‌లో తన 20 ఎకరాలను శివబాలయోగి మహరాజ్‌ ధ్యాన మందిరం కోసం ఇచ్చారు. అది విమానాశ్రయం కింద పోయింది. అప్పటి సీఎం వైఎస్‌ సూచన మేరకు పరిహారంగా ధర్మపురి క్షేత్రంలో కొంతభూమిని మందిరానికి కేటాయించాం. నాం పల్లి బాబా ట్రస్టును దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నది. ఆలయాల నిర్వహణ నుంచి తప్పుకోవాలని చాలాకాలంగా నాకుంది. కానీ, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ, స్వరూపానందస్వామి, టీటీడీ అధికారి సుబ్రహ్మణ్యం సహా అందరూ వారించారు.


ఆర్కే: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?

సత్యవాణి: మాది కృష్ణాజిల్లా నూజివీడు మండలం ముసునూరు. మా మేనత్త ఆధ్యాత్మికపరురాలు. నైటింగేల్‌ అనే నర్సు జీవితం గురించి విని డాక్టర్‌ని కావాలనుకున్నాను. స్కూల్లో భరతమాత వేషం వేసినప్పుడు.. దేశసేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాను. 19వ యేట వివాహం జరిగింది. భర్త చంద్రశేఖరరావుది హైదరాబాద్‌. 1969లో ఇక్కడకు వచ్చాను. పిల్లల్లో అబ్బాయి బిల్డర్‌, అమ్మాయి సైకాలజిస్టు.


ఆర్కే: హైదరాబాద్‌లో మీకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి?

సత్యవాణి: యూసఫ్‌గూడలో ఇల్లుంది. ఒక ఎకరం పొలం ఉంది. రిజిస్ర్టేషన్‌ సమస్యల వల్ల ప్రస్తుతం అది వివాదంలో ఉంది. నాకు రెండు ఎకరాలభూమి ఉన్నదనేది అవాస్తవం. ఇక ఐదుగురం కలిసి పటాన్‌చెరులో తలో రెండు ఎకరాలు తీసుకున్నాం. అంతకుమించి హైదరాబాద్‌లో ఆస్తులేవీ లేవు. వందల ఎకరాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సత్యదూరం. ఉంటే వారికే రాసిచ్చేస్తా. ఇదం న మమః అనేది నా సిద్ధాంతం. ఉన్నది దానం చేయడమే గానీ, దాచుకోవాలనే, దోచుకోవాలనే తలంపు లేదు. పసుపుకుంకుమ కింద నాన్న ఇచ్చిన 11 ఎకరాల పొలం ఊళ్లో ఉంది. నా భర్త మిలిటరీ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేశారు. ఆయన అత్యంత నిజాయతీపరుడు. ఇప్పటికీ బస్సులోనే ప్రయాణిస్తారు. మా అత్త సుశీలాబాయి ఉత్తమ గుణసంపన్నురాలు. ఆమె ప్రేరణతో సౌశీల్య అకాడమీ స్థాపించి, విలువలతో కూడిన విద్యను ప్రచారం చేస్తున్నాను. సమాజంలో పడిపోతున్న విలువలను పునరుద్ధరించడం ధ్యేయంగా ‘భారతీయం’ ప్రారంభించాం.


ఆర్కే: మీ జీవిత లక్ష్యం ఏమిటి?

సత్యవాణి: రాబోయే తరాలను సంస్కరించడం లక్ష్యం. కనిపించని, కనిపించే స్ఫూర్తిప్రదాతలను నమూనాలుగా చూపించి యువతను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆ కృషిని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.