సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి ప్రతీక

ABN , First Publish Date - 2022-08-19T08:35:52+05:30 IST

తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి ప్రతీక

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆయన తెలంగాణ జాతికే గర్వకారణం: రాష్ట్ర మంత్రులు

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల నివాళి


హైదరాబాద్‌, రవీంద్రభారతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్‌ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 372వ జయంతి సందర్భంగా పాపన్న వీరగాధను సీఎం కేసీఆర్‌ గురువారం స్మరించుకున్నారు. నాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాచరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకంచేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ తెలంగాణ జాతికే గర్వకారణమని రాష్ట్ర మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతీలో ఘనంగా నిర్వహించిన పాపన్న గౌడ్‌ జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం బహుజనుల పక్షపాతి అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ సందర్భంగా అన్నారు. భావితరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తిని అందించేందుకు ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోందని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న ఒక కులానికి పరిమితం కాదని యావత్‌ తెలంగాణతో పాటు జాతి ఆస్తి అని గంగుల కమలాకర్‌ అన్నారు.  మరోపక్క, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లోనూ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు.  మొఘల్‌ పాలకులను గడగడలాడించి బహుజనుల అభివృద్ధి కోసం అధికారం చేపట్టిన సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆదర్శప్రాయుడని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్‌ అన్నారు. గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసిన ధీరుడు  పాపన్న అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-08-19T08:35:52+05:30 IST