సంజయ్ జైలుకు
ABN , First Publish Date - 2022-01-04T08:17:45+05:30 IST
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
- కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసులపై దాడి
- చేసినట్లు సంజయ్‌తోపాటు 16 మందిపై కేసులు
- కరీంనగర్ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
- 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
- మరో నలుగురు బీజేపీ నేతలకు కూడా రిమాండ్
- కేంద్ర హోంమంత్రికి, గవర్నర్‌కు సంజయ్ ఫిర్యాదు
- సభాహక్కుల ఉల్లంఘన కింద పోలీసులపై
- చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ
- బండి సంజయ్ అరెస్టును ఖండించిన జేపీ నడ్డా
- కేసీఆర్ ప్రభుత్వాన్ని పెకలించి వేస్తామని ప్రకటన
- తెలంగాణలో పశ్చిమ బెంగాల్ ఫార్ములా నడవదు
- గవర్నర్ నివేదిక వస్తే హోంశాఖ చర్యలు: కిషన్‌రెడ్డి
- ముఖ్యమంత్రి రూపంలో 8వ నిజాం: రాజాసింగ్
- బీజేపీ నేతల నిరసనలను అడ్డుకున్న పోలీసులు
- ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గృహ నిర్బంధం
- నేడు ట్యాంక్‌బండ్‌పై బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు ఎక్సైజ్ మెజిస్ర్టేట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలంటూ కరీంనగర్‌లో జాగరణ దీక్షకు పూనుకున్న సంజయ్‌ని పోలీసులు ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో 16 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశారు. సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్‌తోపాటు పార్టీ నాయకులు పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కచ్చు రవి, మర్రి సతీశ్‌ను కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి మెజిస్ట్రేట్ ఈ నెల 17 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరు నిందితులు తప్పించుకున్నారని, వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. అంతకుముందు మానకొండూర్ పోలీ్‌సస్టేషన్ నుంచి బండి సంజయ్‌ని పోలీసులు ఎల్‌ఎండీ సమీపంలోని సిటీ పోలీసు ట్రైనింగ్ సెంటర్ (సీపీటీసీ)కు తరలించి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు బీజేపీ నేతలు కరీంనగర్‌కు చేరుకొని సంజయ్‌ని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు. మధ్యాహ్నం వరకు కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, పోలీసు కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సీపీటీసీ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతారవణం నెలకొంది. మధ్యాహ్నం 1:10 నిమిషాలకు భారీ పోలీసు బందోబస్తు, కాన్వాయ్‌తో బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచారు. కాగా, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడంతోపాటు పోలీసులపై, మహిళా పోలీసులపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేసినందుకే బండి సంజయ్‌ను, ఇతర నాయకులను అరెస్టు చేశామని కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ అన్నారు. సోమవారం సీపీటీసీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
కక్షలో భాగంగానే సంజయ్ అరెస్టు: నడ్డా
బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు బీజేపీ భయపడబోదని తెలిపారు. పూర్తి శక్తితో కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాల పట్ల బీజేపీ కార్యకర్తలు పోరాటాన్ని కొనసాగిస్తారని, తెలంగాణ నుంచి అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని పెలికించే వరకు విశ్రమించబోమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో కేసీఆర్ సర్కారు ఆందోళన చెందుతోందన్నారు. కాగా, విపత్తు చట్టం విపక్షాలకే వర్తిస్తుందా? సీఎం కేసీఆర్ కుటుంబానికి వర్తించదా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎ్‌సకు ఒక నీతి, మిగతా పార్టీలకు మరో నీతా? అని నిలదీశారు. బండి సంజయ్‌పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని తాము అడగబోమని, న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని ప్రకటించారు.
సోమవారం ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో కలిసి ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఎంపీ కార్యాలయాన్ని బద్దలుకొట్టి బండి సంజయ్‌ని అరెస్టు చేయడం వంటి చర్యల పట్ల పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. హౌస్ అరెస్టులు చేయడం రాష్ట్రంలో పోలీసులకు అలవాటయిందని, ఏ ప్రాతిపదికన హౌస్ అరెస్టులు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ‘‘ఇది పశ్చిమ బెంగాల్ రాజ్యం కాదు. మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అమలు చేస్తామంటే కుదరదు. నియంతృత్వానికి వ్యతిరేకంగా త్యాగాలు చేసిన చరిత్ర తెలంగాణకు ఉంది’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలకు పూర్తి స్థాయిలో భంగం కలిగినప్పుడు గవర్నర్ నివేదిక వస్తే హోంశాఖ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే కారణంతో చర్యలు తీసుకుంటే టీఆర్‌ఎస్ వాళ్లకు జైళ్లు సరిపోవన్నారు. కాగా, తెలంగాణలో ముఖ్యమంత్రి రూపంలో 8వ నిజాం ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో గూండా రాజ్యం సాగుతోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో టీఆర్‌ఎ్‌సకు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బండి సంజయ్‌కి ప్రభుత్వం ప్రాణహాని తలపెట్టే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం అనుమానం వ్యక్తం చేశారు. జైల్లో ఆహారంలో విషం కలిపే ప్రమాదం ఉందన్నారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఈటల హౌస్ అరెస్ట్
బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేపట్టకుండా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సోమవారం మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్.గౌతమ్‌రావు ఆధ్వర్యంలో నగర బీజేపీ కార్యాలయంలో దీక్ష చేపట్టాలని నిర్ణయించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయాన్ని పూర్తిగా దిగ్బంధం చేశారు. ఇక భువనగిరిలో బీజేపీ నాయకులు సోమవారం రాత్రి చేపట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష ప్రారంభమైన వెంటనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఆ పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా అడ్డుకోవటంతో తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. అయినా ఆయనను అదుపులోకి తీసుకొని కార్యకర్తలను చెదరగొట్టారు.
నేడు ట్యాంక్‌బండ్‌పై బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీ
బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఆదివారం రాత్రి నుంచే ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగా.. సోమవారం నాటి పరిణామాలతో మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సంజయ్‌కి సంఘీభావంగా ఏయే కార్యక్రమాలు చేయాలో పార్టీ జాతీయ నాయకత్వమే రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. తెలంగాణలో చీకటిరాజ్యం సాగుతోందన్న సంకేతాలను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేలా మంగళవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కనీసం 10 వేల మంది పాల్గొనేలా చూడాలని ఆదేశించింది. ఆరెస్సెస్ సమావేశాలకు హాజరయ్యేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. అనంతరం బుధవారం చలో కరీంనగర్ చేపట్టి జాతీయ, రాష్ట్ర నాయకులంతా కదలివెళ్లాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్దేశించినట్లు సమాచారం. నడ్డా కూడా కరీంనగర్ వెళ్లి బండి సంజయ్‌ని పరామర్శించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ముగ్గురు సభ్యుల ఎంపీల బృందం, మంగళవారం కరీంనగర్‌ను సందర్శించనుంది. రాష్ట్ర పార్టీ నిరసన కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అప్పగించారు.
టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం
ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జోక్యం చేసుకోండి.. అమిత్‌షా, గవర్నర్‌లకు సంజయ్ లేఖ
టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ యం త్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడానికి పోలీసు, అధికార యంత్రాగాన్ని వినియోగిస్తోందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన కారణంగా రాష్ట్రం భయం గుప్పిట్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాతోపాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్‌కు సంజయ్ లేఖ రాశారు. జీవో 317కు వ్యతిరేకంగా కార్యక్రమం చేపడితే పోలీసులు గ్యాస్ కట్టర్లలో ఇనుప గేట్లను కత్తిరించి తన కార్యాలయంలోకి ప్రవేశించారని, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని, తమకు అక్రమంగా అరెస్టు చేశారని వివరించారు.
చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా తప్పుడు కేసులు పెట్టి తనతోపాటు మరికొంత మందిని రిమాండ్‌కు పంపించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. బీజేపీ నేతలపై దాడు లు చేయాల్సిందిగా సీఎంతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలను బహిరంగంగా రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇక తనపై దాడి చేసి అక్రమంగా అరెస్టు చేసినందుకు కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ-మెయిల్ ద్వారా స్పీకర్‌కు లేఖ రాశారు. సీపీ తన కాలర్ పట్టుకొని లాగారని, అక్రమంగా నిర్బంధించి.. అరెస్టుకు కారణాలు కూడా తెలపలేదని వివరించారు. తెలంగాణ ప్రభు త్వం తనను వేధిస్తోందని, తప్పుడు కేసులు పెడుతోందని తెలిపారు.
